Hyderabad Rains Update : హైదరాబాద్‌లో కుమ్మేసిన వాన- మరో రెండు రోజులు ఇదే వెదర్
Hyderabad Rains Update : హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో కురిసిన వర్షం వాతావరణాన్ని మార్చేసింది. మరో రెండు రోజులు ఇదే పరిస్థితి కొనసాగుతుందని వాతావరణ శాఖ చెబుతోంది.

Hyderabad Rains Update : ద్రోణి ప్రభావంతో హైదరాబాద్‌లో వర్షం దంచి కొట్టింది. గాలి వాన కుమ్మేసింది. పలు చోట్ల వడగళ్లు కూడా పడ్డాయి. ఈ వర్షం కారణంగా హైదరాబాద్ వాతావరణం ఒక్కసారిగా కూల్ అయింది. ఉరుములు మెరుపులతో సడెన్‌గా కురిసిన వర్షానికి అక్కడక్కడ ట్రాపిక్ జామ్ అయింది. కొన్ని చోట్ల విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది.
వాతావరణ శాఖ ముందు నుంచి చెబుతున్నట్టుగానే శుక్రవారం తెలంగాణ వ్యాప్తంగా అకాల వర్షాలు కుమ్మేశాయి. ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, హైదరాబాద్ రంగారెడ్డి, మెదక్ జిల్లాల్లో గాలిన వానలు బీభత్సం సృష్టించాయి. ముఖ్యంగా కూకట్ పల్లి, హైదర్ నగర్, ఆల్విన్ కాలనీ, నిజాంపేట, ప్రగతి నగర్, బాచుపల్లి, మూసాపేట, సికింద్రాబాద్, బోయిన్ పల్లి, తిరుమలగిరిలో కుండపోత వాన కురిసింది.
ఒక్కసారిగా కురిసిన వాన నగర ప్రజలను పరుగులు పెట్టించింది. గాలి వానకు చెట్లు విరిగి పడ్డాయి. విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. పలు ప్రాంతాల్లో డ్రైనేజీ నీళ్లు పొంగిపొర్లాయి. ట్రాఫిక్ కూడా జామ్ అయింది. అప్రమత్తమైన అధికారులు ప్రజలకు ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకున్నారు. నీటి నిల్వ ఉన్న ప్రాంతాలకు సిబ్బందిని పంపించి పూడికలు తీశారు. విద్యుత్ సరఫరాను పునరుద్ధరించారు.
హైదరాబాద్‌లో మరో రెండు రోజులు వాతావరణం ఇలానే ఉంటుందని అధికారులు చెబుతున్నారు. ప్రజలతం అప్రమత్తంగా ఉండాలని సూచించారు. రెండు రోజుల పాటు ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పడతాయని అంటున్నారు. హైదరాబాద్‌లో శనివారం కూడా ఆకాశం పాక్షికంగా మేఘావృతమై ఉంటుందని అధికారులుతెలిపారు. ఉదయం వేళల్లో పొగమంచు ఉంటుందని పేర్కొన్నారు. మధ్యాహ్నం ఎండగా కుమ్మేసిన సాయంత్రానికి ఉరుములు మెరుపులతో కూడిన జల్లులు పలు ప్రాంతాల్లో పడే అవకాశం ఉంది. గరిష్ట ఉష్ణోగ్రతలు 36డిగ్రీలు కనిష్ట ఉష్ణోగ్రత 22 డిగ్రీలు నమోదు కావచ్చని చెబుతోంది. శుక్రవారం గరిష్ట ఉష్ణోగ్రత 35.8 డిగ్రీలు, కనిష్ట ఉష్ణోగ్రత 22.6 డిగ్రీలు నమోదు అయ్యాయి.
ఒక్క హైదరాబాద్‌లోని కాకుండా తెలంగాణలోని పలు జిల్లాల్లో కూడా అకాల వర్షం కురిసింది. ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్‌ల్లోని పలు ప్రాంతాల్లో ఉరుములు మెరుపులు, వడగళ్లతో కూడిన వర్షం పడింది. ఈ గాలివానకు రైతులు తీవ్ర ఇబ్బంది పడ్డారు. నిజామాబాద్ జిల్లాలో ధర్పల్లి, ఇందల్వాయి మండలాల్లో కురిసిన వాన వల్ల పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది.
మెదక్ పట్టణంలోని జంబికుంట వీధిలో పిడుగు పడి ఓ ఇల్లు ధ్వంసమైంది. ఇంట్లో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. మెదక్ జిల్లాలో మెదక్, పాపన్నపేట మండలాల్లో కురిసిన గాలి వానకు మామిడి పంట తీవ్రంగా నష్టోయింది. కరీంనగర్‌లోని చొప్పదండి మార్కెట్లో అమ్మకానికి తీసుకొచ్చిన మొక్కజొన్న పూర్తిగా నీటపాలైంది. సిద్ధిపేట జిల్లాలో దుబ్బాక, మిర్దొడ్డి, తొగుట మండలాల్లో వర్షానికి కూడా రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
తెలంగాణ వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలకు ప్రభుత్వం అప్రమత్తమైంది. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సీఎస్‌తో మాట్లాడారు. పరిస్థితిపై ఆరా తీశారు. జిల్లా కలెక్టర్లతో సీఎస్ టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. క్షేత్రస్థాయి అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మరో రెండు రోజులు వర్షాలు పడే అవకాశం ఉందని అప్పటి వరకు ప్రజలకు అందుబాటులో ఉండాలని సూచించారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

