Rains In Telangana : తెలంగాణలో చల్లబడిన వాతావరణం- పలు జిల్లాల్లో గాలివాన బీభత్సం
Rains In Telangana :ఉమ్మడి ఆదిలాబాద్ , కరీంనగర్ జిల్లాల్లో గాలివాన బీభత్సం సృష్టించింది. అక్కడ పరిస్థితిని సీఎస్ సమీక్షించారు. 48 అప్రమత్తంగా ఉండాలని అధికారులకు ఆదేశించారు.

Rains In Telangana : తెలంగాణలో ఫిబ్రవరి నుంచే ఈసారి ఎండలు మంటపుట్టిస్తున్నాయి. బయటకు రావాలంటేనే భయపడిపోయే పరిస్థితి వచ్చింది. సాధారణ ఉష్ణోగ్రతలు కంటే ఐదారు డిగ్రీలు ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదు అవుతూ వచ్చాయి. ఉక్కపోతతో అల్లాడిపోతున్న జనాలకు కాస్త ఉపశనం కలిగించాడు వరుణుడు. పలు జిల్లాల్లో కురిసిన గాలి వాన రైతులకు కీడు చేస్తున్నా ప్రజలకు మాత్రం చల్లదనం పంచింది.
కుమ్రం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాలో గాలివాన
కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాతోపాటు మంచిర్యాల జిల్లాలో శుక్రవారం పలు ప్రాంతాల్లో వడగళ్ల వాన దంచికొట్టింది. గత పదిరోజుల నుంచి రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరగ్గా.. ఎండ వేడిమికి ప్రజలు అల్లాడిపోయారు. ద్రోణి ప్రభావంతో వర్షాలు కురుస్తుండటంతో ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టాయి. మరో 2 రోజులపాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు.
కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని కాగజ్ నగర్ మండల కేంద్రంలో ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. రేండ్లగూడలో వడగండ్ల వాన కురువగా.. పలువురు రైతుల పంట దెబ్బతింది. ద్వారకానగర్‌లో గాలివాన బీభత్సానికి ఓ ఇంటి గోడకూలి కూలిపోయింది. కన్యకా పరమేశ్వరి ఆలయ సమీపంలో గాలివాన బీభత్సానికి చెట్లు నేలకొరిగాయి. ఈ దెబ్బకు విద్యుత్ స్తంభాలు ఒరిగిపోయాయి. విద్యుత్ తీగలు కూడా తెగిపడ్డాయి. అదృష్టవశాత్తు అక్కడ ఎవరులేకపోవడంతో ప్రమాదం తప్పింది.
@CEO_Telangana @TelanganaCS @DCsofIndia @IASassociation @TelanganaDGP @CommissionrGHMC @TelanganaCMO @GHMCOnline @HYDTP @IasTelangana @tg_weather pic.twitter.com/hcPFLPIiTc
— Meteorological Centre, Hyderabad (@metcentrehyd) March 21, 2025
సంజీవయ్య కాలనీలోను ఇళ్ళపైన చెట్లు పడ్డాయి. కాగజ్‌నగర్ పట్టణంలోని పోచమ్మగుడి ముందు ఉన్న సుమారు 150 సంవత్సరాల వృక్షం నేలకొరిగింది. ఆ స్థలంలో ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. కొద్దిసేపు అక్కడ కొంతమంది ముచ్చట్లు పెడుతూ ఉండేవారని గాలివాన బీభత్సానికి అందరూ వెళ్లిపోయారు. అనంతరమే అక్కడ చెట్టు కూలింది.
కాగజ్నగర్ పట్టణంలోని ఫారెస్ట్ ఆఫీస్ రోడ్డు ముందు, అటూ ఇస్గావ్ సమీపంలో రోడ్డుపైనే చెట్లు నేలకొరగడంతో ట్రాఫిక్ సమస్య ఏర్పడింది. ఎక్కడికి అక్కడ వాహనాలు నిలిచిపోయాయి. విషయం తెలుసుకున్న మున్సిపల్ అధికారులు విద్యుత్ శాఖ సిబ్బంది పరిస్థితి చక్కదిద్దారు. నేలకొరిగిన చెట్ల పక్కకు దీశారు. విద్యుత్ స్తంభాలు సరిచేశారు.
కాగజ్నగర్ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బురదగూడ సమీపంలో ఈదురుగాలులకు రహదారిపై విద్యుత్ తీగలు పడిపోవడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. విషయం తెలుసుకున్న కాగజ్‌నగర్ రూరల్ ఎస్ఐ సందీప్ కుమార్ వెంటనే స్పందించి సిబ్బందితో కలిసి మరమ్మతులు చేపట్టారు. రాకపోకలు పునః ప్రారంభమయ్యాయి.
మంచిర్యాల జిల్లాలోనూ భారీ వర్షం కురిసింది. మంచిర్యాల జిల్లాలోని లక్షట్ పేట మండలంలో అత్యధికంగా గాలివాన బీభత్సం సృష్టించింది. లక్షెట్టిపేట ప్రాంతంలోని వెంకట్రావుపేటతోపాటు సమీప గ్రామాల్లో వడగండ్ల వాన కురిసింది. మామిడి పంట ధ్వంసమైంది. మొక్కజొన్న పంటలు నాశనమైంది. గాలివాన బీభత్సానికి చెట్లు నేలకొరిగాయి. నష్టపోయిన బాధితులను ప్రభుత్వం ఆదుకోవాలని బాధితులు వేడుకుంటున్నారు.
ఉమ్మడి ఆదిలాబాద్ , కరీంనగర్ జిల్లాలలో నేడు కురిసిన వడగళ్ల వానలతో ప్రభుత్వం అలర్ట్ అయింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి జిల్లా కలెక్టర్లతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. అక్కడి పరిస్థితులు సమీక్షించారు. వడగళ్ళ వాన వలన నెలకొన్న పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. జిల్లా యంత్రాంగం ప్రజలకు అందుబాటులో ఉండి అవసరమైన సహాయక చర్యలు అందించాలని ఆదేశించారు. రానున్న 48 గంటలలో భారీ ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని సూచన ఉన్నందున అధికారులందరూ అప్రమత్తంగా ఉండాలని సి.ఎస్ చెప్పారు. జిల్లా యంత్రాంగం ఎప్పటికప్పుడు పరిస్థితులను సమీక్షిస్తూ ప్రజలకు అందుబాటులో ఉండాలన్నారు. ఆస్తి, ప్రాణ నష్టం జరగకుండా ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని సి.ఎస్ సూచించారు. అకాల వర్షాల వలన ఏర్పడే నష్టాల అంచనాలను ఏప్పటికప్పుడు ప్రభుత్వానికి నివేదికలు అందించాలన్నారు.
EVENING LOCAL FORECAST FOR HYDERABADCITY & NEIGHBOURHOOD DATED:21.03.2025 @CEO_Telangana @TelanganaCS @DCsofIndia @IASassociation @TelanganaDGP @CommissionrGHMC @TelanganaCMO @GHMCOnline @HYDTP @IasTelangana @tg_weather pic.twitter.com/oD16L23lBV
— Meteorological Centre, Hyderabad (@metcentrehyd) March 21, 2025
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

