Betting Apps Crime News: బెట్టింగ్ యాప్‌లో భారీగా నష్టపోయి యువకుడు ఆత్మహత్య, తెలంగాణలో మరో విషాదం
Betting Apps Promotion Case: ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్‌లో భారీగా నష్టపోయి ఓ యువకుడు ఆత్మహత్యాయత్నం చేశాడు. కరీంనగర్ లోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడు.

Karimnagar Crime News |పెద్దపల్లి: బెట్టింగ్ యాప్‌లు జీవితాలు నాశనం చేస్తున్నాయి. కేవలం కేసులు నమోదు చేసినా, ఎవరి మీదా చర్యలు తీసుకోకపోవడంతో యథేచ్చగా సెలబ్రిటీలు, ఇన్‌ఫ్లూయెన్సర్లు ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేశారు. ఇన్నేళ్లు సమస్య గాలికొదిలేసిన పోలీస్ శాఖ ఈ మధ్య అప్రమత్తమైంది. కానీ అప్పటికే చాలా ఆలస్యమైంది. ఇదివరకే ఎంతో మంది బెట్టింగ్ యాప్ లలో డబ్బులు పెట్టి భారీగా నష్టపోవడంతో ఆత్మహత్యలు చేసుకున్నారు. తాజాగా మరో యువకుడ్ని ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్ బలిగొంది. గడ్డి మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసిన యువకుడు మృతిచెందాడు.
అసలేం జరిగిందంటే..
పెద్దపల్లి జిల్లా మంథని మండలం విలోచవరం గ్రామానికి చెందిన కోరవేన సాయి తేజ గోదావరిఖనిలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో పనిచేస్తున్నాడు. సాయితేజ గత కొంతకాలం నుంచి ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్‌లలో నగదు పెట్టాడు. బెట్టింగ్‌లో తీవ్రంగా నష్టపోవడం, అప్పుల బాధ పెరగడంతో మూడు రోజుల కిందట రామగిరి మండలం సింగిరెడ్డిపల్లి గ్రామ శివారులో సాయితేజ గడ్డి మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. ఇది గమనించి అతడ్ని కరీంనగర్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించినా ప్రయోజనం లేకపోయింది. మూడు రోజుల చికిత్స అనంతరం శుక్రవారం నాడు సాయితేజ మృతిచెందడంతో అతడి కుటుంబంలో విషాదం నెలకొంది. చేతికి అంది వచ్చిన కొడుకు బెట్టింగ్ యాప్స్ తో నష్టపోయి ఆత్మహత్య చేసుకోవడాన్ని కుటుంబసభ్యులు జీర్ణించుకోలేక పోతున్నారు.
ఇలాంటి మరెన్నో కుటుంబాలు బెట్టింగ్ యాప్స్ కారణంగా రోడ్డున పడుతున్నాయి. చేతికి అందివచ్చిన కొడుకు తమను చూసుకుంటాడని తల్లితండ్రులు కలలు కంటుంటే.. యువతను మభ్యపెట్టేలా ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్స్‌ను సినీ నటులు, సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్లు ప్రమోట్ చేశారు. తక్కువ సమయంలో మీ తెలివితో డబ్బులు సంపాదించుకుంటే మీరు మంచి ఇల్లు కట్టుకోవచ్చు, కొనుక్కోవచ్చు, లైఫ్ లో త్వరగా సెటిల్ అవుతారంటూ సినీ నటులు, యూట్యూబర్లు చేసే బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ చూసి నిజమనుకుని యువకులు ఎక్కువ వడ్డీలకు అప్పులు చేసి మరీ బెట్టింగ్ పెట్టి భారీగా నష్టపోయి ఆత్మహత్య చేసుకుంటున్న కేసులు పెరిగిపోయాయి.
Betting Apps Promotion Case: తెలంగాణలో ఇటీవల పలువురు సినీ సెలబ్రిటీలు, సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్లపై కేసులు నమోదు చేశారు. యాంకర్లు శ్యామల, విష్ణుప్రియ, జబర్దస్త్ కమెడియన్ రీతూ చౌదరి, బిగ్ బాస్ ఫేం టెస్టీ తేజ, నటులు విజయ్ దేవరకొండ, దగ్గుబాటి రానా, బయ్యా సన్నీ యాదవ్ సహా పలువురిపై కేసులు నమోదు చేసిన పోలీసులు నోటీసులు ఇచ్చారు. ఒక్కొక్కరుగా విచారణకు హాజరవుతున్నారు.






















