Kohli 51st Century: విరాట పర్వం.. సెంచరీతో కోహ్లీ వీరవిహారం, భారత్ ఘన విజయం.. టోర్నీ నుంచి పాక్ ఔట్!
INDIA vs PAKISTAN: ఈ మ్యాచ్ లో విజయంతో భారత్ దాదాపుగా సెమీస్ కు చేరుకుంది. వచ్చేనెల 2న న్యూజిలాండ్ తో చివరి మ్యాచ్ ఆడనుంది. ఇక తాజా ఓటమితో పాకిస్థాన్ దాదాపు టోర్నీ నుంచి నిష్క్రమించింది.

India vs Pakistan Champions Trophy 2025 Live Updates: విరాట్ కోహ్లీ అజేయ సెంచరీ ( 111 బంతుల్లో 100 నాటౌట్, 7 ఫోర్లు) చెలరేగడంతో చిరకాల ప్రత్యర్థితో పాకిస్థాన్ తో జరిగిన మ్యాచ్ లో భారత్ 6 వికెట్లతో ఘన విజయం సాధించింది. ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీలో భాగంగా గ్రూపు-బిలో జరిగిన మ్యాచ్ లో సునాయసంగా గెలుపొందింది. దుబాయ్ లో జరిగిన ఈ మ్యాచ్ లో టాస్ నెగ్గి తొలుత బ్యాటింగ్ చేసిన పాక్.. 49.4 ఓవర్లలో 241 పరుగులకు ఆలౌటైంది. సౌద్ షకీల్ (62) అర్థ సెంచరీతో సత్తా చాటాడు. బౌలర్లలో కుల్దీప్ యాదవ్ మూడు వికెట్లు తీశాడు. ఛేదనను భారత్ 42.3 ఓవర్లలో 4 వికెట్లకు 244 పరుగులు చేసి పూర్తి చేసింది. శ్రేయస్ అయ్యర్ ( 67 బంతుల్లో 57, 5 ఫోర్లు, 1 సిక్సర్) అర్థ సెంచరీతో రాణించాడు. బౌలర్లలో షాహిన్ షా ఆఫ్రిదికి రెండు వికెట్లు దక్కాయి. అబ్రార్ అహ్మద్ (1/28) పొదుపుగా బౌలింగ్ చేశాడు. ఈ మ్యాచ్ లో విజయంతో భారత్ దాదాపుగా సెమీస్ కు చేరుకుంది. వచ్చేనెల 2న న్యూజిలాండ్ తో చివరి మ్యాచ్ ఆడనుంది. ఇక తాజా ఓటమితో పాకిస్థాన్ దాదాపు టోర్నీ నుంచి నిష్క్రమించింది. అద్భుతం జరిగితే తప్ప పాక్ సెమీస్ కు చేరుకోదు. దీంతో టోర్నీకి ఆతిథ్యమిస్తూ లీగ్ దశలోనే ఇంటిముఖం పట్టినట్లయ్యింది. కోహ్లీకే ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది.
Big Game 🏟️
— BCCI (@BCCI) February 23, 2025
Big Player 😎
Big Knock 💥
King for a reason 👑
Updates ▶️ https://t.co/llR6bWyvZN#TeamIndia | #PAKvIND | #ChampionsTrophy | @imVkohli pic.twitter.com/oMOXidEGag
సచిన్ రికార్డు సమం..
ఈ మ్యాచ్ లో సెంచరీ ద్వారా కోహ్లీ.. సచిన్ రికార్డును సమం చేశాడు. అంతర్జాతీయంగా ఒక ఫార్మాట్ లో అత్యధిక సెంచరీలు చేసిన ప్లేయర్ గ్ సంయుక్తంగా రికార్డులో భాగస్వామ్యమయ్యాడు. టెస్టుల్లో సచిన్ 51 సెంచరీలు చేయగా, వన్డేల్లో కోహ్లీ 51 సెంచరీలు చేశాడు. మరో సెంచరీ చేస్తే ఈ రికార్డు పేరు కూడా తన పేరిట లిఖించుకుంటాడు. ఇక ఛేదనలో ఆరంభంలోనే భారత్ కు ఎదురుదెబ్బ తగిలింది. ఫామ్ లో ఉన్న కెప్టెన్ రోహిత్ శర్మ (20) త్వరగా వెనుదిరిగాడు. దీంతో శుభమాన్ గిల్ (46)తో కలిసి రెండో వికెట్ కు 79 పరుగులు జోడించాడు. దీంతో భారత్ కు మంచి పునాది దక్కింది. అయితే అబ్రార్ అహ్మద్ చక్కని బంతితో గిల్ ను ఔట్ చేసి మ్యాచ్ ను మలుపుతిప్పాడు.
సూపర్ భాగస్వామ్యం..
గిల్ ఔటైన తర్వాత క్రీజులోకి వచ్చి శ్రేయస్ తో కోహ్లీ చక్కగా ఆడాడు. సింగిల్, డబుల్స్ తో స్ట్రైక్ రొటేట్ చేస్తూ, స్కోరుబోర్డును పరుగులెత్తించాడు. కుదురుకున్న తరవాత పాక్ బౌలర్లను వీరిద్దరూ చక్కగా ఆధిపత్యం కొనసాగించారు. ఈ క్రమంలో 62 బంతుల్లో కోహ్లీ, 63 బంతుల్లో శ్రేయస్ ఫిఫ్టీ పూర్తి చేసుకున్నాడు. ఆ తర్వాత శ్రేయస్ ఔటవడంతో ఒక్కసారిగా మ్యాచ్ లో ఉత్కంఠ నెలకొంది. కోహ్లీ సెంచరీ చేస్తాడా..? లేదా అనే టెన్షన్ స్టార్ట్ అయింది. హార్దిక్ పాండ్యా (8) బ్యాటింగ్ కు రావడంతో కోహ్లీ సెంచరీ కష్టమనిపించింది. అయితే అతను ఔట్ కావడం, అక్షర్ పటేల్ (3 నాటౌట్) సహకరించడంతో మ్యాచ్ ఆఖరి బంతికి బౌండరీ కొట్టి కోహ్లీ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. కోహ్లీ కెరీర్ లో ఇది 82వ అంతర్జాతీయ సెంచరీ కావడం విశేషం. ఓవరాల్ గా వన్డేల్లో 51, టెస్టుల్లో 30, టీ20ల్లో ఒక సెంచరీ కోహ్లీ ఖాతాలో ఉన్నాయి. అలాగే అంతకుముందు 14వేల పరుగుల మైలురాయిని చేరుకోవడంతోపాటు 158 క్యాచ్ లతో అత్యధిక క్యాచ్ లు పట్టిన భారత ప్లేయర్ గా నిలిచాడు. మిగతా పాక్ బౌలర్లలో ఖుష్ దిల్ షాకు ఒక వికెట్ దక్కింది.




















