SLBC Tunnel Rescue operation: వారిని టన్నెల్ నుంచి బయటకు తేవడం కష్టమే, లోపల భయానక పరిస్థితి: మంత్రి జూపల్లి
SLBC Rescue operation: ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ లోపల చిక్కుకున్న వారిని సురక్షితంగా బయటకు తేవడం అంత తేలిక కాదని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. కానీ ప్రయత్నాలు కొనసాగిస్తామని చెప్పారు.

నాగర్‌కర్నూలు: శ్రీశైలం ఎడమ గట్టు కాలువ (SLBC Tunnel) సొరంగం లోపల చిక్కుకున్న వారిని బయటకు తీసుకురావడం చాలా కష్టంగా మారిందని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. టన్నెల్ లోపల ప్రమాదం జరిగిన చోట పరిస్థితి దారుణంగా లేదు, అంత ఆశాజనకంగా లేదన్నారు. SLBC టన్నెల్ లోపల చిక్కుకున్న ఇంజినీర్లు, ఉద్యోగులు, సిబ్బందిని సురక్షితంగా బయటకు తీయడం కష్టంగా ఉందన్నారు.
ఘటన తీవ్రత చాలా ఎక్కువగా ఉందని, నీటి తీవ్రత ధాటికి టన్నెల్ బోరింగ్ మెషీన్ కొట్టుకొచ్చిందని మంత్రి జూపల్లి పేర్కొన్నారు. మరో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో కలిసి రెస్క్యూ ఆపరేషన్ పనులను జూపల్లి పర్యవేక్షిస్తున్నారు. శనివారం ఉదయం నాగర్ కర్నూలు జిల్లా దోమలపెంట సమీపంలో ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ లో 14వ కి.మీ వద్ద పైకప్పు కూలిపోవడంతో 8 మంది లోపల చిక్కుకుపోయారు. మరో 40 మంది వరకు బయటకు పరిగెత్తి, ఆపై లోకో ట్రైన్లో బయటకు వచ్చేశారు.

మంత్రులు ఉత్తమ్, జూపల్లి అధికారులతో కలిసి లోకో ట్రైన్‌లో సొరంగం లోపలికి వెళ్లి పరిశీలించి వచ్చారు. అనంతరం మంత్రి జూపల్లి కృష్ణారావు మీడియాతో మాట్లాడుతూ.. ప్రమాద తీవ్రత అధికంగా ఉంది. ఇది మానవ తప్పిదం కాదు. కానీ దురదృష్టవశాత్తూ ఇలాంటి ఘటన జరిగింది. సొరంగంలో కిలోమీటర్ మేర నీరు, బురద ఉన్నాయి. వాటిని తోడేసే పనులను రెస్క్యూ టీమ్ చేస్తోంది. టన్నెల్ లోపలికి ఆక్సిజన్ పంపుతున్నాం. శనివారం రాత్రి నుంచి రెస్క్యూ టీమ్స్ నిరంతరాయంగా పనిచేస్తున్నాయి.
నాగర్ కర్నూలు జిల్లా దోమలపెంట వద్ద జరిగిన ఎస్‌ఎల్‌బీసీ ప్రమాద సహాయక చర్యలను నిరంతరం సమీక్షిస్తున్నాను.
— Komatireddy Venkat Reddy (@KomatireddyKVR) February 23, 2025
ఇండియన్ ఆర్మీ, NDRF బృందంల సహకారంతో రాష్ట్ర ప్రభుత్వం నిర్విరామంగా సహాయక చర్యలు చేపడుతున్నది.
సంఘటనలో గాయపడిన వారికి మెరుగైన వైద్య చిక్సిత అందించడంతోపాటు, టన్నెల్ లో…
టన్నెల్ లోపల భయానక పరిస్థితి
టన్నెల్ బోరింగ్ మిషన్‌కు చేరువగా రెండు రెస్క్యూ టీమ్స్ వెళ్లాయి. టన్నెల్ లో ప్రమాదం జరిగిన చోట పరిస్థితి భయంకరంగా ఉంది. నీటి ఉద్ధృతికి బోరింగ్ మిషన్ సైతం కొద్దిదూరం కొట్టుకొచ్చింది. సహాయక చర్యలు చేపట్టేందుకు అవసరమయ్యే మెషిన్లను లోపలికి తీసుకెళ్లే పరిస్థితి కనిపించడం లేదు. లోపలి నుంచి ఎలాంటి శబ్దాలు రావడం లేదు. కార్మికులను ఎంత పిలిచినా అటువైపు నుంచి స్పందన లేదు. పట్టు వదలకుండా చివరి వరకు ప్రయత్నాలు కొనసాగించి వారిని సురక్షితంగా బయటకు వచ్చేందుకు ప్రయత్నిస్తాం’ అని మంత్రి జూపల్లి తెలిపారు.
బయటకు తీసుకురావడం కష్టమే
SLBC టన్నెల్ లోపల చిక్కుకున్న వారిని బయటకు తీసుకురావడం కష్టమేనని సింగరేణి క్వారీస్ జనరల్ మేనేజర్ శ్రీనివాస్ రెడ్డి అన్నారు. టన్నెల్ లోపల 14 నుంచి 11 కిలోమీటర్ల వరకు నీళ్లు ఆగిపోయి ఉన్నాయని.. రెండు సార్లు టన్నెల్ లోపల పరిస్థితులను పరిశీలించినట్లు తెలిపారు. అయితే లోపల చిక్కుకున్న వారిని సురక్షితంగా బయటకు తీసుకురావడం కష్టం, కానీ ప్రయత్నిస్తూనే ఉంటామన్నారు.






















