మంత్రి కొండపల్లి శ్రీనివాస్ బొత్స కాళ్లు మొక్కారా?
మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తన కాళ్ళు మొక్కాడన్న ప్రచారంపై మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ స్పందించారు. ఆ విషయంపై తాను మాట్లాడబోనని అన్నారు. దాన్ని ఎవరు క్రియేట్ చేసుకున్నారో, వారే తేల్చుకోవాలని.. తనకేమీ సంబంధం లేదని అన్నారు. కొండపల్లి శ్రీనివాస్ మీద ఏం కోపం ఉందో.. ఎందుకు అలా చేస్తున్నారో అని బొత్స అన్నారు. ఆమదాలవలసలోని మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం ఇంటికి ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ వచ్చారు. తమ్మినేని కుమారుడుకి ఇటీవల మేజర్ సర్జరీ కావడంతో పరామర్శించిన సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు. మరోవైపు, తాను కాళ్లు మొక్కినట్లు జరుగుతున్న ప్రచారంపై కొండపల్లి శ్రీనివాస్ కూడా స్పందించారు. అసెంబ్లీ సమయంలో నవంబరు 11న లాబీలో ఇతర ఎమ్మెల్యేలతోపాటు కూర్చొని ఉండగా బొత్స సత్యనారాయణ అటువైపు రావడంతో అందరితోపాటు లేచి సంస్కారంతో పలకరించానని.. అంతకుమించి ఏమీ జరగలేదని తెలిపారు. ప్రతిపక్షం సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నానని చెప్పారు.