Kohli Vs BCCI: బీసీసీఐ రూల్ పై కోహ్లీ అసంతృప్తి.. తనకు మాత్రం అదే ముఖ్యమంటున్న విరాట్..
ఒక పర్యటన 45 రోజుల కంటే ఎక్కువగా జరిగితే కేవలం 2 వారాలపాటు మాత్రమే తమతో ఫ్యామిలీలు ఉండేలా ఆటగాళ్లకు వెసులుబాటు కల్పించారు. ఆర్సీబీ ఏర్పాటు చేసిన సమావేశంలో కోహ్లీ దీనిపై మాట్లాడాడు.

Virat Kohli Comments: ఆస్ట్రేలియా పర్యటన తర్వాత బీసీసీఐ తీసుకొచ్చిన పది పాయింట్ల ఫార్మాలాపై భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ అసంతృప్తి వ్యక్తం చేశాడు. ఆటగాళ్ల నుంచి ఫ్యామిలీ మెంబర్లను దూరం చేయడం సరి కాదని వ్యాఖ్యానించాడు. ఆసీస్ టూర్ లో భారత ఘోర ప్రదర్శన తర్వాత బీసీసీఐ చాలా మార్పులు చేసింది. డొమెస్టిక్ క్రికెట్ ఆడటం, అందరూ కలిసి ఒకే బస్సులో ప్రయాణించడం, వ్యక్తిగత భద్రతా సిబ్బందిని తొలగించడం, లగేజీలో కోతతోపాటు ఆటగాళ్లు తమ వెంట ఫ్యామిలీ మెంబర్లను తీసుకెళ్లే విషయంపై కూడా కఠిన నిబంధనలు విధించింది. 45 రోజులలోపు జరిగే పర్యటనలకు ఫ్యామిలీ మెంబర్లను అనుమతించరు. అదే ఒక పర్యటన 45 రోజుల కంటే ఎక్కువగా జరిగితే కేవలం రెండు వారాలపాటు మాత్రమే తమతో ఫ్యామిలీ మెంబర్లు ఉండేలా ఆటగాళ్లకు వెసులుబాటు కల్పించారు. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు తాజాగా ఏర్పాటు చేసిన సమావేశంలో కోహ్లీ దీనిపై మాట్లాడాడు. ఆటగాళ్లతోపాటు ఫ్యామిలీ మెంబర్ల ఉంటే, ఆటలోని ఒత్తిడిని అధిగమించవచ్చని పేర్కొన్నాడు.
తను ఫ్యామిలీకే ప్రాధాన్యం..
తన ఫ్యామిలీ మెంబర్స్ తనతోపాటు ఉండేదుంకు ప్రాధాన్యం ఇస్తానని కోహ్లీ తెలిపాడు. ఆటగాళ్లకు క్లిష్టమైన పరిస్థితులు ఎదురైనప్పుడు, ఓదార్పు నివ్వడానికి, తిరిగి గాడిన పడేందుకు ఫ్యామిలీ సభ్యులు అందుబాటులో ఉంటే బాగుంటుందని వ్యాఖ్యానించాడు. తను మాత్రం ఎక్కడికి వెళ్లినా, ఫ్యామిలీ మెంబర్లతో వెళ్లేందుకే ప్రాధన్యత ఇస్తానని వ్యాఖ్యానించాడు. ఆటగాళ్లతో ఫ్యామిలీ మెంబర్స్ ఉండటం వల్ల బ్యాలెన్స్, మెంటల్ స్టెబిలిటీ ఉంటుందని వ్యాఖ్యానించాడు. ఆసీస్ టూర్ లో కోహ్లీ ఘోరంగా విఫలమయ్యాడు. పదే పదే ఔట్ సైడ్ ఆఫ్ బంతులకు ఔటయ్యి, విమర్శల పాలయ్యాడు. అయితే ఇటీవల ముగిసిన ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీలో అంచనాలకు అనుగుణంగా రాణించాడు. చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్ పై అజేయ సెంచరీ, సెమీస్ లో ఆస్ట్రేలియాపై 84 పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడాడు. మొత్తం మీద టోర్నీలో భారత్ తరపున రెండో అత్యధిక పరుగులు నమోదు చేసిన ప్లేయర్ గా కోహ్లీ నిలిచాడు.
ఐపీఎల్ కు సిద్ధం..
ఐపీఎల్ 18వ సీజన్ కు విరాట్ సిద్ధమవుతున్నాడు. తను ప్రాతినిథ్యం వహిస్తున్న ఆర్సీబీకి తొలి టైటిల్ అందించేందుకు ప్రయత్నిస్తున్నాడు. ఈ సీజన్ లో సరికొత్తగా ఆర్సీబీ బరిలోకి దిగుతోంది. రజత్ పాటిదార్ నాయకత్వంలో మెగాటోర్నీలో అడుగుపెట్టనుంది. ఈనెల 22న ఐపీఎల్ ప్రారంభమవుతుండగా, అదే రోజు కోల్ కతాలోని ఈడెన్ గార్డెన్స్ మైదానంలో జరిగే మ్యాచ్ లో డిఫెండింగ్ చాంపియన్స్ కోల్ కతా నైట్ రైడర్స్ తో ఆర్సీబీ తల పడనుంది. ఇక ఈ టోర్నీలో గత 17 ఏళ్ల నుంచి ఆడుతున్న ఆర్సీబీ మూడుసార్లు ఫైనల్ కు చేరినా, రన్నరప్ తోనే సరిపెట్టుకుంది. ఈసారైనా కప్పు సాధించాలని ఆ జట్టు అభిమానులు కోరుకుంటున్నారు. ఇక ఐపీఎల్లో అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్ గా కోహ్లీ నిలిచాడు. 252 మ్యాచ్ ల్లో 8004 పరుగులు చేశాడు. 131.97 స్ట్రైక్ రేట్ తో తను ఈ పరుగులు సాధించాడు. ఇందులో ఎనిమిది సెంచరీలు, 55 ఫిఫ్టీలు ఉన్నాయి.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

