KTR Resign Challenge: ఒక్కటి నిరూపించినా BRS ఎమ్మెల్యేలంతా రాజీనామా- కేటీఆర్ ఛాలెంజ్‌ను ప్రభుత్వం స్వీకరిస్తుందా?
Telangana News | తెలంగాణలో ఏ గ్రామంలోనైనా 100 శాతం రుణమాఫీ పూర్తి చేసినట్లు నిరూపించినా, 24 గంటలు విద్యుత్ ఇస్తున్నట్లు నిరూపించినా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలం రాజీనామా చేస్తామన్నారు కేటీఆర్.
KTR says All BRS MLAs will resign | హైదరాబాద్: కాంగ్రెస్ పాలనలో 24 గంటలు విద్యుత్ ఇస్తున్నట్లు నిరూపిస్తే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మొత్తం రాజీనామా చేస్తాని మాజీ మంత్రి, ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సవాల్ విసిరారు. లేకపోతే రైతు రుణమాఫీ ఎక్కడైనా నూటికి నూరు పాళ్లు జరిగినట్లు నిరూపించినా బీఆర్ఎస్ సభ్యులు మొత్తం రాజీనామాకు సిద్ధమన్నారు. కొడంగల్ , సిరిసిల్ల, కొండారెడ్డి పల్లి, పాలేరు నియోజకవర్గాలకు వెళ్దాం. ఎక్కడైనా సరే 100 శాతం రుణమాఫీ జరిగి ఉంటే రాజీనామాకు సిద్ధమని.. స్పీకర్ ఫార్మాట్ లో రాజీనామా చేస్తామని ఛాలెంజ్ విసిరారు కేటీఆర్. సభలో ఏ టాపిక్ వచ్చినా సరే.. మీరు పూర్తి చేశారని నిరూపిస్తే, వంద శాతం అమలు చేశారని కాంగ్రెస్ నిరూపిస్తే మేమంతా రాజీనామాకు సిద్ధమంటూ వరుస ఛాలెంజ్‌లు విసురుతూ వచ్చారు కేటీఆర్. ఎవరు అధికారంలో ఉన్నా వంద శాతం అమలు సాధ్యం కాదన్న నమ్మకంతోనే కేటీఆర్ అలా అంటున్నారా అనే వాదన తెరపైకి వస్తోంది.
24 గంటల విద్యుత్ నిరూపిస్తే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు రాజీనామా
కేటీఆర్ మాట్లాడుతూ.. ‘బీఆర్ఎస్ హయాంలో సాగు విస్తీర్ణం పెరిగినా కాంగ్రెస్ ప్రభుత్వం మాపై దుష్ప్రచారం చేస్తోంది. 2019-20లో 141 లక్షల ఎకరాల సాగు విస్తీర్ణం 2020-21కి 204 లక్షల ఎకరాలకు పెరిగిందని నివేదికలో ఉంది. అందుకు రైతు బంధు పథకమే కారణం. 4.5 లక్షల మంది గిరిజనులకు పోడు పట్టాలు అందించా. వారికి రైతు బంధు ఇస్తారో లేదో ప్రభుత్వం చెప్పాలి. రాష్ట్రంలో 20 మంది రైతులకే పీఎం కిసాన్ సమ్మాన్ నిధి నగదు వస్తుంది. మూడో పంటకు రైతు బంధు కోసం గతంలో రేవంత్ డిమాండ్ చేశారు. ఇప్పుడు మీ ప్రభుత్వం ఆ పని ఎందుకు చేయడం లేదు. బీఆర్ఎస్ 24 గంటలు విద్యుత్ ఇవ్వలేదని దుష్ప్రచారం చేస్తున్నారు. 19.2 గంటలు విద్యుత్ ఇచ్చామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. నల్గొండ వెళ్లి చెక్ చేద్దాం. 24 గంటలు విద్యుత్ ఇస్తున్నట్లు మీరు నిరూపిస్తే బీఆర్ఎస్ శాసనసభాపక్షం మొత్తం స్పీకర్ ఫార్మాట్‌లో రాజీనామాకు సిద్ధమని’ ఛాలెంజ్ చేశారు.
రైతు బంధును యథాతథంగా కొనసాగించాలి
రైతుబంధు పథకాన్ని యథాతథంగా కొనసాగించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కేటీఆర్ డిమాండ్ చేశారు. రైతు భరోసా పథకంపై శనివారం అసెంబ్లీలో స్వల్పకాలిక చర్చ జరిగింది. రుణమాఫీపై కాంగ్రెస్ ప్రభుత్వం దుష్ప్రచారం చేస్తోందని, ఒకవేళ రాష్ట్రంలో ఏ నియోజకవర్గంలోనైనా, గ్రామంలోనైనా వంద శాతం రైతులకు రుణాలు మాఫీ చేసినట్లు నిరూపిస్తే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలం రాజీనామా చేస్తామని రాష్ట్ర ప్రభుత్వానికి సవాల్ విసిరారు. రైతుబిడ్డ ప్రభుత్వ ఉద్యోగి అయితే రైతుబంధు ఇవ్వరా? అని ప్రశ్నించారు. రైతుబంధులో కోతలకు సిద్ధమైన ప్రభుత్వం దాని అమలు కోసం మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేసింది. ఆ నివేదికను ప్రజల ముందుపెట్టి రైతులకు నిజాలు చెప్పాలి.
Also Read: Telangana Assembly Sessions: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నిరవధిక వాయిదా, 8 కీలక బిల్లుల ఆమోదం
మొత్తం 70 లక్షల మంది రైతులకు 1.53 కోట్ల ఎకరాలకు సీజన్లో ఎకరానికి రూ.15 వేలు ఇవ్వాలంటే రూ.23 వేల కోట్లు కావాలి. కానీ బడ్జెట్‌లో రూ.15 వేల కోట్లు మాత్రమే కేటాయించారు. మీ మోసం ఇక్కడే బయటపడిందని కేటీఆర్ అన్నారు. ఎన్నికల హామీల్లో అందరికీ రైతు బంధు ఇస్తామని చెప్పి, ఇప్పుడు కొందరికే అని కాంగ్రెస్ మోసం చేస్తోంది. రైతుబంధు పొందిన వారిలో 98 శాతం చిన్న, సన్నకారు వర్గాల రైతన్నలే ఉన్నారు.
తెలంగాణలో కోటి మందికి పైగా పాన్‌కార్డులు ఉన్నాయంటే వారందరికీ రైతుబంధు కోత పెడతారా? అని కేటీఆర్ ప్రశ్నించారు. కౌలు రైతులకు రైతుబంధు ఇవ్వాలని రేవంత్ రెడ్డి గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు లేఖ రాశారు. రేవంత్ మాట మీద నిలబడతారా అని రైతులు ఎదురు చూస్తున్నారు.