ఇప్పటివరకూ ఉన్న ఈ తెలంగాణ తల్లి విగ్రహం రూపంలో కాంగ్రెస్ ప్రభుత్వం మార్పులు చేసి కొత్త విగ్రహం ఆవిష్కరిస్తోంది.
రాష్ట్ర సచివాలయంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ తల్లి విగ్రహం ఈ డిసెంబర్ 9వ తేదీన ఆవిష్కరించనున్నారు.
1. తెలంగాణ ఆడబిడ్డల కట్టు, బొట్టు ఉట్టిపడేలా ప్రసన్న వదనంతో ఉండే నిండైన రూపంతో విగ్రహం దర్శనమిస్తుంది. 2. తెలంగాణ తల్లి మన ఇంటి ఆడబిడ్డ అవతారం ఎత్తినట్లుగా కనిపించే ముఖారవిందం.
3. ఎన్ని ఆభరణాలున్నా, తెలంగాణ ఆడబిడ్డలు మెడలో బంగారు తీగను తెలంగాణ సంస్కృతికి ప్రతిబింబంగా, ఎంతో ఇష్టంగా ధరిస్తారు.
4. కుడి చేతితో తెలంగాణ ప్రజలకు అభయహస్తం, ఎడమ చేతిలో తెలంగాణలో పండించే ముఖ్యమైన పంటలను ధరించి, వ్యవసాయానికి గల ప్రాముఖ్యతను చాటి చెబుతుంది.
5. తెలంగాణ గ్రామీణ జీవన విధాన ప్రాముఖ్యతను, ఆర్థిక ప్రగతికి మూల స్తంభమైన వ్యవసాయంలో ఆడబిడ్డల ప్రాముఖ్యతను చాటి చెబుతుంది.
6. వస్త్రధారణలోని ఆకుపచ్చని రంగు పచ్చని పంటల్ని, ఎరుపు రంగు చాకలి ఐలమ్మలాంటి తెలంగాణ ధీర వనితల పోరాటాన్ని సూచిస్తాయి. 7. తెలంగాణ తల్లిని బిడ్డలందరూ తమ గుండెల్లో పెట్టుకొని చూసుకుంటున్నట్లుగా తెలిపే విగ్రహ పీఠం.
8. విగ్రహ పీఠంలో తెలంగాణ తల్లికి దాస్య విముక్తి కల్పించిన తెలంగాణ బిడ్డల పోరాటాలకు ప్రతీకగా బిగిసిన పిడికిళ్లు. 9. రాష్ట్రంలోని సబ్బండ వర్గాలకు ప్రతిరూపంగా తెలంగాణ తల్లి విగ్రహం.
సెక్రటేరియట్‌లో ఆవిష్కరించనున్న తెలంగాణ తల్లి విగ్రహం ప్రత్యేకతలు ఇవేనని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి.