WTC Final 2023: గెలిచే ఆటేనా ఇది! రెండో WTC ఫైనల్లో 209 తేడాతో టీమ్‌ఇండియా చిత్తు! ఆసీస్‌దే గద!
WTC Final 2023: అదే వరుస.. ఏమీ మారలేదు.. ప్రత్యర్థి మాత్రమే మారాడు.. టీమ్‌ఇండియా ఎప్పట్లాగే ఐసీసీ టోర్నీల్లో ఆఖరి మెట్టుపై బోల్తా పడింది!
WTC Final 2023:
అదే వరుస.. ఏమీ మారలేదు.. ప్రత్యర్థి మాత్రమే మారాడు.. టీమ్‌ఇండియా ఎప్పట్లాగే ఐసీసీ టోర్నీల్లో ఆఖరి మెట్టుపై బోల్తా పడింది! ట్రోఫీ వ్యథను మరింత పెంచింది. నిలబడుతుంది.. కలబడుతుందని భావించిన ప్రతిసారీ నిరాశే కలిగిస్తోంది. చిన్న చిన్న పొరపాట్లతో చిరాకు తెప్పిస్తోంది. అప్పుడు న్యూజిలాండ్ అయితే ఇప్పుడు ఆసీస్ చేతిలో ఓటమి చవిచూసింది. వరుసగా రెండోసారీ ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్లో పరాభవం పాలైంది.
ఐసీసీ టెస్టు ఛాంపియన్‌షిప్ గదను సొంతం చేసుకొనేందుకు 444 పరుగుల లక్ష్య ఛేదనకు దిగిన టీమ్‌ఇండియా అందులో కనీసం ముప్పావు స్కోరైనా చేయలేదు. రెండో ఇన్నింగ్సులో 63.3 ఓవర్లు ఆడి 234 పరుగులకే ఆలౌటైంది. ఏకంగా 209 పరుగుల తేడాతో ఓడిపోయింది. విరాట్ కోహ్లీ (49; 78 బంతుల్లో 7x4), అజింక్య రహానె (46; 108 బంతుల్లో 7x4), రోహిత్ శర్మ (43; 60 బంతుల్లో 7x4, 1x6) టాప్ స్కోరర్లు. చెతేశ్వర్ పుజారా (27; 47 బంతుల్లో 5x4), శ్రీకర్ భరత్ (23; 41 బంతుల్లో 2x4) ఏదో మోస్తరు స్కోర్లు చేశారు.
Australia conquer #WTC23! 🇦🇺🏆
— ICC (@ICC) June 11, 2023
A superb bowling display on Day 5 gives them a resounding win in the Final 👏
Scorecard 📝: https://t.co/wJHUyVnX0r pic.twitter.com/mZxnBnwTmA
ఆదివారం 'నమ్మకం' కాన్సెప్ట్‌తో బరిలోకి దిగింది టీమ్‌ఇండియా! చేతిలో 7 వికెట్లున్నాయి. క్రీజులో విరాట్ కోహ్లీ (44), అజింక్య రహానె (20) మంచి టచ్‌లో కనిపిస్తున్నారు. విజయం సాధించాలంటే మరో 280 పరుగులు చేయాలి. ఇది చిన్న టాస్కేమీ కాదు! అలాగని ఆ స్థాయి ఆటగాళ్లు మన దగ్గర లేకపోలేదు! ఆఖరి రోజు ఒక్కటంటే ఒక్క సెషన్ వికెట్ నష్టపోకుండా ఆడుంటే పరిస్థితి మరోలా ఉండేదేమో!
ఆఖరి రోజు ఓవర్ నైట్ స్కోరు 164/3తో బరిలోకి దిగిన టీమ్‌ఇండియా 70 పరుగులైనా చేయలేదు. ఆట మొదలైన పావు గంటకే విరాట్ కోహ్లీ ఔటయ్యాడు. స్కాట్ బొలాండ్ దేహానికి దూరంగా విసిరిన బంతిని ఆడి స్లిప్‌లో స్టీవ్ స్మిత్ చేతికి చిక్కాడు. ఆడాలా వద్దా అన్న డౌట్‌తో ఆడి పెవిలియన్ చేరాడు. అప్పటికి స్కోరు 179/4. ఇదే పెద్ద షాక్ అనుకుంటే బంతి వ్యవధిలోనే రవీంద్ర జడేజా (0) ఔటవ్వడం గమనార్హం. కాస్త ఆఫ్సైడ్ వెళ్లిన బంతి జడ్డూ బ్యాటు అంచుకు తగిలి కీపర్ కేరీ చేతుల్లో పడింది. ఈ సిచ్యువేషన్లో జింక్స్, కేఎస్ భరత్ నిలదొక్కుకొనేందుకు ప్రయత్నించారు. అయితే జట్టు స్కోరు 212 వద్ద రహానెను స్టార్క్ ఔట్ చేశాడు. మరో పరుగుకే శార్దూల్ ఠాకూర్ (0) డకౌట్ అయ్యాడు. ఆ తర్వాత భరత్, ఉమేశ్ (1), సిరాజ్ (1) ఔటవ్వడానికి ఎంతో సమయం పట్టలేదు.
ఆసీస్‌లో నేథన్ లైయన్ వేసింది 15.3 ఓవర్లే కానీ నాలుగు వికెట్లు పడగొట్టాడు. రోహిత్, భరత్, సిరాజ్, శార్దూల్‌ను పెవిలియన్ పంపించాడు. స్కాట్ బొలాండ్ 3 వికెట్లు, మిచెల్ స్టార్క్ 2 వికెట్లు తీశారు. కమిన్స్‌కు ఒక వికెట్ దక్కింది.
స్కోరు వివరాలు
ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్ - 121.3 ఓవర్లకు 469 ఆలౌట్
భారత్ తొలి ఇన్నింగ్స్ - 69.4 ఓవర్లకు 296 ఆలౌట్
ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్ - 270/8 డిక్లేర్
భారత్ రెండో ఇన్నింగ్స్ - 63.3 ఓవర్లకు 234 ఆలౌట్
Congratulations, Australia! 🇦🇺
— ICC (@ICC) June 11, 2023
A roaring victory in the ICC World Test Championship 2023 Final 🎉#WTC23 | #AUSvIND pic.twitter.com/VE01bWheMQ