Sugali Preeti Case : సుగాలి ప్రీతి కేసులో సీబీఐ చేతులెత్తేసింది- మరి పవన్ నిర్ణయం ఏంటీ? తేలుస్తారా... తేలిపోతారా?
Sugali Preeti Case : ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రతిష్టకు సుగాలి ప్రీతి కేసు ఛాలెంజ్‌లా మారింది. సీబీఐ చేతులెత్తేయడంతో అందరి చూపు జనసేనాని నిర్ణయంపై పడింది.

Sugali Preethi Case Challenge to Pawan Kalyan: జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కు కొత్త చిక్కుముడి ఎదురైంది. ఇప్పటికే తిరుపతి ఇన్చార్జ్ కిరణ్ రాయల్ వ్యవహారం పార్టీని ఇబ్బంది పెడుతుంటే తాజాగా సుగాలి ప్రీతి కేసులో దర్యాప్తు చేయడానికి తమ వద్ద వనరులు లేవంటూ సిబిఐ చేతులెత్తేయడం పవన్ ఇమేజ్‌కు వ్యక్తిగతంగా సవాల్ విసిరుతోంది.
ఎవరీ సుగాలి ప్రీతి ?
కర్నూలు పట్టణ శివార్లలోని ఒక రెసిడెన్షియల్ స్కూల్లో 10వ తరగతి చదువుతూ అక్కడ హాస్టల్‌లో ఉంటున్న సుగాలి ప్రీతి తన హాస్టల్ రూమ్‌లోనే అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ఈ సంఘటన 2017లో జరిగింది. గిరిజన తండాకు చెందిన ఆమె తల్లిదండ్రులు సుగాలి ప్రీతిది హత్యే అని ఆరోపించడంతో అప్పటి టిడిపి ప్రభుత్వంలో ఈ కేసుపై దర్యాప్తు ప్రారంభమైంది. ఈ కేసు దర్యాప్తు త్వరితగతిన జరగాలని పవన్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ లోపు గవర్నమెంట్ మారి జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. అప్పుడు కూడా పవన్ సుగాలి ప్రీతి కేసుపై గట్టిగానే పోరాడారు. దానితో జగన్ ప్రభుత్వం ఈ కేసును సిబిఐకు అప్పజెప్పింది.
సుగాలి ప్రీతి ఉరి వేసుకున్న ఫ్యాన్ రెక్కలు ఎందుకు వంగి పోలేదు, ఆమె శరీరంపై గాయాలు ఎందుకు ఉన్నాయి. ఇలాంటి అనుమానాల్ని ఆమె తల్లిదండ్రులు రాజు నాయక్, పార్వతీ దేవి మీడియా ముందు ఉంచారు. దీనిపై ముందుగా త్రిసభ్య కమిటీ, ఆపై 5గురు సభ్యులతో మరో కమిటీ వేశారు అప్పటి జిల్లా కలెక్టర్. కమిటీ రిపోర్ట్‌లో కూడా ఇది లైంగిక దాడితో కూడిన హత్యే అనే అనుమానాలు ఉన్నట్టు పేర్కొన్నారు.
సుగాలి ప్రీతి మృతదేహానికి పోస్ట్ మార్టమ్ నిర్వహించిన వైద్యులు సైతం తమ ప్రాథమిక రిపోర్ట్‌లో దీన్ని హత్య అన్నట్టు పేర్కొన్నారని ప్రచారం జరిగింది. కాలేజీ యాజమాని, అతని కుమారులను నిందితులుగా పేర్కొంటూ పోలీసులు అదుపులోకి తీసుకున్నా త్వరగానే వాళ్లకి బెయిల్ దొరికింది. దాంతో తమ కుమార్తెను పాడు చేసి చంపేసిన హంతకులపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ ఆమె తల్లిదండ్రులు పోరాడుతూనే ఉన్నారు.
Also Read: టీడీపీ, వైసీపీ శ్రేణుల మధ్య ఘర్షణ - తుని మున్సిపాలిటీ వైస్ చైర్మన్ ఎన్నిక వాయిదా
అధికారంలోకి రాగానే సుగాలి కేసుపై దృష్టి పెడతాను అన్న పవన్
ఎన్నికల సమయంలో పవన్ సుగాలి ప్రీతి కేసుపై పూర్తిగా దృష్టి పెడతానని అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో ఈ కేసును పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ప్రచారంలో ఉండగా జగన్మోహన్ రెడ్డి కంటికి దెబ్బ తగిలిన సంఘటన ఉదాహరిస్తూ ' జగన్ కంటిపై చిన్న దెబ్బ తగిలితే హడావుడి చేస్తున్నారు మరి సుగాలి ప్రీతి హత్య కేసుపై ఎందుకు దృష్టి పెట్టలేదు అంటూ' తీవ్రమైన ఆరోపణలు చేశారు.
అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత పవన్ సుగాలి ప్రీతి కేసును పూర్తిగా పక్కన పెట్టేశారు అంటూ వైసీపీ ఆరోపిస్తుంది. వంద రోజుల్లో పరిష్కరిస్తామన్న ఈ కేసు 8 నెలలైనా కొలిక్కి రాకపోవడంపై పవన్‌ను టార్గెట్ చేస్తూ ప్రత్యర్థి పార్టీలు విమర్శలు గుప్పిస్తున్నాయి. దీనికి సీబీఐ నిర్ణయం కూడా తోడుకానుంది.
సుగాలి ప్రీతి కేసు తాము పరిష్కరించాల్సినంత సంక్లిష్టమైన కేసు కాదని, దానికి తగినన్ని వనరులు తమ వద్ద లేవంటూ కోర్టుకు సిబిఐ స్పష్టం చేసింది. తాము వేరే కేసుల్లో బిజీగా ఉన్నామని కూడా చెప్పడంతో ఇప్పుడు అందరి దృష్టి ఉపముఖ్యమంత్రి పవన్ వైపు మళ్ళింది. ఎన్నికల సమయంలో తాను ఇచ్చిన హామీ ప్రకారం పవన్ ఇప్పుడు ఈ కేసుపై దృష్టి పెట్టి ఆ తల్లిదండ్రులకు న్యాయం జరిగేలా చూస్తారా లేదా అనేది ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. పవన్ చిత్తశుద్ధికి సుగాలి ప్రీతి కేసు దర్యాప్తు ఒక పరీక్షలా మారింది. మరి పవన్ ఈ చిక్కుముడిని ఎలా ఎదుర్కొంటారో చూడాలి.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

