Simhachalam Chandanotsavam 2022: లక్ష్మీ నరసింహ స్వామికి చందనోత్సవం ఎందుకు జరుపుతారో తెలుసా
వైశాఖ శుక్ల తదియ రోజు సింహాచలం వరాహ లక్ష్మీ నరసింహ స్వామి చందనోత్సవం జరుగుతుంది. స్వామిపై చందనం పూత తొలగించి స్వామివారి నిజరూప దర్శనభాగ్యాన్ని భక్తులకు అందిస్తారు. ఇంతకీ చందనోత్సవం ఎందుకు జరుపుతారు.
శ్రీ లక్ష్మీ నారసింహ స్వామి దేవాలయాలు మన దేశంలో చాలా ఉన్నాయి. అయితే వరాహ, నరసింహ అవతారాలు కలిసుండే విగ్రహం ఉన్న ఏకైక దేవాలయం సింహాచలంలో మాత్రమే ఉంది. కోరిన కోరికలు తీర్చే కొంగుబంగారంగా స్వామిని భక్తులు కొలుస్తుంటారు. అలాంటి స్వామివారి నిజరూప దర్శనం ఏడాదిలో ఒక్క రోజు మాత్రమే కలుగుతుంది.అదే వైశాఖ శుద్ధ తదియ… అక్షయ తృతీయ రోజు. దీనినే చందనోత్సవంగా పిలుస్తారు.
చందనోత్సవం ఎందుకు
హిరణ్యాక్షుడనే అసురుణ్ని వధించడానికి శ్రీమహావిష్ణువు వరాహావతారాన్ని, హిరణ్యకశిపుణ్ని సంహరించేందుకు నృసింహావతారాన్ని దాల్చాడు. అసురులైన అన్నదమ్ములు ఇద్దర్నీ వధించేందుకు శ్రీహరి వరుసగా ధరించిన అవతారాలివి. హిరణ్యాక్షుడిని వధించి వరాహ అవతారాన్ని విరమించేలోగా హిరణ్యకశిపుడి మాట మేరకు ప్రహ్లాదుడు పిలవడంతో భక్తుణ్ని రక్షించాలనే తొందర్లో వరాహ రూపం వదలకుండానే నృసింహుడిగా ప్రత్యక్షమయ్యాడు. దీంతో అదే రూపంలో వరాహ నృసింహుడిగా కొండపై కొలువయ్యాడు. అయితే హిరణ్యకశిపుడిని అంతమొందించిన తరవాత నృసింహుడు, ప్రళయ భీకరంగా, జ్వాలా మాలికలతో కనిపించేసరికి సమస్త సృష్టి భయపడింది. బ్రహ్మాది దేవతలు, ప్రహ్లాదుడు ప్రార్థించినా ఫలితం లేకపోయింది. ఆ సమయంలో బ్రహ్మకు చందన వృక్షం గుర్తొచ్చింది. ఉగ్రత, ఉష్ణం, తాపం నివారించే శక్తిని చందన వృక్షానికి వరంగా ఇచ్చిన సంగతి స్ఫురణకు వచ్చింది. అదే విషయం ప్రహ్లాదుడికి బ్రహ్మ సూచిస్తాడు. ప్రహ్లాదుడు చేసిన చందన సేవ వల్ల నారసింహుడు శాంతించాడు. ప్రహ్లాదుడి కోరిక మేరకు సింహగిరిపై కొలువయ్యాడు.
బ్రహ్మాండ పురాణం ప్రకారం
‘పాహీ! శ్రీమన్నారాయణ!’ అని ప్రహ్లాదుడు పిలవగానే, గరుత్మంతుడిపై నుంచి ఒక్క ఉదుటున కిందకు దూకడంతో స్వామి దివ్య చరణాలు పాతాళంలోకి దిగబడ్డాయి. అందుకే వరాహ నారసింహుడి పాద దర్శనం భక్తులకు లభించదు. ప్రహ్లాదుడి తదనంతరం కాలక్రమంలో వరాహ నారసింహకృతి మట్టిపుట్టలో నిక్షిప్తమైంది. వేల ఏళ్ల క్రితం పురూరవ చక్రవర్తికి వరాహ నారసింహుడు కలలో కనిపించి తన ఉనికి తెలియజేశాడు. వైశాఖ శుద్ధ తదియనాడు అలా వరాహ నృసింహుడి విగ్రహం బహిర్గతమైంది. స్వామివారిని చందనంతో సంపూర్ణంగా అలంకరించాడు. పురూరవుడితో పునరుద్ధరణ జరిగిన చందన సేవ ఏటా అక్షయ తృతీయనాడు వైభవంగా సింహాద్రిపై కొనసాగుతోంది.
Also Read: అక్షయ తృతీయ రోజు బంగారం కొనకూడదు, ఏం చేయాలంటే
స్వామిరూపం సింహాచలంలో వరాహ ముఖం, నరుని శరీరం, తెల్లని జూలు, భుజంపై తోక, రెండు చేతులు, భూమిలో దాగివున్నపాదాలు.. ఈ నిజరూప స్వామి దర్శనం అక్షయ తృతీయ రోజు మాత్రమే కొన్ని గంటలు సేపు ఉంటుంది. ఆ సమయంలో లక్షల మంది భక్తులు స్వామిని దర్శించుకుంటారు. అర్చనాదులు పూర్తిచేసి తిరిగి చందనం లేపనం చేయడంతో శివలింగాకారుడుగా దర్శనమివ్వడం అద్వైత దర్శనానికి ప్రతీక. అక్షయ తృతీయతోపాటు, జ్యేష్ఠ పౌర్ణమి, ఆషాఢ, పౌర్ణమి తిథుల్లో మూడు విడతల్లో స్వామికి మొత్తం పన్నెండు మణుగుల పరిమాణంలో చందనాన్ని సమర్పిస్తారు. స్వామివారు శాంతమూర్తిగా ఉంటేనే అంతా చల్లగా ఉంటామని భక్తుల విశ్వాసం.
Also Read: అనారోగ్యం, శనిబాధలు తొలగిపోవాలంటే మంగళవారం ఇలా చేయండి