Court Movie Review - 'కోర్టు' రివ్యూ: థియేటర్లలో వాదనలు నిలబడతాయా? నాని నిర్మించిన సినిమా ఎలా ఉందంటే?
Court Movie Review In Telugu: నేచురల్ స్టార్ నాని సమర్పణలో వచ్చిన లేటెస్ట్ సినిమా 'కోర్టు - స్టేట్ వర్సెస్ ఎ నోబడీ'. ప్రియదర్శి, శివాజీ, సాయి కుమార్ నటించిన పెయిడ్ ప్రీమియర్లు వేశారు.
రామ్ జగదీష్
ప్రియదర్శి, శివాజీ, సాయి కుమార్, రోహిణి, హర్షవర్ధన్, హర్ష్ రోషన్, శ్రీదేవి, శుభలేఖ సుధాకర్ తదితరులు
Court State vs A Nobody Movie Review: ప్రియదర్శి ప్రధాన పాత్రలో నటించిన 'కోర్టు - స్టేట్ వర్సెస్ ఎ నోబడీ' పెయిడ్ ప్రీమియర్లు సినిమా విడుదలకు రెండు రోజులు ముందు (బుధవారం రాత్రి) వేశారు. పోక్సో యాక్ట్ నేపథ్యంలో తెరకెక్కిన చిత్రమిది. ఇందులో శివాజీ విలన్ రోల్ చేశారు. సాయి కుమార్, రోహిణి, హర్షవర్ధన్, 'శుభలేఖ' సుధాకర్ ప్రధాన పాత్రలు పోషించారు. హార్ష్ రోషన్, శ్రీదేవి జంటగా నటించారు. కొత్త దర్శకుడు రామ్ జగదీష్ ఎలా తీశారు? ఈ సినిమా ఎలా ఉంది? అనేది చూస్తే...
కథ (Court Movie Story): మెట్టు చంద్రశేఖర్ (హార్ష్ రోషన్) ఇంటర్‌లో ఫైయిలైన 19 ఏళ్ల కుర్రాడు. అతని తండ్రి వాచ్‌మేన్. తల్లి ఐరన్ చేస్తుంది. డబ్బుల కోసం చంద్రశేఖర్ ఏదొక పని చేస్తూ ఉంటాడు. ఇంటర్ చదివే అమ్మాయి జాబిలి (శ్రీదేవి)తో ప్రేమలో పడతాడు చంద్రశేఖర్. అయితే, ఆ విషయం తెలిసి తమ అమ్మాయిని రేప్ చేశాడని జాబిలి మావయ్య (శివాజీ) పోక్సో కేసు పెట్టిస్తాడు.
జాబిలిని చందూ అలియాస్ చంద్రశేఖర్ నిజంగా రేప్ చేశాడా? బెయిల్ కూడా రాకుండా అతని మీద పోక్సో పెట్టించిన లాయర్ దాము (హర్షవర్ధన్) కోర్టులో ఎలా వాదించారు? ఈ కేసును టేకప్ చేసిన సూర్యతేజ (ప్రియదర్శి) ఏం చేశాడు? ఈ కేసులో జాబిలి తల్లి సీతారత్నం (రోహిణి), సూర్యతేజ బాస్ మోహన్ రావు (సాయి కుమార్) ఏం చేశారు? అనేది మిగతా సినిమా.
విశ్లేషణ (Court movie review Telugu): కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ మీద నమోదైన లైంగిక వేధింపుల ఆరోపణల కారణంగా పోక్సో చట్టం గురించి తెలుగు ప్రేక్షకులకు బాగా తెలిసింది. ఆ చట్టం నేపథ్యంలో రూపొందిన చిత్రమిది. ఒకవేళ పోక్సో నేపథ్యంలో కేసు నమోదు అయితే పరిణామాలు ఎంత తీవ్రంగా ఉంటాయో చూపించే చిత్రమిది.
న్యాయం కోసం కోర్టును ఆశ్రయించే ప్రజలు మెజారిటీ అయితే... చట్టాలను అడ్డుగా పెట్టుకుని తమ పగ, ప్రతీకారాలు నెరవేర్చుకునే వ్యక్తులు ఈ సమాజంలో మనకు కొందరైనా తారసపడతారు. తమ ఇగో కోసం, పరువు ప్రతిష్టల కోసం ఇరవై ఏళ్లు కూడా నిండని ఒక కుర్రాడి భవిష్యత్తును డబ్బు బలంతో ఒక వ్యక్తి నాశనం చేయాలని అనుకుంటే... కుర్రాడి భవిష్యత్తును ఒక యువర్ లాయర్ ఎలా కాపాడాడు? బయటకు ఎలా తెచ్చాడు? అనేది సినిమా. స్టార్టింగ్ పాయింట్ దగ్గర ఇంటర్వెల్, ఇంటర్వెల్ తర్వాత క్లైమాక్స్ తెలిసే సినిమా.
దర్శకుడు రామ్ జగదీష్ చెప్పాలనుకున్న పాయింట్ మంచిది. చాలా విషయం ఉన్నది. అయితే... కథను ముందుకు తీసుకువెళ్లిన తీరు ప్రేక్షకులు అందరూ ఊహించేలా ఉంది. స్క్రీన్ ప్లేలో ఎటువంటి మెరుపులు లేవు. సినిమా ప్రారంభం నుంచి విశ్రాంతి వరకు సీటులో కూర్చున్న ప్రేక్షకుడు ఊహకు అనుగుణంగా ముందుకు వెళుతుంది. టీనేజ్ ప్రేమ కథను అంతకుమించి తీయలేమన్నట్టు రొటీన్ రెగ్యులర్ పంథాలో తీశారు. కుర్రాడు మీద కేసు పెట్టిన తర్వాత సినిమాలో కాస్త చలనం వచ్చింది. అందువల్ల, ఆ ప్రేమను గానీ అప్పటివరకు సాగిన కథను గానీ అద్భుతమని చెప్పలేం. అయితే... శివాజీ తన నట విశ్వరూపంతో అప్పటివరకు జరిగిన తప్పులను మర్చిపోయి కొత్తగా సినిమాను చూసేలా చేశారు. విశ్రాంతి తర్వాత కథలోనూ, కథనంలోనూ కొత్తదనం లేదు. కోర్టులో ఒక వీడియో ప్రవేశ పెట్టడం మినహా ఊహలకు అనుగుణంగా ముందుకు వెళుతుంది. అయితే, దర్శకుడు ప్రేక్షకుల భావోద్వేగాలను బలంగా స్పృశించాడు.
శివాజీ నటన చూసిన ప్రతిసారీ ఆయన మీద కోపం కలుగుతుంది. ఆయన కారణంగా జైలు పాలైన కుర్రాడు శిక్ష పడకుండా బయటకు వస్తే బావుంటుందని ఒక చిన్నపాటి ఆశ మొదలవుతుంది. లాజిక్స్, కన్వీనియెంట్ రైటింగ్స్ వంటివి పక్కన పెట్టి క్యారెక్టర్లతో ఎమోషనల్ బాండింగ్ క్రియేట్ అయ్యేలా ఇంటర్వెల్ తర్వాత రామ్ జగదీష్ డైరెక్షన్ సాగింది. చివరిలో పోక్సో గురించి ప్రియదర్శి చెప్పే మాటలు సైతం ఆలోచన కలిగిస్తాయి. చట్టం మీద అవగాహన కలిగించడం మాత్రమే కాదు... డీసెంట్ కోర్టు రూమ్ డ్రామాను చూశామనే చిన్న సంతృప్తిని అందిస్తుందీ 'కోర్టు'.
విజయ్ బుల్గానిన్ అందించిన స్వరాలు బావున్నాయి. అయితే, ఆ పాటలకు న్యాయం చేసేంత సందర్భాలు కుదరలేదు. కథకు నేపథ్య సంగీతం బలంగా నిలిచింది. కెమెరా వర్క్ ఓకే. కమర్షియల్ సినిమా చూసిన ఫీల్ కలిగించింది. ఇటువంటి సినిమాలకు మరింత సహజంగా ఉంటే బాగుంటుంది. చిత్ర సమర్పకులు నాని, నిర్మాత ప్రశాంతి తిపిర్నేని నిర్మాణ విలువలు కథకు తగ్గ స్థాయిలో ఉన్నాయి. ప్రొడక్షన్ డిజైన్ పరంగా మూవీలో టైమ్ పీరియడ్, లొకేషన్స్ వంటివి చెక్ చేసుకుని ఉండాల్సింది.
సినిమాకు అసలైన హీరో విలన్ రోల్ చేసిన శివాజీ. '90స్ మిడిల్ క్లాస్ బయోపిక్' వెబ్ సిరీస్ ఆయనకు ఓటీటీలో భారీ విజయం అందించింది. అందులో మిడిల్ క్లాస్ ఫాదర్ రోల్ చేసి మెప్పించిన శివాజీ... ఈ సినిమాలో విలనిజం అద్భుతంగా పండించారు. కోర్టు చూసేటప్పుడు మంగపతి క్యారెక్టర్ మీద కోపం కలిగిందంటే కారణం శివాజీ నటన. ఆయన ఈ సినిమాకు ప్రాణం పోశారు.
ప్రియదర్శి మరోసారి తన క్యారెక్టర్ పరిధి మేరకు నటించి మెప్పించారు. హర్ష్ రోషన్, శ్రీదేవి జంట బావుంది. చిన్న వయసులోనే వాళ్ళిద్దరూ మంచి నటన కనబరిచారు. ఎటువంటి ప్రాధాన్యం లేని సాధారణ తల్లి పాత్రలో రోహిణి ఎందుకు నటించారనే ప్రేక్షకుల మదిలో ప్రశ్నకు పతాక సన్నివేశాలు సమాధానం ఇస్తాయి. నటిగా ఆవిడ స్థాయికి తగ్గిన పాత్ర కాదిది. రోహిణి నటన వల్ల ఆ తల్లి పాత్రకు హుందాతనం వచ్చింది. హర్షవర్ధన్, వడ్లమాని శ్రీనివాస్, సురభి ప్రభావతి తదితరులు తమ పాత్రలకు న్యాయం చేశారు.
'కోర్టు : స్టేట్ వర్సెస్ ఎ నోబడీ' వంటి సినిమాలు చాలా అరుదుగా వస్తాయి. వినోదం కోసం చూసే సినిమా కాదిది. సమాజం పట్ల దర్శక నిర్మాతలకు బాధ్యత ఉన్నప్పుడు ఇటువంటి సినిమాలు వస్తాయి. పోక్సో చట్టం మీద అవగాహన కల్పించడంతో పాటు మనసుల్ని కాస్త కదిలించే కోర్టు రూమ్ డ్రామా చూశామనే సంతృప్తి ఇచ్చే చిత్రమిది. కమర్షియల్ విలువలు, అంచనాలను దృష్టిలో పెట్టుకుని థియేటర్లకు వెళ్ళవద్దు.





















