Telangana Latest News : ఏప్రిల్ 6 నుంచి రేవంత్ రెడ్డి లంచ్ మీటింగ్స్- ఎవరితో అంటే?
Telangana Latest News : తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలతో సమావేశం కావాలని డిసైడ్ అయ్యారు. దీని కోసం ప్రత్యేక కార్యాచరణ సిద్ధం చేశారు.

Telangana Latest News : తెలంగాణలో ఏప్రిల్ 6 నుంచి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలతో సమావేశం అవ్వాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించారు. బడ్జెట్ సమావేశాల ప్రారంభం అనంతరం సీఎల్పీ సమావేశం జరిగింది. అందులో మాట్లాడిన రేవంత్ రెడ్డి ఇకపై తరచూ కలుద్దామని ప్రజాప్రతినిధులకు హామీ ఇచ్చారు.
బడ్జెట్ సమావేశాలు చాలా కీలకం
ప్రస్తుతం జరుగుతున్న బడ్జెట్ సమావేశాలు చాలా కీలకమని ఎమ్మెల్యేలకు రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేశారు. ప్రతి ఒక్కరు కచ్చితంగా బడ్జెట్ సమావేశాల్లో పాల్గొనాలని సూచించారు. ఇప్పటి వరకు ప్రభుత్వం చేపట్టిన ప్రజాసంక్షేమ పథకాలు, ఇతర పనులపై చర్చించుకునేందుకు మంచి అవకాశంగా భావించాలని తెలిపారు.
ఆఫ్‌లైన్ ఆన్‌లైన్ యాక్టివ్‌గా ఉండాలి
ప్రతి ఒక్కరు సబ్జెక్ట్‌పై అవగాహనతో రావాలని ప్రజాప్రతినిధులకు రేవంత్ సూచించారు. వివిధ అంశాలపై ప్రతిపక్షాలు చేసే విమర్శలకు సరైన సమాచారం సమాధానం చెప్పాలని హితవు పలికారు. ప్రతిపక్షాల విమర్శలకు సమాధానం చెప్పడమే కాకుండా ప్రజల్లో కూడా యాక్టివ్‌గా ఉండాలన్నారు. ముఖ్యంగా సోషల్ మీడియాలో మరింత యాక్టివ్‌గా ఉండాలని సూచించారు.
ఏప్రిల్ 6 నుంచి లంచ్ మీటింగ్స్
ఈ సందర్భంగానే ప్రజాప్రతినిధులకు గుడ్ న్యూస్ చెప్పారు. ఏప్రిల్ 6 నుంచి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలతో సమావేశం అవుతానని ప్రకటించారు. జిల్లాల వారీగా పిలిచి లంచ్ మీటింగ్‌లు పెట్టుకుందామని తెలిపారు. ఇందులో స్థానిక సమస్యలు చర్చించే వీలు కలుగుతుందని అన్నారు. ఎక్కడా అపోహలకు తావు లేకుండా ఉంటుందని అభిప్రాయపడ్డారు.
రెండోసారి అధికారంలోకి రాావాలి
మంత్రుల నియోజకవర్గాలకే ఎక్కువ నిధులు కేటాయిస్తున్నారనే తప్పుడు భావన చాలా మందిలో ఉందని అలా ఉండదని అన్నారు రేవంత్ రెడ్డి. ఈ బడ్జెట్ సమావేశాల్లో అలాంటి అభిప్రాయానికి తావు లేకుండా అందరికీ సమానంగానే నిధుల కేటాయింపు ఉంటుందని వివరించారు. ఇలాంటి అపోహలకు తావు లేకుండా ఉండేలా మంత్రులు మసులుకోవాలని సూచించారు. ఒకసారి గెలవడం గొప్పకాదని... రెండోసారి కూడా అధికారంలోకి వచ్చేలా పని చేయాలని జాగ్రత్తలు చెప్పారు.
విప్‌లపై అసహనం
ఈ సందర్భంగా విప్‌లపై ముఖ్యమంత్రి కాస్త అసహనం వ్యక్తం చేశారు. ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగం టైంలో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు ఆందోళన చేస్తుంటే స్పందించకపోవడంపై ఆగ్రహం వ్యక్తంచేశారు. దీనిపై మాట్లాడకుండా ఉండటం ఏంటని నిలదీశారు. ఇకపై ఇలాంటివి రిపీట్ కావొద్దని వార్నింగ్ ఇచ్చారు. విప్‌లు అయినా ఎమ్మెల్యేలు అయినా ఎవరైనా అన్ని విషయాలపై మాట్లాడాలని అనుకోవడం సరైన పద్ధతి కాదన్నారు రేవంత్. ఒక్కొక్కరు ఒక్కో అంశాన్ని ఎంచుకొని దానిపై పూర్తి అవగాహనతో సభలో అయినా బయట అయినా మాట్లాడాలని సూచించారు.
క్రమశిక్షణతో ఉంటే ఫ్యూచర్ ఉంటుందని ఎమ్మెల్యేలకు క్లాస్
ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను ఉద్దేశించి రేవంత్ రెడ్డి మాట్లాడుతున్న టైంలో కొందరు ఎమ్మెల్యేలు మీటింగ్ నుంచి బయటకు వెళ్లారు. దీంతో వారిపై రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలా వెళ్లిపోతే అర్థమేంటని ప్రశ్నించారు. క్రమశిక్షణతో ఉంటేనే ఫ్యూచర్ ఉంటుందని వార్నింగ్ ఇచ్చారు. ఇది పద్ధతి కాదని తీవ్ర స్వరంతో అన్నారు. కొందరు ఎమ్మెల్యేలు కూడా సభను సీరియస్‌గా తీసుకోవడం లేదని అన్నారు. ఇలాంటివి వారి ఫ్యూచర్‌కే మంచిది కాదని హితవు పలికారు.





















