Raghurama : జగన్ అక్రమాస్తుల కేసులో కొత్త కోణం - రఘురామ పిటిషన్ విచారణ అర్హత తేల్చనున్న హైకోర్టు !
జగన్ అక్రమాస్తుల కేసులో సమగ్ర విచారణకు రఘురామ ప్రయత్నిస్తున్నారు. సూట్ కేస్ కంపెనీలు, విదేశీ నిధులు ఎక్కడివన్న విషయాన్ని సీబీఐ విచారణ జరపలేదని.. సమగ్ర విచారణకు ఆదేశించాలని ఆయన హైకోర్టును ఆశ్రయించారు. విచారణ అర్హత తేల్చాలని హైకోర్టు నిర్ణయించింది.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసుల్లో సీబీఐ, ఈడీ మరింత సమగ్రంగా విచారణ జరిపించాలని కోరుతూ ఎంపీ రఘురామకృష్ణరాజు దాఖలు చేసిన పిటిషన్ విచారణ అర్హతను తేల్చాలని హైకోర్టు నిర్ణయించింది. రఘురామ కృష్ణరాజు వేసిన పిటీషన్ కు నెంబరు కేటాయించాలని రిజిస్టీని హైకోర్టు ధర్మాసనం ఆదేశించింది. జగన్ కేసులను సీబీఐ, ఈడీ సక్రమంగా దర్యాప్తు చేయలేదని, దీనిపై విచారణ చేయాలని రఘురామ కృష్ణరాజు హైకోర్టులో పిటీషన్ వేశారు. అయితే హైకోర్టు రిజిస్ట్రి అనేక అభ్యంతరాలను వ్యక్తం చేస్తూ నెంబర్ కేటాయించలేదు. దీనిపై రఘురామ మరోసారి పిటిషన్ వేశారు. దీనిని పరిశీలించిన తెలంగాణ హైకోర్టు రఘురామ కృష్ణరాజు వేసిన పిటీషన్ విచారణకు అర్హత ఉందా? లేదా? అన్నది ధర్మాసనం తేలాల్సి ఉందని, వెంటనే ఆ పిటీషన్ కు నెంబరు కేటాయించాలని హైకోర్టు ఆదేశించింది.
రఘురామ తన పిటీషన్ లో భిన్నమైన విషయాలను పేర్కొన్నారు. జగన్ అక్రమాస్తుల కేసుల్లో 11 అభియోగపత్రాలను దాఖలు చేసిన సీబీఐ.. విదేశాలనుంచి, బోగస్ కంపెనీలనుంచి జగన్ కంపెనీల్లోకి వచ్చిన పెట్టుబడులపై దర్యాప్తు చేయకుండా ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్, ఆదాయపు పన్ను శాఖలకు లేఖ రాసి వదిలేసిందని తన పిటిషన్‌లో వివరించారు. 2004లో రూ.11 లక్షల ఆదాయమున్న జగన్ 2009లో తండ్రి చనిపోయేనాటికి రూ.43 వేల కోట్లు ఆర్జించారని ఎంపీ రఘురామకృష్ణరాజు తన పిటిషన్‌లో పేర్కొన్నారు. హౌరా, కోల్‌కతా, గువాహటిల్లోని 16 చిన్న కంపెనీల నుంచి రూ.195.70 కోట్ల పెట్టుబడులు జగతిలోకి వచ్చాయని, వీటిపై దర్యాప్తును ఐటీ, ఈడీలకు లేఖ రాయటంతో సరిపెట్టిందన్నారు.
విదేశాలనుంచి, బోగస్ కంపెనీలనుంచి జగన్ కంపెనీల్లోకి వచ్చిన పెట్టుబడులపై దర్యాప్తు చేయకుండా ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్, ఆదాయపు పన్ను శాఖలకు లేఖ రాసి చేతులు దులిపేసుకుందని తన పిటీషన్ లో వివరించారు. జగన్‌కు చెందిన కంపెనీల వ్యవహారాలను ఆర్వోసీ పట్టించుకోలేదని, తనిఖీలు చేసి తయారుచేసిన నివేదికల ప్రకారం చర్యలు తీసుకోలేదని రఘురామ పేర్కొన్నారు. వాటిపై దర్యాప్తు చేసేలా ఆదేశించాలని పిటీషన్ లో కోరారు. 2012-14 మధ్య 11 కేసుల్లో అభియోగ పత్రాలు దాఖలు చేసినప్పటికీ ఇప్పటివరకు అభియోగాల నమోదు ప్రక్రియ చేపట్టలేదని, డిశ్ఛార్జి పిటిషన్ల పేరుతో జాప్యం చేస్తున్నారని కోర్టుకు నివేదించారు. ఈ కేసుల విచారణ నిమిత్తం ప్రత్యేక కోర్టును ఏర్పాటుచేసేలా ఆదేశించాలని న్యాయస్థానాన్ని కోరారు. జగన్ కంపెనీల్లోకి పెట్టుబడులు ఏ సంస్థల నుంచి వచ్చాయనే వివరాలను రఘురామ తన పిటీషన్ లో నసమగ్రంగా వివరించారు. అలాగే వాటిపై కేంద్ర దర్యాప్తు సంస్థలు ఎ చర్యలూ తీసుకోకపోవడాన్ని ప్రశ్నించారు.
ఈ పిటిషన్ కు విచారణ అర్హత ఉందని హైకోర్టు నిర్ధారిస్తే ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు మరిన్ని చిక్కులు వచ్చి పడే అవకాశం ఉందని భావిస్తున్నారు. సీబీఐ అనేక వివరాల కోసం విదేశాలకు సైతం లేఖలు రాసి సరి పెట్టింది.. సమాచారం రాకపోయినా పెద్దగా పట్టించుకోలేదు. ఇప్పుడు మరోసారి వాటిపై సమగ్ర దర్యాప్తు చేయాలని హైకోర్టు ఆదేశిస్తే సీఎం జగన్‌కు మరిన్నిచిక్కులు తప్పవని భావిస్తున్నారు.