Varsham Re Release: 21 ఏళ్ల తర్వాత మళ్లీ థియేటర్లలో ప్రభాస్ హిట్ మూవీ - హాట్ సమ్మర్‌లో కూల్ 'వర్షం'
Varsham: ప్రభాస్, త్రిష జంటగా నటించిన బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ 'వర్షం'. ఇప్పుడు మళ్లీ థియేటర్లలో సందడి చేయనుంది. హాట్ సమ్మర్‌లో మే 23న రీ రిలీజ్ కానుంది. దీంతో డార్లింగ్ ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు.

Prabhas's Varsham Movie Re Release Date Announced: ప్రస్తుతం రీ రిలీజ్‌ల ట్రెండ్ కొనసాగుతోంది. యంగ్ హీరోస్ నుంచి సీనియర్ హీరోస్ వరకూ అప్పట్లో వచ్చిన హిట్ మూవీస్ ఇప్పుడు కూడా థియేటర్లలో సందడి చేస్తున్నాయి. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas) కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచిన మూవీ 'వర్షం' (Varsham). ఇప్పుడు మళ్లీ రీ రిలీజ్ కాబోతోంది. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్‌తో పాటు మూవీ లవర్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు.
మే 23న రీ రిలీజ్
హాట్ సమ్మర్‌లో కూల్‌గా 'వర్షం' మూవీ మళ్లీ ప్రేక్షకుల ముందుకు రానుంది. 21 ఏళ్ల తర్వాత మే 23న 4కే వెర్షన్‌లో థియేటర్లలోకి రానుంది. ఈ మేరకు అఫీషియల్ పోస్టర్ రిలీజైంది. యూత్ ఫుల్ లవ్, మాస్ ఎంటర్‌టైనర్‌గా 2004 జనవరి 14న వచ్చిన ఈ మూవీ అప్పట్లో రికార్డులు సృష్టించింది. ఈ సినిమాకు శోభన్ దర్శకత్వం వహించగా.. సుమంత్ ఆర్ట్స్ ప్రొడక్షన్ బ్యానర్‌పై ఎంఎస్ రాజు నిర్మించారు.
ప్రభాస్, సరసన బ్యూటీ త్రిష (Trisha) హీరోయిన్‌గా నటించారు. గోపీచంద్ (Gopichand) విలన్ రోల్ మెప్పించగా ప్రకాష్ రాజ్ (Prakash Raj) కీలక పాత్ర పోషించారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం సినిమాకే హైలెట్‌గా నిలిచింది. ఈ సినిమాతోనే త్రిష స్టార్ హీరోయిన్‌గా మారిపోయారు. చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేశ్, మహేష్ బాబు, రవితేజ వంటి స్టార్ హీరోలకు జోడీగా నటించారు. సునీల్, చంద్రమోహన్, అజయ్, శ్రీరంజనీ, పరచూరి వెంకటేశ్వరరావు కీలక పాత్రలు పోషించారు. ప్రభాస్ సోదరి పాత్రలో సుమ నటించారు. ప్రభాస్ మాస్ యాక్షన్, డైలాగ్ డెలవరీ ఆడియన్స్‌కు గూస్ బంప్స్ తెప్పించాయి.
బాహుబలి కూడా..
ఇండియన్ మూవీస్ హిస్టరీలోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్.. ప్రభాస్‌ను పాన్ ఇండియా స్టార్‌గా మార్చిన 'బాహుబలి' సినిమా సైతం థియేటర్లలో రీ రిలీజ్ కానుంది. ఈ విషయాన్ని నిర్మాత శోభు యార్లగడ్డ తాజాగా.. సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. 2015లో విడుదలైన ఈ మూవీ విడుదలై సరిగ్గా పదేళ్లు పూర్తవుతున్న సందర్భంగా రీ రిలీజ్ చేయనున్నారు. 'ఈ ఏడాది అక్టోబరులో 'బాహుబలి' మూవీని ఇండియా, ఇంటర్నేషనల్ వైడ్ రీ రిలీజ్ చేస్తున్నాం. ఇది మా ఫ్యాన్స్‌కు సెలబ్రేషన్ ఇయర్ అవుతుంది.' అంటూ శోభు తెలిపారు.
దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఈ ఎపిక్ పీరియాడికల్ యాక్షన్ మూవీ ప్రపంచవ్యాప్తంగా దాదాపు రూ.600 కోట్లకు పైగా వసూళ్లు చేసింది. ఈ సినిమాలో ప్రభాస్, రానాతో పాటు అందాల నటి అనుష్క, మిల్కీ బ్యూటీ తమన్నా, రమ్యకృష్ణ, సత్యరాజ్, నాజర్ కీలక పాత్రలు పోషించారు. ఆర్కా మీడియా వర్క్స్ ఆధ్వర్యంలో శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని మూవీని నిర్మించారు. రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ ఈ స్టోరీ అందించారు. రెండు పార్టులుగా మూవీ తెరకెక్కగా.. ఫస్ట్ పార్ట్ రీ రిలీజ్ కానుంది.






















