Anantapur Urban MLA: అనంతపురంలో విద్యార్థులపై ఎలుకలు దాడి - ఎమ్మెల్యే దగ్గుపాటి ఏమన్నారంటే?
Anantapuram Latest News:అనంతపురంలోని కేఎస్ఎన్ డిగ్రీ కళాశాలలో విద్యార్థులను ఎలుకలు కరవడంపై స్థానిక ఎమ్మెల్యే సీరయస్ అయ్యారు. పూర్తి విచారణ చేసి బాధ్యతలపై చర్యల తీసుకుంటామన్నారు.

Anantapuram Latest News: అనంతపురం నగరంలోని కేఎస్ఎన్ డిగ్రీ కళాశాలలో విద్యార్థులపై ఎలుకలు దాడి చేసిన ఘటన మీద విచారణ జరుగుతోందని అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ అన్నారు. ఇందులో బాధ్యులపై కచ్చితంగా చర్యలు తీసుకుంటాని స్పష్టం చేశారు. ఎమ్మెల్యే దగ్గుపాటి ఈ సాయంత్రం కళాశాలలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. మొత్తం కళాశాల ఆవరణం, వసతి గృహం చుట్టుపక్కల ప్రాంతాలను పరిశీలించారు.
విద్యార్థులతో కూడా ఎమ్మెల్యే దగ్గుపాటి మాట్లాడారు. సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఒకే రూమ్‌లో 20 మంది వరకు ఉంటున్నామని విద్యార్థులు వాపోయారు. తాగునీటి పైప్ లైన్ సమస్య ఉందని చెప్పారు. వెంటనే మున్సిపల్ అధికారులతో మాట్లాడి రెండు రోజుల్లో తాగునీటి పైప్ లైన్ సమస్య పరిష్కరించాలని ఎమ్మెల్యే ఆదేశించారు.

కిచెన్‌లో అపరిశుభ్ర వాతావరణం ఉండటంపై దగ్గుపాటి సిబ్బందిని మందలించారు. ఇలాంటి పరిస్థితి ఉంటే విద్యార్థులు అనారోగ్యానికి గురికారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక నుంచి ప్రతి నెల సడెన్ విజిట్స్ ఉంటాయని హెచ్చరించారు. ఎక్కడైనా నిర్లక్ష్యం కనిపిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.

ప్రైవేటు కళాశాలలకు దీటుగా ప్రభుత్వ కళాశాలలు
కళాశాలతో పాటు వసతి గృహంలో అన్నీ పరిశీలించామని ఎమ్మెల్యే దగ్గుపాటి వెల్లడించారు. 2014 నుంచి 19 మధ్య కాలంలో జరిగిన నిర్మాణాలే కనిపిస్తున్నాయన్నారు. చాలా చోట్ల అసంపూర్తిగా నిర్మాణాలు ఉన్నాయని, గత ఐదేళ్లలో చిన్న అభివృద్ధి కూడా జరగలేదని అన్నారు. కాంపౌండ్ వాల్ సమస్య తన దృష్టికి వచ్చిందని తెలిపారు. వీటన్నింటిని మంత్రి నారా లోకేష్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామన్నారు. విద్యాలయాల్లో చిన్న సమస్య ఉన్నా మంత్రి లోకేష్ స్పందిస్తున్నారని.. ప్రైవేట్‌కు దీటుగా ప్రభుత్వ విద్యాలయాలను మారుస్తున్నారని ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ పేర్కొన్నారు.

ఎలుకల దాడిపై విచారణ
కె ఎస్ ఎన్ మహిళా డిగ్రీ కళాశాలలో గత నాలుగు రోజుల క్రితం ఎలుకల దాడిలో విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. ఇదే విషయంపై కాలేజ్ ప్రిన్సిపల్ సిబ్బందిపై ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. కళాశాల ఆవరణంలో ఉన్న వసతి గృహాలను ఎమ్మెల్యే క్షుణ్ణంగా పరిశీలించారు. కళాశాల వసతి గృహాల చుట్టూ చెత్త ఉండటం వల్లే ఎలుకలు వస్తున్న అనుమానం వ్యక్తం చేశారు. ఎలుకల దాడిలో తీవ్రంగా గాయపడ్డ విద్యార్థులను మెరుగైన వైద్యం అందించాలని మున్ముందు ఇలాంటి ఘటనలు జరగకుండా ప్రత్యేక దృష్టి సాధించాలని కళాశాల సిబ్బందికి హెచ్చరించారు. ఎలుకల దాడిపై విచారణ చేపట్టి బాధ్యతపై చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ పేర్కొన్నారు.

అసంపూర్తిగా ఉన్న భవనాలు
2014-19 మధ్యలో మంజూరైన వసతి గృహాలను సగం నిర్మాణాల్లోనే ఆపేశారని దగ్గుపాటి ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం తన దృష్టికి ఈ సమస్యను ఎందుకు తీసుకురాలేదని ప్రిన్సిపల్ పై ఎమ్మెల్యే మండిపడ్డారు. వసతి గృహాల్లో ఒక్కొక్క రూములో 20 మంది విద్యార్థులు ఉంటున్నారని అంత ఇరుకు గదుల్లో అంతమంది ఉండడంపై కూడా ఎమ్మెల్యే ఫైర్ అయ్యారు. విద్యాశాఖ మంత్రి లోకేష్ రాష్ట్రంలో విద్య కోసమే అత్యధిక బడ్జెట్ కేటాయించారని గుర్తు చేశారు. సుమారుగా 25 వేల కోట్లు రూపాయలు విద్య కోసం మంత్రి కేటాయించారని వెల్లడించారు. వెంటనే అసంపూర్తిగా ఉన్న భవనాలు పూర్తి చేయడానికి పూర్తి ఎస్టిమేషన్లు ప్రిపేర్ చేసి తనకు అందించాలని కళాశాల ప్రిన్సిపల్ సిబ్బందికి ఎమ్మెల్యే సూచించారు.






















