Operation Kagar: మా జాతిని కాపాడండి, ఆపరేషన్ కగార్ తక్షణమే నిలిపివేయాలని కేంద్రాన్ని కోరిన మంత్రి సీతక్క
Telangana News | కేంద్రంలోని మోదీ ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ కగార్ ను తక్షణమే నిలిపివేసి మావోయిస్టులను చర్చలకు పిలిచి, శాంతియుతంగా సమస్య పరిష్కరించుకోవాలని తెలంగాణ మంత్రి సీతక్క కోరారు.

హైదరాబాద్: మావోయిస్టులను అంతం చేస్తామంటూ కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ కగార్ ను తెలంగాణ మంత్రి సీతక్క వ్యతిరేకించారు. ఆదివాసీల ప్రయోజనాల దృష్టిలో ఆపరేషన్ కగార్ ను కేంద్రం తక్షణం నిలిపివేయాలని కోరారు. ఆదివాదీల ప్రాంతాల్లో శాంతియుత వాతావరణం నెలకొల్పడమే ప్రభుత్వాల లక్ష్యంగా ఉండాలన్నారు.
మంత్రి సీతక్క మాట్లాడుతూ.. ‘తెలంగాణ, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల సరిహద్దుల్లో శాంతియుత వాతావరణం నెలకొనాలి. మధ్య భారతదేశంలోని ఆదివాసి ప్రాంతాలు రాజ్యాంగంలో పేర్కొన్న షెడ్యూల్ 5 పరిధిలోకి వస్తాయి. కనుక అక్కడ ఆదివాసీలకు ప్రత్యేక హక్కులు ఉంటాయి. ఆదివాసి ప్రాంతాల్లో ప్రత్యేక పరిపాలన విధానాలు ఉంటాయి. కేంద్రం వాటిని అమలు చేయాలి. అందుకే ప్రభుత్వాలు రాజ్యాంగ బద్ధంగా వ్యవహరించి ఆదివాసీల శాంతియుత జీవన విధానానికి ఏ ఆటంకాలు లేకుండా చూడాలి. ఎందుకంటే ప్రభుత్వాలు రాజ్యాంగానికి లోబడే వ్యవహరించాలి
కేంద్ర ప్రభుత్వం బల ప్రయోగంతో కాకుండా, చర్చల ద్వారా సమస్య పరిష్కారం జరిగేలా వ్యవహరించాలని ఆదివాసి బిడ్డగా కోరుతున్నాను. ఎవరు అధికారంలో ఉన్నా ఆదివాసీల హక్కులను ఎవరూ కాలరాయవద్దు. ఆ జాతి బిడ్డగా ఆది వాసులకు అండగా నిలుస్తాను. మోదీ సర్కార్ కొనసాగిస్తున్న ఆపరేషన్ కగార్ తో ఆదివాసీలు తీవ్ర భయాందోళనలో ఉన్నారు. రెండు వైపుల ప్రాణ నష్ట నివారణకు శాంతి చర్చలు మార్గం చూపిస్తాయి. కనుక మావోయిస్టుల శాంతి చర్చల ప్రతిపాదనకు కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించాలని’ మంత్రి సీతక్క కోరారు.
తెలంగాణలో పెరుగుతున్న డిమాండ్
ఆదివారం నాడు హనుమకొండలోని ఎల్కతుర్తిలో బీఆర్ఎస్ నిర్వహించిన రజతోత్సవ సభలో కేసీఆర్ ఆపరేషన్ కగార్ మీద స్పందించారు. కేంద్రం ప్రభుత్వం ఆపరేషన్ కగార్ నిలిపివేయాలని కోరారు. అవసరమైతే కేంద్రానికి లేఖ రాస్తామన్నారు. ఆదివాసీలు, గిరిజనులకు ఇబ్బంది కలిగించేలా కాల్పులు జరపడం సరికాదన్నారు. మావోయిస్టులను చర్చలకు పిలిచి సమస్య పరిష్కరించాలని కేంద్రానికి సూచించారు. అనంతరం తెలంగాణ ప్రభుత్వం సైతం ఆపరేషన్ కగార్ మీద స్పందించింది. సీఎం రేవంత్ రెడ్డి సోమవారం నాడు జానారెడ్డితో పాటు ప్రభుత్వ సలహాదారు కే కేశవరావుతో ఈ విషయంపై ప్రత్యేకంగా సమావేశమై చర్చించారు. కేంద్ర ప్రభుత్వం గిరిజన ప్రాంతాల్లో తుపాకుల మోతను ఆపివేసి, మావోయిస్టులను చర్చలకు పిలవడం మంచిదన్నారు.
ఇటీవల సీపీఐ మావోయిస్టు పార్టీ సైతం కేంద్రానికి లేఖలు రాసింది. ఆపరేషన్ కగార్ నిలిపివేసి చర్చలు జరపాలని పీస్ కమిటీ ప్రధాని మోదీకి, హోం మంత్రి అమిత్ షాకు, ఛత్తీస్ గఢ్ ముఖ్యమంత్రి, డీజీపీలకు లేఖలు రాసినా ప్రయోజనం లేకపోయింది. గత వారం రోజులుగా తెలంగాణ, ఛత్తీస్ గఢ్ సరిహద్దుల్లోని ప్రాంతాల్లో, కర్రెగుట్టల అడవుల్లో భద్రతా బలగాలు కూంబింగ్ నిర్వహిస్తున్నాయి. ఇటీవల జరిగిన ఎన్ కౌంటర్‌లో 28 మంది మావోయిస్టులు చనిపోయారు. కర్రెగుట్టల్లో రహస్య స్థావరాలు, బంకర్ లాంటివి ఉన్నాయని భద్రతా బలగాలు గుర్తించాయి.






















