Indiramma Housing Scheme Rules: ఇందిరమ్మ ఇల్లు లబ్ధిదారులకు అలర్ట్, ఈ రూల్ తెలియకుండా ఇల్లు కడితే అనర్హులయ్యే అవకాశం
TS Indiramma Houses Rules | ఇందిరమ్మ ఇల్లు లబ్ధిదారులు ప్రభుత్వ నిబంధనలు తెలియక, అర్థంకాక ఆందోళన చెందుతున్నారు. తమకు విడత సాయం అందడం లేదని, అనర్హులు అంటున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Telangana Indiramma Housing Scheme | తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన ఇందిరమ్మ హౌసింగ్ స్కీం పై లబ్ధిదారులు ఆందోళన గురవుతున్నారు. అర్హులైన నిరుపేదలకు సొంతింటి కలను సహకారం చేయడానికి ఈ పథకాన్ని తీసుకొచ్చామని రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు చెబుతున్నారు. అయితే ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం విషయంలో షరతులతో లబ్ధిదారులు అయోమయానికి గురవుతున్నారు. 400 నుంచి 600 చదరపు అడుగుల విస్తీర్ణంలోపే ఇందిరమ్మ ఇంటిని నిర్మించుకోవాలని ప్రభుత్వం షరతు పెట్టింది. మొదటి విడతలో 70 వేల 122 ఇందిరమ్మ మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వడం తెలిసిందే.
తొలి విడత సాయం అందడం లేదని ఆవేదన
ప్రభుత్వం నుంచి అనుమతి పొందిన 2,830 మంది లబ్ధిదారులు ఇంటి పునాది పూర్తి చేసుకున్నారు. వీరిలో కొందరు లబ్ధిదారులకు తొలివిడతగా రావాల్సిన లక్ష రూపాయల సాయాన్ని ఇచ్చేందుకు అధికారులు నిరాకరించారు. 600 చదరపు అడుగుల పైనే ఇంటిని నిర్మించుకొంటున్న లబ్ధిదారులకు మొదటి విడత సాయం ఇవ్వలేదు. రాష్ట్ర ప్రభుత్వం నిబంధనలకు అనుగుణంగా 400 నుంచి 600 చదరపు అడుగుల విస్తీర్ణంలోకి ఉండేలా పునాదుల మార్పులు చేపడితే తొలి విడత సాయం లక్ష రూపాయలు అందిస్తామని అధికారులు చెబుతున్నారు.
కచ్చితంగా అంత విస్తీర్ణంలోనే ఇల్లు కట్టుకోవాలి
సొంత జాగా ఉన్నవారు తమ స్థలంలో ఇంటి నిర్మాణం చేపట్టవచ్చని ఇందిరమ్మ ఇళ్ల పథకంలో భాగంగా తీయమ రేవంత్ రెడ్డి అన్నారు. అర్హులైన లబ్ధిదారులకు ఐదు లక్షలు ప్రభుత్వం సహాయం చేస్తుందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సైతం పలుమార్లు చెప్పారు. కానీ ఇంటిని 400 నుంచి 600 చదరపు అడుగుల మధ్యలోనే నిర్మించుకోవాలని అధికారులు చెప్పడంతో లబ్ధిదారులు ఆందోళనకు గురవుతున్నారు. ప్రభుత్వం తమకు 5 లక్షల రూపాయలు సాయం చేస్తుందని, అదనపు ఖర్చులు పడితే తానే భరిస్తామని లబ్ధిదారులు చెబుతున్నారు. ఒకవేళ ఇంటి జాగా 600 చదరపు అడుగులు దాటితే ఆ లబ్ధిదారులు బిపిఎల్ పరిధిలోకి రారని.. ఇందిరమ్మ ఇళ్లకు వారిని అనర్హులుగా ప్రకటిస్తామని చెబుతున్నారు.
లబ్ధి పొందాలంటే అర్హులైన పేదలు తమ ఇళ్లను 400 చదరపు అడుగుల్లోనే నిర్మించుకోవాలి. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం అదనంగా 200 చదరపు అడుగులు పెంచుకునేందుకు వీలు కనిపిస్తూ 600 చదరపు అడుగులను లిమిట్ పెట్టినట్లు హౌసింగ్ శాఖ పేర్కొంది. మే 5వ తేదీలకు రెండో విడత జాబితాను రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించే అవకాశం ఉంది. ఈ క్రమంలో ఇందిరమ్మ ఇల్లు లబ్ధి పొందాలంటే 400 నుంచి 600 చదరపు అడుగుల లోపే ఇల్లు కట్టుకోవాలని నిబంధనను గృహనిర్మాణ శాఖ అధికారులు విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు.
లబ్ధిదారులకు సూచనలు
ఇందిరమ్మ యాప్ సర్వే చేసిన సమయంలోచూపిన స్థలంలోనే లబ్ధిదారుడు ముగ్గు పోసుకోవాలి. మరోచోట ఇల్లు కట్టే వారికి ఇందిరమ్మ ఇంటిని రద్దు చేస్తారు. నిర్మాణానికి ముగ్గు పోసిన తర్వాత గ్రామ కార్యదర్శి పరిశీలించి, ఫొటోలు తీసి ఆన్‌లైన్‌లో ఎంట్రీ చేస్తారు. నిర్మాణ ప్రదేశాన్ని జియో ట్యాగింగ్ చేస్తారు. 400 నుంచి 600 చదరపు అడుగులు లోపే ఇందిరమ్మ ఇల్లు నిర్మించుకోవాల్సి ఉంటుంది. ఇంటి పునాది పూర్తి చేస్తే మొదటి విడతలో లబ్ధిదారుడి బ్యాంకు ఖాతాలో రూ.1 లక్షను జమ చేస్తారు. ఇంటి నిర్మాణం పూర్తయిన దశలను బట్టి ఏఈ/ఎంపీడీవోలు ఫీల్డ్ విజిట్ చేసి.. లబ్ధిదారుడికి ఆర్థిక సాయం కోసం ప్రభుత్వానికి సిఫార్సు చేస్తారు.






















