Indiramma Housing Scheme Rules: ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి నిబంధనలు ఇవే, 21 నియోజకవర్గాల్లో వెయ్యికి పైగా ఇళ్లు
Telangana News | ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి అధికారులు నిబంధనలు రూపొందించారు. 21 నియోజకవర్గాల్లో వెయ్యికి పైగా ఇళ్లు మంజూరు చేయగా, మిగతా జిల్లాల్లో వెయ్యి కంటే తక్కువ ఇండ్లు ఇస్తున్నారు.

Guidelines for Indiramma Houses in Telangana | హైదరాబాద్: అర్హులై నిరుపేదలు తమ సొంతింటి కలను సాకారం చేసుకునేందుకు వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. మరోవైపు తెలంగాణ ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్ల పథకంలో లబ్ధిదారుల జాబితా సిద్ధం చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి మండలం నుంచి ఒక గ్రామాన్ని ఎంపిక చేసి ఇందిరమ్మ ఇళ్ల పంపిణీకి లబ్ధిదారుల జాబితాను అధికారులు సిద్ధం చేశారని సమాచారం. అయితే ఇందిరమ్మ ఇళ్ల గ్రౌండింగ్ కోసం అధికారులు ఏర్పాట్లు ప్రారంభించారు. ఈ ప్రాసెస్‌లో భాగంగా ముందుగా ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులను ఎంపిక చేసిన గ్రామాల్లో ప్రీ-గ్రౌండింగ్ సమావేశాల ఏర్పాటుకు అధికారులు చర్యలు చేపట్టారు. ఇళ్లు పొందే లబ్ధిదారులు ఇంటిని ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎలా కట్టుకోవాలి, నిర్మాణ సామగ్రి, ఇతర అంశాలపై నెలకొన్న సందేహాలను ప్రీ గ్రౌండింగ్ సమావేశాల్లో తీర్చనున్నారు.
21 నియోజకవర్గాల్లో 1000కి పైగా ఇండ్లు మంజూరు
కాంగ్రెస్ ప్రభుత్వం మొదటి విడతలో 71,482 ఇళ్లను లబ్ధిదారులకు ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. దశలవారీగా ఇందిరమ్మ ఇండ్లు లబ్ధిదారులకు వస్తాయని మంత్రులు చెబుతున్నారు. తొలి విడతలో 21 నియోజకవర్గాల్లో 1000కి పైగా ఇండ్లు ఇవ్వనుంది. రాష్ట్రంలో అత్యధికంగా ఒక్క హుజూర్‌నగర్ నియోజకవర్గంలోనే 2,528 ఇళ్లను ప్రభుత్వం అందించనుంది. ఆ తరువాత మంథనిలో 1,952 ఇందిరమ్మ ఇండ్లు, బోథ్‌లో 1,538, పరకాలలో 1,501, హుస్నాబాద్‌లో 1,381 ఇండ్లతో టాప్ 5లో నిలిచాయి. అనంతరం సిర్పూర్‌లో 1,324, దుబ్బాకలో 1,271, పరిగిలో 1,264 ఇండ్లు, బెల్లంపల్లిలో 1,206 జహీరాబాద్ 1,205 ఇండ్లతో టాప్ 10లో నిలిచాయి.
కొడంగల్, గజ్వేల్‌లలో ఎన్ని ఇండ్లు..
పెద్దపల్లిలో 1,198 ఇందిరమ్మ ఇండ్లు, కోదాడలో 1,152, చొప్పదండిలో 1,121, పినపాకలో 1,113, దేవరకొండలో 1,091, ములుగులో 1,080, ఆసిఫాబాద్‌లో 1,067, సీఎం రేవంత్ రెడ్డి నియోజకవర్గం కొడంగల్‌లో 1,046, అందోలులో 1,040, తుంగతుర్తిలో 1,014, మాజీ సీఎం కేసీఆర్ నియోజకవర్గమైన గజ్వేల్‌లో 1,001 ఇందిరమ్మ ఇళ్లను అందించనున్నారు. మిగతా నియోజకవర్గాల్లో ఇందిరమ్మ ఇండ్లు 1000 లోపే ఎంపిక చేసినట్లు తెలుస్తోంది.
ఇందిరమ్మ ఇండ్ల నిబంధనలు ఇవే..
- తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన ఇందిరమ్మ యాప్ సర్వే చేసిన సమయంలోచూపిన సొంత స్థలం ప్రాంతంలో లబ్ధిదారుడే ముగ్గు పోసుకోవాలి. మరోచోట ఇల్లు కట్టుకుంటే వారికి ఇందిరమ్మ ఇంటిని అధికారులు రద్దు చేస్తారు.
- ఇంటి నిర్మాణానికి ముగ్గు పోసిన తర్వాత గ్రామ కార్యదర్శి (Village Secretary)కి సమాచారం అందించాలి. గ్రామ కార్యదర్శి అక్కడికి వచ్చి పరిశీలించి, ఫొటోలు తీసి ఆన్‌లైన్‌లో ఎంట్రీ చేస్తారు. ఇందిరమ్మ ఇల్లు నిర్మాణ ప్రదేశాన్ని జియో ట్యాగింగ్ సైతం చేయనున్నారు.
- కనీసం 400 చదరపు అడుగులు కంటే తక్కువ కాకుండా ఇందిరమ్మ ఇల్లు నిర్మించుకోవాల్సి ఉంటుంది.
- ముఖ్యమైన అంశం ఏంటంటే.. ఇంటికి ముగ్గు పోసినప్పుడు మీకు ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆర్థిక సహాయం లభించదు. ఇంటి పునాది పూర్తి చేస్తే మొదటి విడతలో భాగంగా రూ.1 లక్షను లబ్ధిదారుడి బ్యాంకు ఖాతాలో జమ చేస్తారు.
- లబ్ధిదారులకు ప్రతి ఇంటికి 8 ట్రాక్టర్ల ఇసుకను అందించనున్నారు. ఇసుకకు సంబంధించిన కూపన్లను ఎమ్మార్వో గానీ, లేక ఆర్డీవోల ద్వారా లబ్ధిదారులకు అందించనున్నారు.
- హౌసింగ్ కార్పొరేషన్ ద్వారా సిమెంటు, స్టీలు వంటి నిర్మాణ సామగ్రిని తక్కువ ధరకు సమకూర్చేలా ఏర్పాట్లు చేస్తున్నారు.
- ఏఈ/ఎంపీడీవోలు ఫీల్డ్ విజిట్ చేసి, ఇంటి నిర్మాణం పూర్తయిన దశలను బట్టి లబ్ధిదారుడికి జమ చేసే ఆర్థిక సాయం కోసం ప్రభుత్వానికి సిఫార్సు చేస్తారు. - పలు గ్రామాల్లో ఏర్పాట్లు పూర్తయ్యాయి. మిగతా గ్రామాల్లో మరో వారం రోజుల్లో ప్రీ గ్రౌండింగ్ పూర్తి చేయడానికి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

