Telangana Latest News: తెలంగాణలో యూరియా నిల్వలపై ప్రభుత్వం కీలక ప్రకటన! అసెంబ్లీ సాక్షిగా లెక్కలు బయటపెట్టి మంత్రి తుమ్మల!
Telangana Latest News: యూరియా కొరత తెలంగాణలో లేదని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అసెంబ్లీలో ప్రకటించారు. యూరియా లెక్కలను సభ ముందు పెట్టారు.

Telangana Latest News: తెలంగాణలో యూరియా సంవృద్దిగా ఉందన్నారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. ఇదేదో మీడియా సమావేశంలో చేసిన ప్రకటన, చిట్ చాట్‌లో మాట్లడిన మాటలు కాదు. అసెంబ్లీ సాక్షిగా తాజాగా యూరియా నిల్వల లెక్కలు ఏ సంవత్సరం, ఎంత ఉన్నాయనేది బయట పెట్టారు. డిసెంబర్ 31 నాటికే 4.04 లక్షల మెట్రిక్ టన్నులు యూరియా రైతులకు సరఫరా చేసినట్లు మంత్రి తెలిపారు. శాసనమండలి ప్రశ్నోత్తరాల సమయంలో సభ్యులు అడిగిన ప్రశ్నకు సమాధానంగా యూరియా వివరాలు వెల్లడించారు. రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల యూరియాపై ఏమన్నారంటే..
వేసవిలో 2018-2019–20 సంవత్సరంలో అక్టోబర్–డిసెంబర్ కాలంలో మొత్తం 2.42 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా అమ్మకాలు నమోదు అవ్వగా,2020–21 సంవత్సరంలో యాసంగిలో అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు కేవలం 1.22 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా అమ్మకాలు మాత్రమే జరిగినట్లు మంత్రి తెలిపారు. 2021–22 సంవత్సరంలో యాసంగి సీజన్‌లో డిసెంబర్ నాటికి 1.75 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా అమ్మకాలు జరిగితే, 2022–23 సంవత్సరంలో అక్టోబర్, నవంబర్, డిసెంబర్ నెలల్లో కలిపి మొత్తం 2.63 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా అమ్మకాలు జరిగాయన్నారు తుమ్మల. 2023–24 సంవత్సరంలో యాసంగి సీజన్‌లో డిసెంబర్ నాటికి 2.17 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా అమ్మకాలు నమోదయ్యాయని, 2024–25 సంవత్సరంలో అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు మొత్తం 3.04 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా అమ్మకాలు జరిగినట్లు పాత లెక్కలు బయటకు తీశారు.
ప్రస్తుత 2025–26 యాసంగి సీజన్‌లో అక్టోబర్ నుంచి డిసెంబర్ 31 వరకు మొత్తం 4.04 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా అమ్మకాలు జరిగాయన్నారు. ఇది గత 8 సంవత్సరాల్లో అత్యధికం. వేసవిలో డిసెంబర్ వరకూ కేంద్ర కేటాయింపులు 5.60 లక్షల మెట్రిక్ టన్నులకు, ఇప్పటికే 5.78 లక్షల మెట్రిక్ టన్నుల యూరియాను తెప్పించుకోగలిగామని తెలిపారు. రైతులకు అవసరమైనంత వరకూ యూరియా సరఫరా చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్లు స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఉన్న 12000 సెంటర్లలో, ఎక్కడో 2,3 సెంటర్లలో ఉన్న క్యూలైన్లు చూపించి రాజకీయ పబ్బం గడపాలని అనుకుంటున్నారని, ఆతృతతో రైతులు అక్కడక్కడ షాప్ ల ముందూ నిల్చున్న సందర్భాలను చూపి యూరియా కొరత అని ప్రచారం చేసి మీ రాజకీయ లబ్ధి కోసం వాడుకోవాలని అనుకుంటే రైతులు క్షమించబోరని అన్నారు మంత్రి. గత ప్రభుత్వ హయాంలో ఉన్న క్యూల సంగతి, ఆ క్యూలలో రైతులు మరణించిన సందర్భాల గురించి నేను మాట్లాడదల్చుకోలేదన్నారు.
ఈ సంవత్సరం కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కపాస్ కిసాన్ యాప్ రాష్ట్రంలో కూడా అమలు చేసామన్నారు. ఆ యాప్ ను ఉపయోగించిన పత్తి రైతులలో సన్న, చిన్నకారు రైతులే ఎక్కువగా ఈ యాప్ ని వినియోగించి పత్తి అమ్మకాలు చేస్తున్నట్లు తెలిపారు. యూరియా యాప్ ను రాష్ట్రంలో 5 జిల్లాలలో ప్రయోగాత్మకంగా చేపట్టడం జరిగిందని, యాప్ మీద కూడా లేని పోని అపోహలు, గందరగోళం సృష్టించే ప్రయత్నాలు చేయడం దురదృష్టకరమన్నారు. ఈ యాప్ ను తీసుకొచ్చే ముందు రైతులందరికీ అవగాహన కల్పించినట్లు తెలిపారు. రిటైల్ అవుట్ లెట్ దగ్గర ఒక వాలంటీర్ ను ఉంచడం జరిగిందని, ఈ యాప్ ప్రయోగాత్మక దశలో ఏర్పడుతున్న సాంకేతిక సమస్యలన్నింటినీ ఒక్కొక్కటిగా పరిష్కరించినట్లు తెలిపారు. కౌలు రైతులకు, పట్టాలు లేని రైతులకు ఇబ్బంది కలగకుండా చూసుకున్నాం -నేను స్వయంగా రైతు వేదికల ద్వారా ఆయా జిల్లాల రైతులతో మాట్లాడితే వారు సంతృప్తి వ్యక్తం చేశారని మంత్రి అన్నారు. యాప్ ద్వారా డిసెంబర్ 20వ తేది నుండి ఇప్పటివరకు 1.18 లక్షల మంది రైతులు 3.36 లక్షల యూరియా బస్తాలు కొనుగోలు చేశారని శాసన మండలిలో తెలిపారు వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల.





















