Secrets of Akshaya Patra: అక్షయ పాత్ర ఎలా ఉంటుంది , ఇప్పుడు ఎక్కడుంది - అక్షయపాత్ర గురించి ఆసక్తికర విషయాలివి!
Akshaya Patra: అక్షయ పాత్ర ఎలా ఉంటుంది? ద్వాపర యుగానికి చెందిన అక్షయపాత్ర ఇప్పుడు ఎక్కడుంది? యుగానికో అక్షయ పాత్ర ఉంటుందా? అక్షయ పాత్ర గురించి పురాణాల్లో ఏముంది?

Secrets of Akshaya Patra: పురాణాల్లో ఉన్న సమాచారం ప్రకారం మహాభారతంలో...మాయా జూదంలో ఓడిపోయిన పాండవులు వనవాసానికి బయలుదేరారు. వద్దని వారించినా తమను అనుసరించిన పండితులను ఎలా పోషించాలా అని ఆలోచనలో పడ్డారు పాండవులు. అప్పుడు సూర్య భగవానుడిని ప్రార్థించాడు ధర్మరాజు. ప్రత్యక్షమైన సూర్యభగవానుడు అక్షయపాత్ర ప్రసాదించాడు. ఈ పాత్రపై మూతపెట్టి ప్రత్యక్షదైవాన్ని ప్రార్థిస్తే ఎంతమందికి అయినా సరిపడా భోజనం సిద్ధమవుతుంది. ఆ పాత్రకు ఉన్న శక్తి అలాంటిది.
వనవాసంలో ఉన్నప్పుడు ధర్మరాజుకి సూర్యుడు ప్రసాదించిన అక్షయపాత్ర కురుక్షేత్ర సంగ్రామం తర్వాత ఏమైంది?
వనవాసం తర్వాత అక్షయ పాత్ర గురించి ఎక్కడా ప్రస్తావన లేదెందుకు?
ఇప్పటికీ అక్షయపాత్ర ఉందా? ఉంటే ఎక్కడుంది?
ఉడిపి శ్రీకష్ణ మఠంలో అక్షయపాత్ర ఉందనే ప్రచారంలో నిజమెంత?
ద్వైత సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన త్రిమతాచార్యులలో ఒకరైన శ్రీ మధ్వాచార్యులు ఉడిపిలో శ్రీకృష్ణుడి విగ్రహాన్ని ప్రతిష్టించారు ( ఉడిపి లో కృష్ణుడి విగ్రహం స్వయంగా రుక్మిణి చెక్కించినది ఆ వివరాలు తెలుసుకునేందుకు ఈ లింక్ క్లిక్ చేయండి). ఉడిపిలో శ్రీకృష్ణుడి విగ్రహాన్ని ప్రతిష్టించిన తర్వాత ఇక్కడ నిరంతరం అన్నదానం చేయమని చెప్పి శ్రీ మధ్వాచార్యులు అక్షయపాత్ర ఇచ్చారని చెబుతారు. ఆ తర్వాత కాలంలో ఉడిపిలో మొత్తం 8 మఠాలు ఏర్పడ్డాయి. రెండేళ్లకోసారి ఓ మఠం ఆలయ బాధ్యతలు స్వీకరిస్తుంది. ఆ సమయంలో పాత్ర చేతులు మారుతుంది.
మధ్వాచార్యులకు అక్షయపాత్ర ఎలా వచ్చిందో వివరిస్తూ మరో కథ ప్రచారంలో ఉంది. గత జన్మలో భీముడే ఇప్పుడు మధ్వాచార్యుడిగా జన్మించాడని చెబుతారు. అందుకు సాక్ష్యంగా ఎన్నో సంఘటనలు పురాణాల్లో ఉన్నాయి. ఓసారి మధ్వాచార్యులు తన శిష్యులతో కలసి కురుక్షేత్రం జరిగిన ప్రదేశానికి వెళ్లినప్పుడు తాను యుద్ధం చేసిన ప్రదేశం ఇదే అని చెప్పారట. అంతేకాదు..ఇక్కడ తవ్వి చూడండి నా గద ఉంటుందని కూడా అన్నారట. వెంటనే శిష్యులు ఆ ప్రదేశాన్ని తవ్వి చూడగా నిజంగానే భీముడి గద కనిపించింది.
అక్షయపాత్ర గురించి అడిగితే మధ్వాచార్యుడి గతజన్మ గురించి ఎందుకు అనే సందేహం వచ్చిందా?
సూర్యుడు ప్రసాదించిన అక్షయపాత్ర..పాండవులు వనవాసం సమయంలో భీముడు-ద్రౌపది అధీనంలో ఉండేది. మహాభారంతో జరిగిన ఎన్నో సంఘటనల గురించి చెప్పిన మధ్వాచార్యులు...అక్షయపాత్ర గురించి కూడా చెప్పి ఉండొచ్చనే ప్రచారం ఉందియ
అయితే అప్పట్లో సూర్యభగవానుడు ధర్మరాజుకి ఇచ్చిన అక్షయపాత్ర - ఉడిపి పీఠంలో ఉండే అక్షయపాత్ర ఒకటికాదు.. ఎందుకంటే?
ఉడిపి మఠంలో ఉన్న అక్షయపాత్రపై దేవనాగరి లిపిలో నాధిపతయేనమః అనే అక్షరాలు కనిపిస్తాయి.అంటే అది ఈ యుగానికి సంబంధించినది అని అర్థం.
మరి అసలు అక్షయపాత్ర ఏమైంది?
‘నీ తపమునకు మెచ్చితి; నీ వరణ్యంబున నుండఁ గల పండ్రెండేండ్లును
వన్యఫలమూలశాకంబులు నీ మహాన సంబున ద్రుపదరాజపుత్త్రిచేత
సాధితంబులై యక్షయంబులైన చతుర్విధాహారంబులగు’
నని యొక్క తామ్రస్థాలి యిచ్చి, వరం బిచ్చి వనజహితుం డంతర్హితుం డైన
ఇది మహభారతంలో ఉన్న శ్లోకం..దీని అర్థం ఏంటంటే..
తామ్రస్థాలి అంటే రాగి పాత్ర ...సూర్యుడు ఇచ్చిన ఈ అక్షయ పాత్ర అరణ్యవాసంలో ఉపయోగపడుతుందని చెప్పాడు. అంటే దాని శక్తి పాండవులు అరణ్యవాసంలో ఉన్న 12 ఏళ్లు మాత్రమే. ఆ తర్వాత అక్షయపాత్ర శక్తి తగ్గిపోతుంది. పైగా పాండవులకు సూర్యుడు ప్రసాదించింది రాగిపాత్ర... ఉడిపిలో ఉన్నది చెక్కపాత్ర. అంటే ఈ రెండు ఒకటి కాదు.
అక్షయపాత్రలు ఎన్నైనా ఉండొచ్చా?
యుగానికో అక్షయ పాత్ర ఉంటుందా?
అక్షయ పాత్ర అంటే అదో గిన్నె కాదు ఓ శక్తి. దేనికైనా అక్షయం అయ్యే శక్తి ఉందంటే అది అక్షయపాత్ర అవుతుంది. మహనీయులు తమ తపోశక్తిని ధారపోసి ఆ శక్తిని అందిస్తారు. మధ్వాచార్యులు కూడా ఉడిపిలో ఇచ్చిన అక్షయ పాత్రను ఇలాగే తయారు చేసి ఉండొచ్చేమో అంటున్నారు పండితులు. ఏదేమైనా మధ్వాచార్యులు ఇచ్చిన ఉద్దేశం ఉడిపిలో నెరవేరుతోంది. ఇప్పటికీ నిరంతరం అన్నదానం జరుగుతూనే ఉంది. ఈ పాత్రను మఠంలో ఉంచి ధాన్యం నింపి పూజిస్తారు. పూజ పూర్తైన తర్వాత ఆ పాత్రపై ఉన్న గరిటె తీసుకొచ్చి చేసిన వంటలపై తాకిస్తారు. అప్పుడు వడ్డన ప్రారంభిస్తారు. ఎంత మంది భక్తులు వచ్చినా భోజనం సరిపోవడం లేదనే మాటే లేదు..అదంతా అక్షయ పాత్ర మహిమే అంటారంతా..
గమనిక: ఆధ్యాత్మిక గ్రంధాల్లో పేర్కొన్న వివరాలు ఆధారంగా రాసిన కథనం ఇది. దీనిని ఎంతవరకూ విశ్వశించాలి అనేది పూర్తిగా మీ వ్యక్తిగతం..






















