Spiritual Stories: తాకి చెడినవాడు ఇంద్రుడు, తాకకుండా చెడినవాడు రావణుడు, ఇచ్చి చెడినవాడు కర్ణుడు..మీకు అర్థమవుతోందా!
Ramayana and Mahabharata: మనిషి వినాశనానికి కారణాలెన్నో.. ఎంతటివారైనా ఏదో సందర్భంలో చేసిన తప్పువల్ల తప్పనిసరిగా మూల్యం చెల్లించుకోవాల్సిందే.. పురాణాల్లో ఉండే వీళ్లే అందుకు ఉదాహరణ

Devotional and Motivational Stories
తాకి చెడినవాడు ఇంద్రుడు
తాకకుండా చెడినవాడు రావణుడు
చెప్పడంవల్ల చెడినవాడు విశ్వామిత్రుడు
చెప్పకపోవడంవల్ల చెడినవాడు హరిశ్చంద్రుడు
దానం ఇచ్చి చెడిన వాడు కర్ణుడు
ఇవ్వకపోవడం వల్ల చెడినవాడు దుర్యోధనుడు
ఇంద్రుడు
దేవతలరాజు , గొప్పశక్తివంతుడు ఇంద్రుడు. అయినప్పటికీ తన పదవి పోతుందేమో అనే భయంతో తరచూ తన శక్తిని తప్పుడు ప్రయోజనాలకు ఉపయోగించేవాడు. తన కోర్కెలు తీర్చుకునేందుకు ఆయా స్త్రీల భర్త వేషధారణలో వెళ్లేవాడు. అలా అహల్యను తాకి ఆమెను శాపానికి గురిచేసింది ఇంద్రుడే. ఈ కారణందా తన ప్రతిష్టను భంగపరుచుకున్నాడు. శక్తిని సరిగ్గా వినియోగించకపోతే అది చెడు ఫలితాలనే ఇస్తుంది అనేందుకు ఇంద్రుడు ఉదాహరణ.
రావణుడు
రావణుడు మహా జ్ఞాని, శివుడికి పరమభక్తుడు. కానీ తనకున్న అహంకారం , ఆపద్ధర్మాలను పట్టించుకోకపోవడం రావణుడిని చెడగొట్టాయి. సీతను అపసహరించడంపై తన శక్తిని చూపించాడు. అంటే ఎలాంటి ప్రతిఫలం లేకుండా శక్తి ప్రదర్శించి భంగపడ్డాడు. ఎంత శక్తి ఉన్నప్పటికీ కొన్ని పరిమితులకు లోబడి ఉండకపోతే అది నాశనానికి దారితీస్తుంది.
విశ్వామిత్రుడు
విశ్వామిత్రుడు గొప్ప తపస్వి. కానీ ఆయనకున్న కోపం, అహంకారంతో తన ప్రతిష్టకు తానే నష్టం చేసుకున్నారు. వశిష్ఠ మహర్షితో ఆయన చేసిన వివాదం, పంతానికి పోయి త్రిశంకు స్వర్గం సృష్టించడం ఇవన్నీ ఈ కోవకే చెందుతాయి. తపస్సు కారణంగా ఎన్ని శక్తులు సంపాదించినా అవి నిష్ఫలం అయిపోయాయి. అనవసరంగా మాట్లాడి ..అవసరం లేని దగ్గర కోపం ప్రదర్శిస్తే ఎవరికైనా ఈ నష్టం తప్పదు.
హరిశ్చంద్రుడు
హరిశ్చంద్రుడు సత్యాన్ని మాత్రమే పలుకుతాడు. కానీ అదే సత్యానికి కట్టుబడి మౌనంగా ఉండిపోయి తన జీవితాన్ని కోల్పోయాడు. సత్యధర్మం కోసం రాజ్యాన్ని వదులుకున్నాడు, భార్య, బిడ్డని కోల్పోయాడు. అంటే కొన్ని సందర్భాల్లో నిజాయితీ మాత్రమేకాదు సమర్థతతో వ్యవహరించాలి, అన్ని సందర్భాల్లోనూ మౌనం సరైనది కాదు
కర్ణుడు
కర్ణుడు గొప్పదాత..ఈ విషయంలో ఎలాంటి సందేహం లేదు. ఎవరు ఏది అడిగినా లేదు అనకుండా దానం చేసేవాడు కర్ణుడు. కానీ దుర్మార్గుడైన దుర్యోధనుడి పక్షాన ఉండడం వల్ల తన దానగుణం కూడా తనను కాపాడలేకపోయింది. దానంలో భాగంగా కవచకుండలాలు ఇవ్వడం వల్లనే రక్షణ కోల్పోయాడు. అదుపు లేని దానం అనర్థాలకు దారితీస్తుందనే సందేశం ఉంది ఇందులో.
దుర్యోధనుడు
శక్తివంతుడు, పరాక్రమవంతుడు అయినప్పటికీ అసూయ, అహంకారంతో రగిలిపోయేవాడు దుర్యోధనుడు. పాండవులకు ఇవ్వాల్సిన రాజ్యం ఇవ్వకపోవడమే దుర్యోధనుడి పతనానికి కారణం అయింది. తగిన సమయంలో దానం, త్యాగం చేయనకపోయినా అది మీ ప్రతిష్టను దెబ్బతీస్తుందనేది ఇందులో సందేశం.
స్పష్టంగా చెప్పాలంటే శక్తిని సరిగా వినియోగించుకోవాలి, అహంకారం తగ్గించుకోవాలి, కోపంగా ఉన్నప్పుడు నిర్ణయాలు తీసుకోవ్దదు, మాటలు - చేతల్లో సమతుల్యం అవసరం, స్వార్థం-అసూయలు మీ నాశనానికి దారితీస్తాయి..ఇవి గుర్తించగలిగితే మీ జీవితంలో మీరు పశ్చాత్తాపపడే సందర్భం రాదని చెబుతారు పండితులు
తిరుమలలో ఉన్నది రాతి విగ్రహం కాదు.. సజీవంగా నిల్చున్న శ్రీ వేంకటేశ్వరుడు - తిరుమలలో జరిగే సేవలేంటి? ఏ సేవలో ఏం చేస్తారు? ఏ సేవకు వెళితే మంచిది? ఈ వివరాల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి
గమనిక: ఆధ్యాత్మిక వేత్తల ప్రసంగాల నుంచి సేకరించి రాసిన కథనం ఇది. దీనిని ఎంతవరకూ విశ్వశించాలి అనేది పూర్తిగా మీ వ్యక్తిగతం.






















