Simhachalam: ఏప్రిల్ 30 సింహాద్రి అప్పన్న చందనోత్సవం.. సామాన్య భక్తులకే తొలి ప్రాధాన్యం, ప్రత్యేక ఏర్పాట్లు ఇవే!
Chandanotsavam 2025: సింహాచలం శ్రీ వరాహా లక్ష్మీనృసింహస్వామి చందనోత్సవం ఏప్రిల్ 30న వైభవంగా జరగనుంది. ఈ మేరకు భారీగా తరలివచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేస్తోంది ప్రభుత్వం

Simhachalam Chandanotsavam 2025: ఏడాది పొడవునా సుగంధభరిత చందనంలో ఉండే సింహాద్రి అప్పన్న కేవలం వైశాఖ శుద్ధ తదియ నాడు మాత్రమే భక్తులకు తన నిజరూపదర్శనం ఇస్తాడు. దీనినే చందనోత్సవం, చందనయాత్రగా పిలుస్తారు భక్తులు. పురూరవ చక్రవర్తుల కాలం నుంచి క్రమం తప్పకుండా సింహగిరిపై ఈ ఉత్సవాన్ని కన్నులపండువగా నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది చందనోత్సవం విజయవంతంగా నిర్వహించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాలమేరకు జిల్లా యంత్రాంగం ఏర్పాట్లు చేస్తోంది. గతంలో జరిగిన చిన్న చిన్న పొరపాట్లు కూడా ఈ ఏడాది జరగకుండా ఉండేలా జాగ్రత్తపడాలని సూచించారు దేవాదాయశాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి. ఈ మేరకు ఏప్రిల్ 16 బుధవారం సమీక్ష నిర్వహించారు.
ఏప్రిల్ 30 తెల్లవారుజామున 3.00 గంటల నుంచే సామాన్య భక్తులను దర్శనాలకు అనుమతిస్తామని చెప్పారు మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి
ఏప్రిల్ 29 అర్థరాత్రి తెల్లవారు జామున 1.00 గంటకు సుప్రభాత సేవతో చందనోత్సవ క్రతువు మొదలవుతుంది.
తెల్లవారుజామున 3.30 నుంచి 4.00 గంటల సమయంలో రాష్ట్ర ప్రభుత్వం నుంచి పట్టువస్త్రాలు సమర్పిస్తారు...అనంతరం TTD నుంటి పట్టివస్త్రాలు సమర్పిస్తారు
ఉదయం 4.15 నుంచి 4.30 గంటల లోపు మొదటి స్లాట్ VIP దర్శనాలు మొదలవుతాయి, ఈ ఏడాది VIP టికెట్లు కేవలం 2500 మాత్రమే జారీచేస్తున్నామని స్పష్టం చేశారు మంత్రి. ఈ రోజు అంతరాలయ దర్శనాలు ఉండబోవు అని స్పష్టం చేశారు.
వెయ్యి రూపాయల టిక్కెట్లు కొనుగోలు చేసిన భక్తులను తెల్లవారుజామున 4.00 గంటల నుంచి దర్శనాలకు అనుమతిస్తారు
ఏప్రిల్ 29వ తేదీ సాయంత్రం 6.00 గంటలకు సాధారణ దర్శనాలు నిలిపేస్తారు..ఎందుకంటే చందనోత్సవం రోజు తెల్లవారు జాము 1.00 గంట నుంచి ప్రత్యేక పూజా ప్రక్రియలు ప్రారంభమవుతాయి
30వ తేదీ ఉదయం 3.00 నుంచి రాత్రి 7.00 గంటల వరకు దర్శనాలుంటాయి...7 గంటల కన్నా ముందుగా క్యూలైన్లలో ఉండేవారికి ఎంత ఆలస్యం అయినా దర్శనాలుంటాయి
భక్తులకు ఉచిత అన్నప్రసాదం, లడ్డూ ప్రసాదం అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు
క్యూలైన్లలో వేచి ఉండే భక్తులకు ఎక్కడికక్కడ తాగునీరు, మజ్జిగ, బిస్కెట్లు అందించనున్నారు, చిన్నారులకు పాలు కూడా సమకూర్చనున్నారు
భక్తులు ప్రశాంత వాతావరణంలో సంతృప్తికర స్థాయిలో దర్శనం చేసుకునేలా దేవాదాయ, రెవెన్యూ, హోం శాఖ అధికారులు అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. సనాతన ధర్మాన్ని కాపాడుతూ దేవాలయాల పరిధిలో జరిగే అన్ని వేడుకలను ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు మంత్రి ఆనం. రాష్ట్ర ప్రభుత్వం తరఫున సింహాచలేశ్వరుడికి పట్టువస్త్రాలు సమర్పించనున్నారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు.
సింహాచలంలో చందనోత్సవం ఏర్పాట్లు, అప్పన్న ఆలయ అభివృద్ధి, పంచ గ్రామాల సమస్య పరిష్కారంపై దేవస్థానం కల్యాణమండపంలో సమీక్ష నిర్వహించారు. మంత్రులు ఆనం రామనారాయణరెడ్డి, వంగలపూడి అనిత, డీబీవీ స్వామి, అనగాని సత్యప్రసాద్ సహా ఆలయ అనువంశిక ధర్మకర్త, కేంద్రమాజీ మంత్రి అశోక్‌గజపతిరాజు, MLA లు పల్లా శ్రీనివాసరావు, గంటా శ్రీనివాసరావు, వెలగపూడి రామకృష్ణబాబు, పంచకర్ల రమేశ్‌బాబు, పీవీజీఆర్ గణబాబు సమావేశంలో పాల్గొన్నారు.
తిరుమలలో ఉన్నది రాతి విగ్రహం కాదు.. సజీవంగా నిల్చున్న శ్రీ వేంకటేశ్వరుడు - తిరుమలలో జరిగే సేవలేంటి? ఏ సేవలో ఏం చేస్తారు? ఏ సేవకు వెళితే మంచిది? ఈ వివరాల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి






















