Pahalgam Terror Attack: హిందువులను చంపినా అతి మంచితనం పనికిరాదు, మీరు పాకిస్తాన్ వెళ్లిపోండి- పవన్ కళ్యాణ్ సంచలనం
Pahalgam Terror Attack | పహల్గాంలో కాల్పులు జరిపి 25 మంది హిందువులను చంపేసినా.. పాకిస్తాన్ మీద ప్రేమ కురిపిస్తున్న వారు ఆ దేశానికే వెళ్లిపోవాలని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు.

మంగళగిరి: కాశ్మీర్ లోని పహల్గాంలో ఐడీ కార్డులు తీసుకుని చెక్ చేసి, మతం అడిగి మరీ హిందువులను దారుణంగా కాల్చి చంపారని ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. కానీ కొందరు సెక్యూలర్, లౌకిక అనే పేరుతో పాకిస్తాన్ మీద ప్రేమ చూపిస్తున్నారు భారత్‌లో ఉండటం ఎందుకని ప్రశ్నించారు. అలాంటి వారు పాకిస్తాన్‌కు వెళ్లిపోవాలంటూ మండిపడ్డారు. పహల్గాంలో జరిగిన ఉగ్రదాడిలో చనిపోయిన వారికి నివాళి అర్పిస్తూ జనసేన పార్టీ మంగళగిరిలో కార్యక్రమం నిర్వహించింది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పాల్గొని మాట్లాడుతూ.. మతం పేరిట హిందువులపై జరిగిన ఉగ్రదాడిని ఉపేక్షించకూడదు అన్నారు.
25 మంది హిందువులు, ఓ ముస్లిం చనిపోయారు
‘నిరాయుధులైన వారిపై కాల్పులు జరపడం దారుణం. ఎంతో నమ్మకం ఉంటేగానీ కాశ్మీర్ కు ప్రజలు వెళ్లరు. అయితే ఆర్టికల్ 370 రద్దుతో పరిస్థితి మారిందని పర్యాటకులు వెళ్తున్నారు. కానీ తీవ్రవాదులు అలజడి సృష్టించారు. ప్రపంచమే గ్లోబల్ విలేజ్ అంటుంటారు. కాశ్మీర్ లో జరిగితే మనకెందుకు అనుకోకూడదు. ఇది మన దేశంలోనే ఉంది. కాశ్మీర్ మనదే. తక్కువ స్థాయి ఆలోచనా విధానంతో కొందరు మీ రాష్ట్రం కాదు కదా అంటారు. దేశ సరిహద్దుల్లో ఏమైనా జరిగితే దాని ప్రకంపనలు అన్ని రాష్ట్రాలను తాకుతాయి. రిటైర్డ్ బ్యాంకు ఉద్యోగి చంద్రమౌళి ఫ్యామిలీతో కలిసి కాశ్మీర్ చూద్దామని వెళ్తే తూటాలతో ఆయన శరీరం నిండిపోయింది. చనిపోయిన వారి కుటుంబాలను బాధ చూశాక ఉగ్రవాదులను చంపేయాలి అనిపిస్తోంది. 26 మంది ఉగ్రదాడిలో చనిపోగా, అందులో 25 మంది హిందువులు, ఒకరు ముస్లిం.
వాస్తవాన్ని ఉన్నది ఉన్నట్లుగా చూపించాలి. కొన్ని విషయాల్లో టార్గెట్ చేస్తున్నట్లు కనిపిస్తే దాని మీడియా కూడా చూపించాలి. కానీ ఇది దేశ ప్రజల మధ్య వివాదం కాదు. ఉగ్రవాదులపై కోపం. 1986 నుంచి 1989 వరకు అన్నయ్య సినిమాల షూటింగ్ కోసం ఎన్నోసార్లు కాశ్మీర్ వెళ్లాం. కాశ్మీర్ పండిట్ల వలసను ఆనాడు ఆపి ఉంటే వారు అక్కడే ఉండేవారు. లక్షలాది మంది కశ్మీరి పండిట్స్ ప్రాణభయంతో వలస వెళ్లారు. 1986లో తొలిసారి బాగుంది అనిపించింది. ఆతరువాత వచ్చినప్పుడు అక్కడ పరిస్థితి భిన్నంగా ఉంది. అక్కడి దారుణాలను ఓ కశ్మీరి పండిట్ మాకు చెప్పాడు. భవిష్యత్తులో ఇలాంటి పరిస్థితి తలెత్తకూడదని జనసేన భావిస్తోంది. కుటుంబాన్ని నడపాలంటే ఎన్నో ఇబ్బందులు. అలాంటివి ఇన్ని రాష్ట్రాలున్న పెద్ద దేశాన్ని నడపాలంటే నేతకు మద్దతు తెలపాలి. కళ్ల ముందే మధుసూదన్ లాంటి ఎంతో మందిని దారుణంగా చంపేశారు.
అతి మంచితనం అవసరం లేదు, మీరు పాక్ వెళ్లిపోండి
భారత్ కు సహనం ఎక్కువ. కానీ ఏదైనా అతి చేసినా.. మితిమీరిన మంచితనం సరికాదు. దానివల్ల మనకే నష్టం జరుగుతోంది. పాకిస్తాన్ మూడుసార్లు యుద్ధంలో ఓడిపోయినా, మనమీద ఉగ్రదాడులు చేస్తూనే ఉంది. ఈ సమయంలో దీనిపై ఓ కఠిన నిర్ణయం తీసుకోవాలి. రేపు యుద్ధం వచ్చినా, రాకపోయినా మనం జాతీయత అనేలా ఆలోచించాలి. తప్పు జరిగితే దాన్ని ఎదిరించాలి. 26 మందిని మత ప్రాతిపదికన చంపినా.. మతాన్ని చూసి చంపలేదని సో కాల్డ్ సెక్యూలర్ వాదులు వాదిస్తున్నారు. మీకు నిజంగానే పాకిస్తాన్ మీద అంత ప్రేమ ఉంటే ఆ దేశానికే వెళ్లిపోండి. కాంగ్రెస్ నేతలు పాకిస్తాన్ పై జాలి చూపుతున్నారు. దేశంపై దాడి జరిగితే పాక్ కు మద్దతు తెలుపుతూ సెక్యూలరిజం అంటే చూస్తూ ఊరుకునేది లేదు. చనిపోయిన వారి కుటుంబాలకు ఆ ప్రాణాలకు తిరిగి తీసుకురాగలరా. టీవీలో కనిపిస్తామని అనుకోలేదు. కానీ మా బతుకులు ఇలా అయిపోయాయి. మోదీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వంపై నమ్మకంతోనే కాశ్మీర్ కు వెళ్లాం. అలాంటిది ప్రాణాలు పోతే బాధ్యత ఎవరిరిది. మత ప్రాతిపదికన చంపితే సెక్యూలర్ అని వాదించే వారిని ఏమనాలి. తప్పు జరిగితే ఖండించాలి. వాటికి వ్యతిరేకంగా పోరాటం జరపాలని’ సూచించారు.






















