Pahalgam Terror Attack: పహల్గాం దాడిపై పార్లమెంట్‌లో చర్చిద్దాం, ప్రధాని మోదీకి మల్లికార్జున ఖర్గే లేఖ
Mallikarjun Kharge Letter to PM Modi | పహల్గాంలోని బైసరన్ లోయలో జరిగిన ఉగ్రదాడిపై చర్చించేందుకు పార్లమెంట్ సభయ సభల ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయాలని కోరుతూ ప్రధాని మోదీకి మల్లికార్జున ఖర్గే లేఖ రాశారు.

Kashmir Terror Attack | న్యూఢిల్లీ | కాంగ్రెస్ అధ్యక్షుడు, రాజ్యసభలో విపక్షనేత మల్లికార్జున ఖర్గే ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు. ఏప్రిల్ 22న జమ్మూకాశ్మీర్ లోని పహల్గామ్‌లో జరిగిన ఉగ్రవాద దాడితో తలెత్తిన పరిస్థితిని ఎదుర్కోవడంపై సమిష్టిగా చర్చించడానికి పార్లమెంట్ సమావేశం కావాలని లేఖలో పేర్కొన్నారు. అందుకోసం పార్లమెంటు ఉభయ సభల ప్రత్యేక సమావేశాన్ని వీలైనంత త్వరగా ఏర్పాటు చేయాలని మల్లికార్జున ఖర్గే ప్రధాని మోదీకి రాసిన లేఖలో కోరారు.
Congress President and Leader of the Opposition in the Rajya Sabha, Mallikarjun Kharge has written to Prime Minister Narendra Modi requesting that a special session of both Houses of Parliament be convened at the earliest to demonstrate a collective will to deal with the… pic.twitter.com/3p5ZqagsVb
— ANI (@ANI) April 29, 2025
ప్రధాని మోదీ తీరు సరికాదన్న కాంగ్రెస్..
పహల్గాం ఉగ్రదాడిపై చర్చించేందుకు ఏర్పాటుచేసిన అఖిలపక్ష సమావేశానికి ప్రధాని నరేంద్ర మోదీ గైర్హాజరు కావడాన్ని కాంగ్రెస్ అధ్యక్షుడు, రాజ్యసభ ఎంపీ మల్లికార్జున ఖర్గే తప్పు పట్టారు. రాజస్థాన్లోని జైపూర్ లో సోమవారం (ఏప్రిల్ 28న) జరిగిన సంవిదాన్ బచావో ర్యాలీలో పాల్గొన్న మల్లికార్జున ఖర్గే మాట్లాడుతూ.. ఢిల్లీలో ఏర్పాటు చేసిన అఖిలపక్ష సమావేశానికి అన్ని పార్టీల ముఖ్య నేతలు హాజరయ్యారు. కానీ మోడీ ఈ కీలక సమావేశానికి డుమ్మా కొట్టడాన్ని ఖర్గే తప్పు పట్టారు. ఒకవేళ ప్రధాని మోదీ ఈ సమావేశానికి హాజరై పహల్గాం ఉగ్రదాడిపై ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోనుంది, వారి ప్లాన్స్ వివరించి ఉంటే బాగుండేది అన్నారు.
బిహార్ వెళ్లి పొలిటికల్ స్పీచ్
అదే సమయంలో ప్రధాని మోదీ బిహార్ కు వెళ్లి పొలిటికల్ స్పీచ్ ఇవ్వడం సరి కాదన్నారు. పార్టీలు, మతాల కంటే మనకు దేశమే ముఖ్యం. దేశం కోసం అంతా ఏకం కావాలి. అందుకోసమే మేము కేంద్ర ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలకు మద్దతు ప్రకటిస్తున్నాం. అంబేద్కర్ రాసిన రాజ్యాంగం వల్లే ఛాయ్ అమ్ముకున్న మోడీ ప్రధానమంత్రి అయ్యారు. అందుకే రాజ్యాంగాన్ని అందరూ పాటిస్తూ.. ఇలాంటి సమయంలో సమిష్టిగా నిర్ణయాలు తీసుకుంటే దేశానికి ప్రయోజనం ఉంటుందన్నారు. కాంగ్రెస్ పార్టీ ఐక్యమత్యం గురించి చెబుతుంటే బిజెపి నేతలు మాత్రం విభజన వాదంతో ముందుకెళ్తున్నారని ఖర్గే విమర్శించారు.
జమ్మూ కాశ్మీర్లో జరిగిన ఉగ్రదాడిపై ఎన్డీయే ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలకు తమ కట్టుబడి ఉంటామన్నారు. ఏ రూపంలో ఉన్నా ఉగ్రవాదాన్ని సహించేది లేదన్నారు. కేంద్ర ప్రభుత్వం దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేస్తుందని, విపక్ష నేతలపై వేధింపులకు మాత్రం బాగా వాడుతుందన్నారు. బిజెపి నేతలు దేవుళ్ళ పేర్లు స్మరిస్తారో లేదో కానీ కాంగ్రెస్ సహా విపక్ష నేతల పేర్లు ప్రతిరోజు తలుచుకుంటారని ఎద్దేవా చేశారు.
కాగా, పాక్ పౌరులకు భారత ప్రభుత్వం విధించిన గడువు నేటితో ముగియనుంది. రెగ్యూలర్ వీసాల వాళ్లు 27నే భారత్ ను వీడి వెళ్లిపోయాలి, మెడికల్ వీసాలాంటి ఎమర్జెన్సీ వీసాల మీద భారత్ లో ఉంటున్న వారు సైతం నేడు (ఏప్రిల్ 29న) దేశం నుంచి తిరిగి పాక్ వెళ్లిపోవాల్సి ఉంది. డెడ్ లైన్ నేటితో ముగియనున్న నేపథ్యంలో పార్లమెంట్ సమావేశం త్వరగా ఏర్పాటు చేసి పహల్గాం ఉగ్రదాడి అనంతరం చర్యలపై చర్చిద్దామని కోరారు.






















