India Canada: కెనడా పార్లమెంట్‌లో ఖలిస్థానీ ఉగ్రవాది నిజ్జర్‌కు నివాళి - భారత్ స్ట్రాంగ్ కౌంటర్
Canadian Parliament: ఖలిస్థానీ ఉగ్రవాది నిజ్జర్‌కు కెనడా పార్లమెంట్‌లో నివాళి అర్పించడం వివాదంగా మారింది. దీనిపై భారత్ తనదైన శైలిలో స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది.
India Strong Counter To Canada: భారత్ - కెనడా (Canada) మధ్య దౌత్య వివాదం కొనసాగుతోన్న వేళ కెనడా పార్లమెంట్ తీరు వివాదాస్పదమైంది. ఖలిస్థానీ ఉగ్రవాది హర్‌దీప్‌సింగ్ నిజ్జర్ (Hardeepsingh Nijjar) హత్య ఘటన వెనుక భారత ఏజెంట్ల హస్తం ఉందన్న కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో (Justin Trudeau) వ్యాఖ్యలతో ఇరు దేశాల మధ్య దౌత్య సంబంధాలు దెబ్బతిన్న విషయం తెలిసిందే. నిజ్జర్ హత్య జరిగి మంగళవారానికి ఏడాది జరిగిన సందర్భంగా కెనడా పార్లమెంట్‌లో (Canada Parliament) సంతాప కార్యక్రమం నిర్వహించారు. ఆ దేశ పార్లమెంట్‌లో ఏకంగా ఎంపీలంతా లేచి నిలబడి మౌనం పాటిస్తూ ప్రత్యేకంగా నివాళులర్పించారు. దీనికి సంబంధించిన దృశ్యాలు నెట్టింట వైరల్‌గా మారాయి. దీంతో ఆ దేశ సర్కారు తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. 'ఓ దేశం ఉగ్రవాదిగా ప్రకటించిన, ఇంటర్ పోల్ వాంటెడ్ జాబితాలో ఉన్న వ్యక్తి హత్యకు దేశ పార్లమెంట్‌లో నివాళి అర్పించడం ఇదే తొలిసారి' అంటూ కొందరు నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
భారత్ స్ట్రాంగ్ కౌంటర్
ఈ అంశంపై భారత్ తనదైన శైలిలో స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది. ఈ మేరకు వాంకోవర్‌లోని రాయబార కార్యాలయం ట్విట్టర్ వేదికగా స్పందించింది. 'ఉగ్రవాద సమస్యను ఎదుర్కోవడంలో భారత్ ముందుంది. ఈ విషయంలో ఇతర దేశాలతో కలిసి పని చేస్తోంది. జూన్ 23, 2024 నాటికి ఎయిరిండియా కనిష్క విమానాన్ని గాల్లో పేల్చేసి 39 ఏళ్లు. ఉగ్రవాదుల పిరికిపంద చర్యలో 329 మంది ప్రాణాలు కోల్పోయారు. వారి 86 మంది చిన్నారులు ఉన్నారు. పౌర విమానయాన చరిత్రలో ఇది అత్యంత ఘోర దుర్ఘటన. ఆ రోజున వాంకోవర్‌లోని స్టాన్లీ పార్క్ వద్ద సెపెర్లీ ప్లే గ్రౌండ్‌లోని ఎయిరిండియా మెమోరియల్ సంతాపం కార్యక్రమం నిర్వహిస్తాం. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా సంఘీభావాన్ని తెలిపేందుకు ప్రవాస భారతీయులు ఈ కార్యక్రమంలో పాల్గొనాలని కోరుతున్నాం.' అంటూ దౌత్య కార్యాలయం ట్వీట్ చేసింది. కాగా, 1985 నాటి ఎయిరిండియా 'కనిష్క' విమానాన్ని సిక్కు వేర్పాటువాదులు పేల్చేసిన ఘటనలో 329 మంది ప్రాణాలు కోల్పోయారు. కాగా, కెనడా పార్లమెంటులో నిజ్జర్‌కు సంతాప కార్యక్రమం నిర్వహించిన అనంతరం ఈ ప్రకటన వచ్చింది.
India stands at the forefront of countering the menace of terrorism and works closely with all nations to tackle this global threat. (1/3)
— India in Vancouver (@cgivancouver) June 18, 2024
కాగా, ఇటీవల జరిగిన జీ-7 సమ్మిట్‌లో ప్రధాని మోదీ, కెనడా ప్రధాని ట్రుడో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆర్థిక సంబంధాలు, జాతీయ భద్రత విషయాల్లో భారత్‌లో కొత్తగా ఏర్పడిన ప్రభుత్వంతో సంబంధాలు ఏర్పరుచుకునే అవకాశం ఉందని ట్రుడో తెలిపారు.
ఇదీ జరిగింది
2023, జూన్ 18న బ్రిటిష్ కొలంబియాలోని సర్రే ప్రాంతంలో ఓ గురుద్వారా వెలుపల ఖలిస్థానీ ఉగ్రవాది నిజ్జర్ హత్య జరిగింది. అయితే, ఈ ఘటన వెనుక భారత ఏజెంట్ల పాత్ర ఉందంటూ ఆ దేశ ప్రధాని ట్రూడో ఆరోపించారు. ఈ ఘటనకు సంబంధించి నలుగురు భారతీయులను ఆ దేశ ప్రభుత్వం అరెస్ట్ చేసింది. దీంతో ఇరు దేశాల మధ్య విభేదాలు భగ్గుమన్నాయి. ఈ ఆరోపణలను ఖండించిన భారత్.. నిరాధార ఆరోపణలు చేయడం తగదని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. ఈ క్రమంలో ఇరు దేశాల మధ్య దౌత్య సంబంధాలు సైతం దెబ్బతిన్నాయి. తాజాగా, ఆ దేశ పార్లమెంట్‌లోనూ నిజ్జర్‌కు నివాళి అర్పించడంతో మరోసారి వివాదంగా మారింది.
ఖలిస్థానీ టైగర్ ఫోర్స్ అధినేత హర్‌దీప్‌సింగ్ నిజ్జర్.. పంజాబ్ జలంధర్ సమీపంలోని భార్‌సింగ్ పుర గ్రామానికి చెందిన వాడు. 1997లో కెనడాకు ప్లంబర్‌గా వలస వెళ్లి.. నాటి నుంచి ఖలిస్థానీ వేర్పాటువాదులతో బలమైన సంబంధాలు ఏర్పాటు చేసుకున్నాడు. ఖలిస్థానీ టైగర్ ఫోర్స్‌ను భారత్ నిషేధించగా.. 2020లో నిజ్జర్‌ను ఉగ్రవాదిగా ప్రకటించింది. 2007లో లూథియానాలో జరిగిన బాంబు పేలుళ్ల కేసులో నిజ్జర్ మోస్ట్ వాంటెడ్. అలాగే, కెనడా, యూకే, అమెరికాలోని భారత దౌత్య కార్యాలయాలపై దాడి వెనుక నిజ్జర్ హస్తం ఉన్నట్లు అనుమానిస్తున్నారు.