Goa MLA blames idli-sambar for decline in tourist | ఇడ్లీ సాంబార్ వల్ల గోవా టూరిజం పడిపోయిందన బిజెపి ఎమ్మెల్యే | ABP Desham
ఎట్టకేలకు గోవా టూరిజం ఎందుకు పడిపోయిందో తెలిసిపోయింది. ఇడ్లీ సాంబారు, వడా పావ్ వల్ల గోవా టూరిజం పడిపోయిందట. గోవా లోని బిజెపి ఎమ్మెల్యే మైఖేల్ లోబో ఈ స్టేట్మెంట్ ఇచ్చారు. గోవాను సందర్శించడానికి వచ్చేవాళ్ళలో ఇతర దేశాల నుండి వస్తుంటారు. వాళ్లకి బీచ్ రెస్టారెంట్లలో ఇడ్లీ సాంబార్, వడా పావ్ వంటి వంటకాలు మాత్రమే దొరకడం వల్ల తినలేక గోవాకి టూరిస్టులు రావడం తగ్గించేసారని ఎమ్మెల్యే కొత్త భాష్యం చెప్పారు. గోవా లోని రెస్టారెంట్ల యజమానులు తమ హోటళ్ల ను ఫుడ్ కోర్టులను బయట రాష్ట్రాల వాళ్ళకి లీజ్ కు ఇవ్వడంతో ఇలా వేరే వేరే వంటకాలు పెడుతున్నారు. ఆలా కాకుండా గోవా సంప్రదాయ వంటకాలు, కాంటినెంటల్ ఫుడ్ ని అందుబాటులో ఉంచితే టూరిస్ట్లు ఎక్కువగా వస్తారని ఆయన అంటున్నారు. గోవా కు వచ్చేవాళ్ళలో రష్యా ఉక్రెయిన్ ప్రాంతాల పర్యాటకులు ఎక్కువగా ఉంటారని కానీ ఇప్పుడు అక్కడ యుద్ధం జరుగుతూ ఉండడం వల్ల రావడం తగ్గించేసారని కూడా లోబో చెప్పారు. ఈ యుద్ధం సంగతి ఎలా ఉన్నా ఇడ్లీ సాంబార్ వల్లే పర్యాటకులు గోవాకి రావడం తగ్గించేసారంటూ ఎమ్మెల్యే లోబో చేసిన ప్రకటన పై సోషల్ మీడియాలో జోక్స్ పేలుతున్నాయ్. అయితే నిన్న మొన్నటి వరకు గోవాలో టూరిజం ఏ మాత్రం తగ్గలేదని కావాలనే కొందరు ఇన్ఫ్లుయెన్సర్స్ నెగిటివ్ ప్రచారం చేస్తున్నారని గోవా ప్రభుత్వం సర్ది చెప్పుకునే ప్రయత్నం చేసింది. కానీ ఇన్నాళ్ళకి అధికార పార్టీ ఎమ్మెల్యే ఇండైరెక్టుగా గోవా టూరిజం పడిపోయింది అని ఒప్పుకున్నారు అంటూ నెటిజెన్స్ కామెంట్ చేస్తున్నారు.





















