Vegetable Prices: సెప్టెంబర్ నుంచి కూరగాయల ధరలు తగ్గే అవకాశం: ఆర్బీఐ గవర్నర్
Vegetable Prices: కొన్ని రోజులుగా విపరీతంగా పెరుగుతున్న కూరగాయల ధరలు వచ్చే నెల నుంచి తగ్గే అవకాశం ఉందని ఆర్బీఐ గవర్నర్ తెలిపారు.
RBI on Vegetable Prices: కొన్ని రోజులుగా కూరగాయల ధరలు సామాన్యులకు చుక్కల్ని చూపిస్తున్నాయి. మొన్నటి వరకు టమాటా ధరలు ఆకాశంలో విహరించిన విషయం తెలిసిందే. ఏకంగా రూ. 260లకు కిలో ధర పలికాయి. క్రమంగా దిగుబడి పెరగడంతో టమాటా ధర తగ్గుతూ వచ్చింది. ప్రస్తుతం రూ.40 లకు కిలో టమాటా అందుబాటులో ఉంది. టమాటా ధర తగ్గిందని సంబరపడేలోపే మిగతా కూరగాయల ధరలు పెరగడం మొదలైంది. కిలో బీరకాయ రూ.80 వరకు పలికింది. ఆలూ, పచ్చి మిర్చి, వంకాయల ధరలు పెరిగాయి. ఉల్లిపాయల ధరలు చుక్కల్ని చూపించడానికి సిద్ధం అవుతున్నాయి. కూరగాయల ధరల పెరుగుదల ఏ ఒక్క రాష్ట్రానికో పరిమితం కాలేదు. దేశవ్యాప్తంగా ఇదే పరిస్థితి నెలకొంది. విపరీతంగా పెరుగుతున్న ధరలతో సామాన్యులు తీవ్రంగా అవస్థలు పడుతున్నారు. అయితే తాజాగా ఈ కూరగాయల ధరలపై మాట్లాడిన భారతీయ రిజర్వ్ బ్యాంకు గవర్నర్ శక్తికాంత దాస్ ఊరటనిచ్చే విషయం వెల్లడించారు.
భారత్ లో కూరగాయల ధరలు వచ్చే నెల నుంచి తగ్గుతాయని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) గవర్నర్ శక్తికాంత దాస్ బుధవారం ఒక ప్రసంగంలో తెలిపారు. సెప్టెంబర్ నుంచి అన్ని రాష్ట్రాల్లో కూరగాయల ధరలు తగ్గుముఖం పడతాయన్నారు. కూరగాయలు అలాగే తృణధాన్యాల ధరలు పెరగడం వల్ల జులైలో రిటైల్ ద్రవ్యోల్బణం 7.44 శాతం పెరిగింది. ఇది గత 15 నెలల్లో అత్యధికమని అధికారులు చెబుతున్నారు.
'వచ్చే సెప్టెంబర్ నెల నుంచి కూరగాయల ద్రవ్యోల్బణం గణనీయంగా తగ్గుతుందని మేము భావిస్తున్నాం' అని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ శక్తికాంత దాస్ తెలిపారు.
'ఆర్బీఐ రక్షణగా ఉంటుంది'
భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు ఆహార ధరలకు ఆటంకం కలిగించినప్పటికీ, తృణధాన్యాల ధరల్లో మాత్రం ఈ ధోరణి లేదని తెలిపారు. ఎలివేటెడ్ కోర్ ద్రవ్యోల్బణం ఉన్నప్పటికీ, గత కొన్ని నెలలుగా స్థిరంగా సడలించడం ద్రవ్య విధాన ప్రసారానికి సంకేతంగా శక్తికాంత దాస్ పేర్కొన్నారు. ద్రవ్యోల్బణం స్థిరంగా ఉండకుండా, సాధారణీకరించబడకుండా చూసేందుకు సెంట్రల్ బ్యాంక్ రక్షణగా ఉంటుందని ఆర్బీఐ గవర్నర్ తెలిపారు.
ఆహార ధరల షాక్ లు ద్రవ్యోల్బణం అంచనాలను పెంచే ప్రమాదాన్ని కలిగిస్తాయన్నారు. గతేడాది సెప్టెంబర్ నుంచి ఇది కొనసాగుతోందని, దీని పట్ల అప్రమత్తంగా ఉన్నట్లు శక్తికాంత దాస్ చెప్పుకొచ్చారు. పెరుగుతున్న ధరలను అదుపు చేసేందుకు మే 2022 నుంచి భారత దేశం మొత్తం 250 బేసిస్ పాయింట్లు పెంచినట్లు గుర్తు చేశారు. ద్రవ్య విధాన కమిటీ నిర్దేశించిన మధ్యకాలిక 4 శాతం ద్రవ్యోల్బణ లక్ష్యాన్ని సర్దుబాటు చేయడంపై ఆర్బీఐ దృష్టి సారించిందన్నారు.
Also Read: Brics Summit 2023: బ్రిక్స్‌లో 6 దేశాలకు కొత్తగా సభ్యత్వం, కూటమి బలోపేతం అవుతుందన్న మోదీ
'విదేశీ మారక నిల్వలపై పెంచుకుంటూనే ఉంటాం'
స్థిరమైన వృద్ధికి ధరల స్థిరత్వం ఆధారం కావాలని, 2023-24లో వృద్ధి కొనసాగేందుకు, క్యాపెక్స్ సైకిల్ ఊపందుకోవడానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని ఆర్బీఐ గవర్నర్ చెప్పుకొచ్చారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు రూపాయిపై ఎలాంటి నిర్దిష్ట లక్ష్యం లేదని, అయితే డాలర్ ఔట్ ఫ్లోలను నిర్వహించడంలో సహాయపడటానికి విదేశీ మారక నిల్వలను పెంచుకోవడం కొనసాగిస్తామని శక్తికాంత దాస్ పునరుద్ఘాటించారు.