Diwali Wishes: దేశ ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు చెప్పిన ప్రమఖులు- ఆరోగ్యం, సంపన్నమైన జీవితం ఇవ్వాలని ఆకాంక్ష
Diwali News: ఈ దీపావళి ప్రజలకు ఆరోగ్యాన్ని, ఐశ్వర్యాన్ని అందివ్వాలని ప్రార్థించారు ప్రముఖులు. సోషల్ మీడియా వేదికగా పౌరులకు దీపావళి శుభాకాంక్షలు చెప్పారు.
Diwali And Unity Days wishes: దీపావళి, పటేల్ జయంతి సందర్భంగా దేశ ప్రజలకు ప్రముఖులు శుభాకాంక్షలు చెప్పారు. ఈ పండగ ప్రజల జీవితాల్లో మరిన్ని వెలుగులు నింపాలని ప్రార్థించారు.
గుజరాత్‌లోని స్టేట్ ఆఫ్ యూనిటీలో సర్దార్ వల్లభాయ్ పటేల్ 149వ జయంతి సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ గురువారం ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. స్వాతంత్య్ర సమరయోధుడు, భారతదేశ మొదటి హోంమంత్రి జయంతి సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఇందులో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొన్నారు. ఆయన జయంతి రోజునే దీపావళి పండుగ కూడా రావడంతో మరింత ఉత్సాహంగా పండగను జరుపుకుంటున్నారు ప్రజలు.
"భారతదేశపు ఉక్కు మనిషి"గా అభివర్ణించే పటేల్ విగ్రహానికి మోదీ పూలమాలలు వేసి నివాళులర్పించారు. దీంతోనే కార్యక్రమం ప్రారంభమైంది. అనంతరం కెవాడియాలో జరిగిన యూనిటీ డే పరేడ్‌కు హాజరై ఐక్యతా ప్రమాణం చేయించారు మోదీ.
రాష్ట్రీయ ఏక్తా దివస్ లేదా యూనిటీ పరేడ్‌లో కేంద్ర సాయుధ బలగాలు, NCC, రాష్ట్ర పోలీసులు కవాతు నిర్వహించారు. ఈ ఉదయాన్నే దీపావళి, పటేల్ జయంతి సందర్భంగా దేశ ప్రజలకు మోదీ శుభాకాంక్షలు చెప్పారు. అందరికీ ఆరోగ్యం, ఆనందం, శ్రేయస్సు లభించాలని ఆకాంక్షించారు.
"దేశప్రజలకు దీపావళి శుభాకాంక్షలు. ఈ వెలుగుల పండుగ సందర్భంగా, ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా, సంతోషకరమైన సంపన్నమైన జీవితాన్ని గడపాలని కోరుకుంటున్నాను. లక్ష్మి, గణేశుడి ఆశీర్వాదంతో వర్ధిల్లాలని కోరుకుంటున్నాను" అని ఆయన X లో పెట్టిన పోస్ట్‌లో పేర్కొన్నారు.
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కూడా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.
"దీపావళి శుభ సందర్భంగా, మన మనసును ప్రకాశవంతం చేయాలి. ప్రేమ, కరుణలాంటి గుణాలు అలవర్చుకోవాలి. సామాజిక సామరస్యాన్ని పెంపొందించుకోవాలి" అని అన్నారు. అంతే కాకుండా "పేదవారికి సహాయం చేయడానికి ఇలాంటి పండగలు మంచి అవకాశం"గా అభివర్ణించారు.
దీపావళి వెలుగు"ఐక్యత, శ్రేయస్సు, పురోగతి వైపు మనల్ని నడిపించాలని" ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖర్ ఆకాంక్షించారు. "మన జీవితాలను సుసంపన్నం చేస్తూ, ఆశ, జ్ఞానం, కరుణ స్ఫూర్తిని స్వీకరిద్దాం" అని X పోస్ట్‌లో పేర్కొన్నారు.
‘దీపం 2.0’ పథకంతో దీపావళి పండుగ మరింత కాంతివంతం: చంద్రబాబు
తెలుగు ప్రజలకు పండగ శుభాకాంక్షలు తెలియజేసిన ఏపీ సీఎం చంద్రబాబు... ఆంధ్రప్రదేశ్‌లో దీపావళి మరింత ప్రకాశవంతంగా ఉంటుందన్నారు. "తెలుగు ప్రజలందరికి దీపావళి పండుగ శుభాకాంక్షలు. నరకాసుర వధ తర్వాత ఇంటింటా దీపాలు వెలిగించుకుని సంతోషంగా జరుపుకునే వెలుగుల పండుగ ఇది. ఒక దీపాన్ని వెలిగించడం ద్వారా మన చుట్టూ ఉన్న చీకట్లను పారద్రోలినట్లుగా ఎన్నికల ముందు ఇచ్చిన సూపర్ 6 హామీల్లో భాగంగా ‘దీపం 2.0’ పథకంతో ఈ దీపావళి పండుగను మరింత కాంతివంతం చేస్తున్నాము. తెలుగింటి ఆడబిడ్డల కళ్లలో ఆనందం చూసేందుకు ఏడాదికి మూడు వంట గ్యాస్ సిలెండర్లను ఉచితంగా ఇవ్వడమే ఈ పథకం ముఖ్యోద్దేశ్యం. అర్హులైన ఆడబిడ్డలు ఇప్పటికే ‘దీపం 2.0’ పథకానికి దరఖాస్తు చేసుకుంటున్నారు. ఇది సంతోషం కలిగించే విషయం. మీ నుంచి వస్తున్న స్పందనతో మరిన్ని సంక్షేమ పథకాలను అమలు చేసే స్ఫూర్తిని పొందుతున్నాము. ఈ ఆనంద దీపావళి పండుగ రాష్ట్ర ప్రజల జీవితంలో కొత్త వెలుగు నింపాలని ఆకాంక్షిస్తున్నాను." అని ఎక్స్‌పో పోస్టు పెట్టారు.
"చీకట్లను ఛేదిస్తూ “మార్పు”ను ఆశిస్తూ… వెలిగిన దీపం జన జీవితాల్లో సరికొత్త వెలుగులు నింపాలని ఆశిస్తూ… ప్రజలందరికీ దీపావళి శుభాకాంక్షలు." అని ప్రజలకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు.