Congress Party: ఇన్ని ఎదురు దెబ్బలు తింటున్నా కాంగ్రెస్ వ్యూహం మార్చుకోలేకపోతోందా?
Rahul Gandhi: ఒకటి కాదు.. రెండు కాదు.. గత పదేళ్ళ కాలంలో కాంగ్రెస్ పార్టీ అనేక ఎదురు దెబ్బలు తింటోంది. చేతికి అందిన అధికారాన్ని గోవా వంటి రాష్ట్రాల్లో పోగొట్టుకుంది.
Congress Party: సుదీర్ఘ రాజకీయ చరిత్ర (Politial History) సొంతం చేసుకున్న గ్రాండ్ ఓల్డ్ (Grand old party) పార్టీగా కాంగ్రెస్ (Congress)కు పేరుంది. దాదాపు 134 ఏళ్ల చరిత్రను సొంతం చేసుకుంది. కానీ, గడిచిన పదేళ్ళలో ఈ పార్టీ అనేక ఎదురు దెబ్బలు తింటోంది. అయినప్పటికీ.. నేర్చుకున్న పాఠాలు.. సరిదిద్దుకున్న పరిస్థితి ఎక్కడా కనిపించడం లేదు. ఏ ఎన్నికలు(Elections) వచ్చినా.. నాయకులను కాపాడుకునే పరిస్థితి తలెత్తింది. అయినా.. చేజారుతున్న నాయకులు కాంగ్రెస్ పార్టీకి షాకులు ఇస్తూనే ఉన్నారు. 2004 నుంచి 2014 వరకు కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారంలో ఉంది. ఆ తర్వాత నుంచి ఇప్పటి వరకు ప్రతిపక్షంలో ఉంది. అయితే.. ఈ మధ్య కాలంలో వచ్చిన ఎన్నికల్లో చావు తప్పిన చందంగానే కాంగ్రెస్ పార్టీ పరిస్థితి మారిపోయింది. నాయకత్వ లోపం(Leader ship).. అంతర్గత ప్రజాస్వామ్యం(Internal democracy).. వంటివి పార్టీని మరింత ఇబ్బందిగా మార్చుతున్నాయి. కేంద్రంలో అధికారంలోకి వచ్చేందుకు చేయని ప్రయత్నం లేదు. అయితే.. పార్టీని సమన్వయ పరచడంలోనూ.. అగ్రనాయకత్వం విఫలమవుతూనే ఉంది. యూపీఏ కూటమి నుంచి ఇండియా కూటమి వరకు.. కాంగ్రెస్ ప్రయత్నాలు చేసింది. అయితే.. ప్రధాని పీఠం విషయానికి వచ్చే సరికి పొత్తు పార్టీల మధ్య నెలకొన్న అసంతృప్తులు.. కూటమలు కట్టడంలోనూ.. కట్టించడంలోనూ.. కాంగ్రెస్‌కు ఎదురు దెబ్బలు తగులుతూనే ఉన్నాయి.
గత ఏడాది నుంచి..
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ(PM Narendra Modi) నేతృత్వంలోని బీజేపీ(BJP) పాలనపై నిప్పులు చెరుగుతున్న కాంగ్రెస్ పార్టీ.. ఆయనను తక్షణం గద్దె దింపేయాలన్న ఉద్దేశం ఉంది. కానీ, ఈ విషయంలో పార్టీ చేస్తున్న ప్రయత్నాలు.. కప్పల తక్కెడను తలపిస్తున్నాయి. అయినప్పటికీ.. ప్రయత్నాలు ఆగకపోయినా.. ఫలితం మాత్రం కనిపించడం లేదు. రాష్ట్రాల్లో(States) ఒక విధంగా.. కేంద్రంలో మరోవిధంగా వ్యవహరిస్తున్నదనే అపవాదును కాంగ్రెస్ పార్టీ సొంతం చేసుకుంది. వాస్తవానికి గత ఏడాది ప్రారంభంలోనే ఇండియా కూటమి పేరుతో 28 ప్రాంతీయ పార్టీలను ఏకతాటిపైకి తీసుకువచ్చారు. దీనికి కన్వీనర్‌గా ఎవరు ఉండాలనే విషయంపై సాగదీత ధోరణి కొనసాగింది. ఇంతలో కర్ణాటక ఎన్నికలు వచ్చాయి. ఇక్కడ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. ఇక, ఆ తర్వాత.. తనదే పైచేయి అన్నట్టుగా కాంగ్రెస్ పార్టీ వ్యవహరించింది. ఈ క్రమంలోనే ఇండియా కూటమి కన్వీనర్ పోస్టును తానే తీసుకుంది. ఇది పార్టీల మధ్య చిచ్చుకుకారణమైంది. అప్పటికే నాలుగు విడతలుగా సాగిన ఇండియా కూటమి పార్టీల సమావేశాలు.. ఆ తర్వాత.. ఎవరికి వారే అన్నట్టుగా ఉండిపోవడంతో ముందుకు సాగలేని పరిస్థితి ఏర్పడింది. ఇక, గత ఏడాది ఐదు రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు జరిగితే..(ఛత్తీస్‌గఢ్, రాజస్తాన్, మధ్యప్రదేశ్, తెలంగాణ, మిజోరాం) అప్పటి వరకు అధికారంలో ఉన్న రెండు రాష్ట్రాలను(రాజస్తాన్, ఛత్తీస్‌గఢ్) కూడా పార్టీ చేజార్చుకుంది. కేవలం తెలంగాణలో మాత్రమే బొటా బొటి మార్కులతో అధికారంలోకి వచ్చింది.
జోడో యాత్ర ఫలితం ఏంటి?!
కాంగ్రెస్ అగ్రనాయకుడు రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర మిశ్రమ ఫలితాన్ని మాత్రమే కాంగ్రెస్‌కు కట్టబెడుతోంది. దీనికి కూడా పార్టీ మిత్రపక్షాలు సహకరించని పరిస్థితి ఈ ఏడాది పశ్చిమ బెంగాల్‌లో చవి చూశారు. ఇక, అస్సాంలో అయితే.. బీజేపీ ప్రభుత్వం కేసులు కూడా నమోదు చేసింది. మరోవైపు.. భారత్ జోడో యాత్ర ద్వారా.. రాహుల్ ఇమేజ్ కూడా పెద్దగా బలపడ లేదనే టాక్ వినిపిస్తోంది. కేంద్రంలో అధికారంలోకి వచ్చేంత స్థాయిలో ఇది లేదనే వాదన కూడా జాతీయ రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. ప్రధాని మోడీ వంటిబలమైన ఇమేజ్‌ను సొంతం చేసుకోవడంలో రాహుల్ వెనుక బడ్డారు. పైగా.. ఆయన చేస్తున్న వ్యాఖ్యలు.. కోర్టుల వరకు వెళ్లడం.. కేసులు, జరిమానాలు, శిక్షలు వంటివి కూడా కాంగ్రెస్‌కు ఇబ్బందిగానే మారాయి.
తాజాగా జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో..
తాజాగా జరిగిన రాజ్యసభ ఎన్నికల్లోనూ కాంగ్రెస్‌కు బలమైన దెబ్బతగిలింది. కాంగ్రెస్ నేతలు చేసిన కాంగ్రెస్ ఓటింగ్ ఫలితంగా.. బీజేపీ బలపడడం కాంగ్రెస్‌కు భారీ ఎదురు దెబ్బనే మిగిల్చింది. యూపీలో నలుగురు ఎమ్మెల్యేలు క్రాస్ ఓట్ చేయడంతో అక్కడ బీజేపీ ఒక సీటును అదనంగా సొంతం చేసుకుంది. ఇక, హిమాచల్ ప్రదేశ్‌లోనూ ఇదేవిధంగా పరిస్థితి మారింది. ఇక్కడ రాజ్యసభ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ వేసిన ఆరుగురు సభ్యులపై పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం ప్రకారం స్పీకర్ అనర్హత వేటు వేశారు. అంతేకాదు.. ఇక్కడఅసలు ప్రభుత్వం మనుగడ కూడా ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారిపోయింది. రాజ్యసభ ఎన్నికల అనంతరం .. ఎమ్మెల్యేలతో హిమాచల్ ప్రదేశ్(Himachal Pradesh) ముఖ్యమంత్రి సుఖ్విందర్ సుఖు విందు భేటీ నిర్వహించారు. ఆ సమావేశానికి 32 మంది సభ్యులు మాత్రమే హాజరయ్యారు. మరో 8 మంది సభ్యులు సీఎంతో సమావేశానికి రాలేదు. ఆ వెంటనే కాంగ్రెస్ ప్రభుత్వం అప్రమత్తమైంది. ఆరుగురు సభ్యులపై చర్యలు తీసుకుంది. ఆరుగురు సభ్యులపై స్పీకర్ అనర్హత వేటు వేశారు. దీంతో సభలో తగినంత మెజార్టీని కోల్పోయే ప్రమాదం ఏర్పడింది.
2024 ఎన్నికల పరిస్థితి ఏంటి?
క్షేత్రస్తాయిలో పరిస్థితిని గమనిస్తే.. బీజేపీ ఒంటరిగానే వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో 370 స్థానాల్లో విజయం దక్కించుకుని తీరుతామని ప్రకటిస్తోంది. ప్రధాని మోడీ దీనిని ఏ వేదిక ఎక్కినా చెబుతున్నారు. ఈ తరహా పరిస్థితి కాంగ్రెస్‌కు లేకుండా పోయింది. ఉత్తరాది రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలను టికెట్లు అడిగే పరిస్థితి.. వారు ఇచ్చినంత సర్దుకునే పరిస్థితి వచ్చింది. ముందు కాదని.. తర్వాత.. ఔననే పార్టీలు కూడా ఉండడం కాంగ్రెస్ పార్టీ దుస్థితికి అద్దం పడుతున్నాయి. ఇక, రాహుల్ గాంధీ ఇప్పటికే తన సొంత నియోజకవర్గం అమేధీని వదిలేసి. .. కేరళలోని వయనాడ్ నుంచి గత ఎన్నికల్లో విజయం దక్కించుకున్నారు. అయితే.. ఇప్పుడు ఇక్కడ కూడా .. కమ్యూనిస్టులు ఎదురు తిరుగుతున్నారు. వచ్చే ఎన్నికల్లో తామే పోటీ చేస్తామని రాహుల్ వేరే నియోజకవర్గం చూసుకోవాలని అల్టిమేటం ఇచ్చారు. దీంతో ఆయన తెలంగాణవైపు చూస్తున్నారు. ఏతావాతా ఎలా చూసుకున్నా.. గత అనుభవాలనుంచి పార్టీ నేర్చుకున్న పాఠాలు ఏమీ కనిపించకపోవడం గమనార్హం.