Age-Wise Health Checkups : ఏ వయసువారు ఏ హెల్త్ చెకప్స్ చేయించుకుంటే మంచిదో తెలుసా? నిపుణుల సూచనలు ఇవే
Health Checkups : హెల్త్ చెకప్ రెగ్యులర్‌గా చేయించుకుంటే మంచిదని చెప్తారు. ఇంతకీ ఏ వయసు వారు ఏ విషయంపై ఫోకస్ చేస్తూ హెల్త్ చెకప్ చేయించుకుంటే మంచిదో ఇప్పుడు చూసేద్దాం.

Health Checkups by Age : ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే.. హెల్తీగా ఉండడంతో పాటు రెగ్యులర్‌గా హెల్త్ చెకప్స్ చేయించుకోవాలి. దీనివల్ల ఆరోగ్య సమస్యలు వచ్చినా ప్రారంభంలోనే గుర్తించి.. దానికి తగిన చికిత్స తీసుకోవచ్చు. పరిస్థితి చేజారిపోకుండా ఉంటుంది. అంతేకాకుండా సమస్యలు రాకుండా జాగ్రత్త కూడా తీసుకోవచ్చు. అందుకే హెల్త్ చెకప్స్ అందరూ చేయించుకోవాలని చెప్తారు ఆరోగ్య నిపుణులు.
హెల్త్ చెకప్స్ చేయించుకోమంటారు కానీ.. ఏ వయసు వారు ఏ విషయంపై ఫోకస్ చేస్తూ ఈ చెకప్స్ చేయించుకోవాలో చెప్పరు. కొందరికి వీటిపై సరైన అవగాహన కూడా ఉండదు. అలాంటివారు ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి.. వయసు వారీగా.. పిల్లలు నుంచి పెద్దలు హెల్త్ చెకప్స్ చేయించుకోవాలి. అయితే ఏ వయసు వారు ఏ విషయంపై ఫోకస్ చేస్తూ.. చెకప్స్ చేయించుకుంటే మంచిదో ఇప్పుడు చూసేద్దాం.
0-12 వయసువారు..
అప్పుడే పుట్టిన పిల్లల నుంచి 12 సంవత్సరాల పిల్లలకు హెల్త్ చెకప్స్ చేయించాలంటే.. ఎత్తు, బరువుపై ఫోకస్ చేయాలి. పిల్లల గ్రోత్ తెలుసుకోవడానికి ఇది హెల్ప్ చేస్తుంది. అలాగే న్యూట్రిషన్, కంటి ఆరోగ్యం, పంటి ఆరోగ్యంపై దృష్టి వహిస్తూ వాటికి సంబంధించిన హెల్త్ చెకప్స్ చేయించాలి.
12-18 వయసువారు..
ఈ మధ్యకాలంలో టీనేజ్ పిల్లలకు కూడా ఆరోగ్య సమస్యలు ఎక్కువగా వస్తున్నాయి. ముఖ్యంగా ఒత్తిడి వల్ల వచ్చే సమస్యలపై ఫోకస్ చేయాలి. కాబట్టి వారికి డయాబెటిస్, బీపీ, కొలెస్ట్రాల్, థైరాయిడ్ వంటి ఆరోగ్య సమస్యల గురించి తెలుసుకునేందుకు హెల్త్ చెకప్స్ చేయించాలి. అలాగే మానసిక ఆరోగ్యంపై కూడా కచ్చితంగా ఫోకస్ చేయాలి.
20-29 వయసువారు..
డయాబెటిస్, బీపీ, కొలెస్ట్రాల్, ఈసీజీని చెకప్స్ చేయించుకుంటే మంచిది. ముఖ్యంగా గుండె సమస్యలపై అవగాహన కలిగి ఉంటూ హెల్త్ చెకప్స్ చేయించుకుంటే మంచిది. లైంగిక ఆరోగ్యానికి సంబంధించిన చెకప్స్ కూడా చేయించుకోవాలి.
30-39 వయసువారు
డయాబెటిస్, బీపీ, కొలెస్ట్రాల్, గుండె, లైంగిక సమస్యలపై ఫోకస్ చేయడంతో పాటు.. స్కిన్ హెల్త్‌పై, కంటి చూపుపై, సంతానోత్పత్తికి సంబంధించిన విషయాల గురించి తెలుసుకోవాలి. ఆడవారు అయితే పైన చెప్పిన అంశాలతోపాటు బ్రెస్ట్ ఎగ్జామిన్ కూడా చేయించుకుంటే మంచిది.
40-49 వయసువారు..
బీపీ, షుగర్, కొలెస్ట్రాల్ చెకప్స్‌తో పాటు.. లివర్, కిడ్నీ టెస్ట్‌లు చేయించుకుంటే మంచిది. థైరాయిడ్ చెక్ చేయించుకోవాలి. ఈసీజీతో పాటు కంటికి సంబంధించిన పరీక్షలు చేయించుకుంటే మంచిది. ఆడవారు కచ్చితంగా బోన్ డెన్సిటీ టెస్ట్ చేయించుకోవాలి. మగవారు ప్రొస్టెట్ హెల్త్‌పై అవగాహన తెచ్చుకోవాలి.
50- 64 వయసువారు..
పెద్దపేగు, మమ్మోగ్రామ్స్, బోన్ డెన్సిటీ, హార్ట్ స్క్రీనింగ్, హియరింగ్, కంటి సమస్యలపై ఫోకస్ చేయిస్తూ హెల్త్ చెకప్స్ చేయించుకుంటే మంచిది.
65 దాటినవారు..
రెగ్యులర్ టెస్ట్‌లతో పాటు అల్జీమర్స్ గురించి కూడా చెకప్ చేయించుకుంటే మంచిది.
ఈ హెల్త్ చెకప్స్ని ఆర్నెళ్ల నుంచి 2 సంవత్సరాలకోసారైనా చేయించుకోవాలి. లేదా మీ ఆరోగ్య సమస్యల్ని బట్టి, వయసును బట్టి.. వైద్యుల సూచనల మేరకు చెకప్స్ చేయించుకోవాలి. కుటుంబంలో ఆరోగ్య సమస్యలు, లైఫ్‌స్టైల్ బట్టి కూడా ఎన్ని రోజులకు హెల్త్ చెకప్స్ చేయించుకుంటే మంచిదో వైద్య నిపుణులు సూచిస్తారు. ఈ చెకప్స్ వల్ల డబ్బు ఖర్చు అవుతుందని చాలామంది నెగ్లెక్ట్ చేస్తారు. కానీ తర్వాత వచ్చే ఆరోగ్య సమస్యలకు రెట్టింపు ఖర్చు చేస్తారు. కాబట్టి రెగ్యులర్ హెల్త్ చెకప్స్ చేయించుకోవాలా? వద్దా అంటే.. చేయించుకుంటేనే మంచిదని చెప్తున్నారు నిపుణులు.
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.






















