MS Dhoni Animated Discussion: మిస్టర్ కూల్ కు కోపమొచ్చింది.. అంపైర్ తో సీరియస్ గా చర్చించిన ధోనీ.. ముంబై చేతిలో ఓటమితో నిరాశ
గతేడాది ప్లే ఆఫ్స్ కు చేరడంలో విఫలమైన చెన్నై..ఈ సీజన్ లోనూ అలాంటి ఆటతీరే ప్రదర్శిస్తోంది. ఈ సీజన్ లో టోర్నీలో 8 మ్యాచ్ లు ఆడిన చెన్నై.. ఆరింటిలో ఓడింది, పట్టికలో పదో స్థానానికి పడిపోయింది.

IPL 2025 CSK VS MI Updates: మిస్టర్ కూల్ , చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ ఎంఎస్ ధోనీ(MS Dhoni) కి కోపమొచ్చింది. ఎప్పుడూ స్థితప్రజ్ఞతతో ఉండే ధోనీ.. ఆదివారం చిరకాల ప్రత్యర్థి ముంబై ఇండియన్స్ తో జరిగిన మ్యాచ్ లో మాత్రం కాస్త అసహనంగా కనిపించాడు. టోర్నీలో ఆరో ఓటమితో ప్లే ఆఫ్ అవకాశాలను క్లిష్టం చేసుకున్న చెన్నై.. చెత్త ఆటతీరుతో అభిమానులతోపాటు సగటు క్రికెట్ ప్రేమికుల నుంచి కూడా విమర్శలు ఎదుర్కొంటోంది. ఇప్పటికీ ఎనిమిది మ్యాచ్ లు పూర్తి చేసుకున్నప్పటికీ, సరైన ప్లేయింగ్ లెవన్ ను ఎంచుకోలేకపోవడమే CSK ఓటములకు కారణంగా తెలుస్తోంది.
ఇక ముంబైతో మ్యాచ్ ముగిశాక, ఇరు జట్ల ఆటగాళ్లు పరస్పరం షేక్ హ్యాండ్స్ ఇచ్చుకునేటప్పుడు అంపైర్ల వద్దకు వచ్చిన ధోనీ, ఒక అంపైర్ తో సీరియస్ గా చర్చించడం కనిపించింది. అయితే ఏం మాట్లాడాడో తెలియక పోయినప్పటికీ, తనలోని అసంతృప్తిని మాత్రం అంపైర్ తో పంచుకున్నట్లు పలువురు భావిస్తున్నారు. తాజాగా ఈ వీడియో వైరలైంది. క్రికెట్ లవర్స్ ఈ వీడియోను వైరల్ చేస్తూ, తమకు తోచిన కామెంట్లు చేస్తూ, లైకులు, షేర్లు చేస్తున్నారు.
Dhoni umpire argument pic.twitter.com/FsXJd9599Z
— Pappu Plumber (@tappumessi) April 20, 2025
వచ్చే ఏడాదికే..
ఇక మ్యాచ్ ముగిశాక ధోనీ మాట్లాడుతూ.. ఈ సీజన్ లో సరైన కూర్పు లేకపోవడంతోనే తమ జట్టు అంచనాలకు అనుగుణంగా రాణించలేక పోతోందని వ్యాఖ్యానించాడు. ముఖ్యంగా సరైన్ ప్లేయింగ్ లెవన్ లేకపోవడం, జట్టులో ఆటగాళ్లను చాలా సార్లు మార్చడంతోనే ఓటములకు కారణమని తేల్చాడు. మిగతా ఆరు మ్యాచ్ ల్లో అన్నింటిని గెలిస్తేనే చెన్నై సూపర్ కింగ్స్ నాకౌట్ కు చేరుతుంది. ఒక్క మ్యాచ్ ఓడినా, చెన్నై ఇంటిముఖం పడుతుంది. గతేడాది కూడా చెన్నై ప్లే ఆఫ్స్ చేరని సంగతి తెలిసిందే.
వచ్చే ఏడాది కోసం..
ఒకవేళ ఈ సీజన్ లోనూ ప్లే ఆఫ్స్ కు చేరలేకపోతే, వచ్చే ఏడాది కోసం జట్టును సిద్దం చేస్తామని ధోనీ పేర్కొన్నాడు. ఈసారి పటిష్టమైన ప్లేయింగ్ లెవన్ తో బరిలోకి దిగుతామని పేర్కొన్నాడు. ఇక ముంబైతో మ్యాచ్ లో భారీగా పరగులు సాధించకపోవడంతోనే ఓటమి పాలయ్యామని చెప్పుకొచ్చాడు. డెత్ ఓవర్లలో వీలైనన్ని పరుగులు సాధించలేదని, ఈ పిచ్ పై తాము సాధించిన స్కోరు సరిపోలేదని వాపోయాడు. ముఖ్యంగా రెండో ఇన్నింగ్స్ లో డ్యూ వస్తుందని తెలిసి, బౌలర్లుకు కావల్సినంత స్కోరును సాధించలేక పోయామని వ్యాఖ్యానించాడు. వాంఖెడే స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్ లో టాస్ ఓడి ఫస్ట్ బ్యాటింగ్ చేసిన సీఎస్కే నిర్ణీత20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 176 పరుగులు చేసింది. ఛేజింగ్ ను ముంబై ఇండియన్స్ కేవలం 15.4 ఓవర్లలోనే వికెట్ కోల్పోయి 177 పరుగులు చేసి పూర్తి చేసింది. ఈ ఫలితంతో పాయింట్ల పట్టికలో ఆరో స్థానానికి ముంబై ఎగబాకగా, చెన్నై మాత్రం పదో స్థానానికి పరిమితమైంది. తర్వాతి మ్యాచ్ ను సన్ రైజర్స్ హైదరాబాద్ తో హైదరాబాద్ వేదిక గా ముంబై ఆడుతుంది.




















