AP Liquor Scam : లిక్కర్ స్కాంలో కీలక పరిణామం - మంగళవారం విచారణకు రాజ్ కసిరెడ్డి !
Raj Kasireddy: మంగళవారం విచారణకు హాజరవ్వాలని రాజ్ కసిరెడ్డి నిర్ణయించుకున్నారు. కోర్టులో ఆయన దాఖలు చేసుకున్న పిటిషన్ విచారణ వాయిదా పడటంతో ఈ నిర్ణయం తీసుకున్నారు.

Raj Kasireddy Ready: ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కాం వ్యవహారంలో పరారీలో ఉన్నట్లుగా భావిస్తున్న రాజ్ కసిరెడ్డి విచారణకు హాజరు కావాలని నిర్ణయించారు. ఇప్పటి వరకూ ఆయనకు నాలుగు సార్లు నోటీసులు ఇచ్చారు. కానీ హాజరు కాలేదు. దీంతో ఆయన కోసం పలు బృందాలు గాలిస్తున్నాయి. ఆయన పెట్టుబడులు పెట్టిన పలు కంపెనీల్లో సోదాలు నిర్వహించారు. ఆయన ఆజ్ఞాతంలోకి పోవడంతో అరెస్టు ఖాయమన్న ప్రచారం జరుగుతోంది. విజయసాయిరెడ్డి సీఐడీకి ఇచ్చిన వాంగ్మూలంలో రాజ్ కసిరెడ్డినే కర్త, కర్మ, క్రియ అని వాంగ్మూలం ఇచ్చారు.
రెండు రోజుల కిందట ఆడియో రిలీజ్ చేసిన రాజ్ కసిరెడ్డి
అరెస్టు నుంచి న్యాయపరమైన రక్షణ కోసమే ఇంత కాలం సీఐడీ ఎదుట హాజరు కాలేదని రాజ్ కసిరెడ్డి రెండు రోజుల కిందట ఓ ఆడియో విడుదల చేశారు. కొన్ని రోజుల నుంచి మీడియాలో తన గురించి తప్పుగా ప్రచారం జరుగుతోందన్నారు. మార్చి ఆఖరి వారంలో నేను లేని సమయంలో సిట్ అధికారులు మా ఇంటికి వచ్చి మా మదర్‌కు నోటీసులు ఇచ్చారు. నన్ను విట్‌నెస్‌గా నోటీసు ఇచ్చి విచారణకు రావాలని చెప్పారు. 24 గంటల్లోనే స్పందించి. సర్ నోటీసులు ఇచ్చారు. నేను సహకరించడానికి సిద్ధమే. వస్తాను. కానీ నన్ను ఎందుకు పిలుస్తున్నారో అనే విషయం సమాచారం ఇవ్వండని అడిగాను. స్పెసిఫిక్ డాక్యుమెంటేషన్ ఏమైనా తెమ్మంటారా అని కూడా అడిగాను. ఎవరైనా నా గురించి చెప్పిన సమాచారం ఏమైనా ఉందా అని కూడా ఆరా తీసానని తెలిపారు.
సీఐడీ అధికారులు తాను అడిగిన సమాచారం ఇస్తే ప్రిపేర్ అయ్యి వస్తానని చెప్పాననని.. తాను ఆ మెయిల్ పెట్టిన తర్వాత రెండోసారి నోటీసు ఇచ్చారు. తర్వాత రోజు విచారణకు రావాలని చెప్పారు. అప్పుడు నేను మా లాయర్లతో మాట్లాడాను. పరిణామాలు చూసిన లాయర్లు ఏమన్నారంటే... సాక్షిగా నోటీసులు ఇచ్చి అరెస్టు చేయాలని చూస్తున్నారు. ఏమైనా సరే కోర్టులో ప్రొటెక్షన్ తీసుకొన్న తర్వాతనే నోటీసులకు అడ్రెస్ చేయడం బెటర్ అని చెప్పారు. దీనిపై హైకోర్టులో ఛాలెంజ్ చేసాం. హైకోర్టు రీజనబుల్ టైం ఇచ్చి పిలవాలని చెప్పింది. దానిపై కూడా సుప్రీంకోర్టుకు వెళ్లాం. అది నడుస్తోంది. ముందస్తు బెయిల్ కోసం కూడా పెట్టున్నాం. అన్నింటి కంటే ముఖ్యంగా నేను విచారణకు సహకరించేందుకు సిద్ధంగా ఉన్నాను. న్యాయపోరాటం పూర్తి అయిన తర్వాత కచ్చితంగా నేను విచారణకు వస్తాను అని తెలిపారు.
అయితే రాజ్ కసిరెడ్డి వేసిన పిటిషన్ హైకోర్టులో విచారణకు వచ్చింది కానీ వారం రోజులకు వాయిదా పడింది. దీంతో విచారణకు హాజరు కావాలని నిర్ణయించుకున్నారు.
విడుదల చేసిన ఆడియోలోనే విజయసాయిరెడ్డిని బట్టేబాజ్ గా రాజ్ కసిరెడ్డి అభివర్ణించారు. ఆయన గురించి ప్రస్తుతానికి ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు. న్యాయపోరాటానికి సంబంధించిన ప్రక్రియ పూర్తి అయిన తర్వాత ఒకసారి వచ్చి విచారణ ఎదుర్కొన్న తర్వాత మీడియా ముందు ఈ మనిషి గురించి చెబుతాను. ఆయన చరిత్ర అంతా తీసి బయటపెడతాను అని ప్రకటించారు.





















