KTR News: ఈ ఏడాదిలోనే తెలంగాణలో ఉప ఎన్నికలు: కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
Telangana News | కాంగ్రెస్ పాలనతో రాష్ట్రం ఆగమైపోయిందని, ఈ ఏడాదే తెలంగాణలో ఉప ఎన్నికలు వస్తాయని, క్యాడర్ సిద్ధంగా ఉండాలని బీఆర్ఎస్ నేత కేటీఆర్ పార్టీ శ్రేణులకు సూచించారు.

By Elections In Telangana | హైదరాబాద్: తెలంగాణలో ఈ ఏడాదిలోనే ఉప ఎన్నికలు వస్తాయని టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఉప ఎన్నికలకు టిఆర్ఎస్ నేతలు, క్యాడర్ సిద్ధంగా ఉండాలని కేటీఆర్ సూచించారు. అత్తాపూర్ డివిజన్ కు చెందిన కాంగ్రెస్ నేత వనం శ్రీరామ్ రెడ్డి కేటీఆర్ సమక్షంలో ఆదివారం నాడు టిఆర్ఎస్ పార్టీలో చేరారు.
ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. సీఎం రేవంత్ రెడ్డి మాటలన్నీ బోగస్. ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆర్ గ్యారంటీల్లో ఒక్కటి కూడా ఇప్పటివరకు పూర్తి చేయలేదు. కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇవ్వడం ఎలా ఉందంటే తినే కంచంలో మనమే మన్ను పోసుకున్నట్లు అయ్యింది. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అన్నారు. కానీ బస్సుల్లో అక్క చెల్లెలు కొట్టుకునే పరిస్థితి కనిపిస్తోంది. టిఆర్ఎస్ హయాంలో అభివృద్ధి చెందిన హైదరాబాద్ నగరం నేడు వెలవెలబోతోంది. కెసిఆర్ పాలనలో రియల్ ఎస్టేట్ కొత్త గుంతలు తొక్కగా.. నేడు కాంగ్రెస్ పాలనలో అతి తక్కువ కాలంలో రియల్ భూమ్ పడిపోయింది. పెరగాల్సిన భూముల ధరలు, నేల చూపులు చూస్తున్నాయి. అభివృద్ధి లేకపోవడమే అందుకు కారణం.
తెలంగాణ ఎన్నికల్లో టిఆర్ఎస్ ఓటమితో పార్టీ నేతల కంటే ప్రజలకు ఎక్కువ నష్టం జరిగింది. ఎఫ్ టి ఎల్, బఫర్ జోన్ పరిధిలో నిర్మాణాలు అంటూ సామాన్యుల ఇండ్లు సైతం కూల్చివేసి ఇబ్బందులకు గురిచేశారు. రెండు జాతీయ పార్టీలు కాంగ్రెస్, బీజేపీలు తెలంగాణకు శత్రువులే. కేసీఆర్ మరోసారి సీఎం కావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అన్యాయాలు, వారి పాలనా వైఫల్యాన్ని ప్రజలు గమనిస్తున్నారు’ అని కేటీఆర్ పేర్కొన్నారు.
సీఎం రేవంత్ రెడ్డిపై కవిత సంచలన వ్యాఖ్యలు
ఖమ్మం జిల్లా పర్యటనలో బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కీలక వ్యాఖ్యలు చేశారు. సోనియాగాంధీ, రాహుల్ గాంధీలపై ఈడీ కేసు నమోదు చేస్తే దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ఆందోళనలకు పిలుపునిచ్చింది. కానీ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాత్రం కనీసం స్పందించలేదు. ఖమ్మం జిల్లాలో ఉప ముఖ్యమంత్రి తో పాటు ఇద్దరు మంత్రులు ఉన్నప్పటికీ, వడగండ్ల వాన వల్ల జరిగిన పంట నష్టంపై సమీక్షించలేదు. రాష్ట్రవ్యాప్తంగా వరి ధాన్యం తడిసిపోయి, మామిడి పూత రాలిపోయి రైతులు కష్టాల్లో ఉంటే కనీసం సమీక్షించే తీరిక ప్రభుత్వానికి లేదు. రైతులను పలకరించిన పాపాన పోలేదు.. ఇంతటి దౌర్భాగ్యమైన స్థితి తెలంంగాణలో ఎప్పుడూ లేదు.
ఎకరానికి రూ.20 వేల నష్టపరిహారం డిమాండ్
జపాన్ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వర్షాలపై కనీసం రెవెన్యూ అధికారులతో కూడా మాట్లాడలేదు. రాష్ట్రంలో పరిపాలన పూర్తిగా పడకేసింది. వర్షాల వల్ల పంట నష్టపోయిన ప్రతి ఎకరానికి రూ 20 వేలు నష్టపరిహారం చెల్లించాలి. మంత్రులు ఆధిపత్యం చెలాయించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ ప్రజల సమస్యల గురించి పట్టించుకోవడం లేదు. కమ్యూనిస్టు పార్టీ నేతలు కూడా ప్రభుత్వాన్ని నిలదీయకపోవడం దారుణం. రైతు భరోసా సగం మందికి రానేలేదు. రైతు రుణమాఫీ సంపూర్ణంగా చేశామని ప్రభుత్వం అబద్ధాలు చెబుతున్నది. 60 శాతం మందికి రుణమాఫీ కాలేదు. రైతు కూలీలకు ఇస్తామన్న ఆత్మీయ భరోసా డబ్బులు ఇవ్వనేలేదు. పథకాలు కేవలం ప్రచారానికే పరిమితమయ్యాయి.
తెలంగాణ రాష్ట్రం తిరోగమన దిశలో పయనిస్తోంది. ఎక్కడికక్కడ ప్రభుత్వ పెద్దలను, కాంగ్రెస్ నాయకులను నిలదీయండి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన వెంటనే భక్త రామదాసు ప్రాజెక్టును కేసీఆర్ నిర్మించి 60 వేల ఎకరాలకు నీళ్లు అందించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 15 నెలలు గడిచినా ఒక కొత్త ప్రాజెక్టు చేపట్టలేదు. బీఆర్ఎస్ రజతోత్సవ సభకు పెద్ద ఎత్తున ప్రజలు తరలి రావాలని’ ఎమ్మెల్సీ కవిత పిలుపునిచ్చారు.






















