(Source: Poll of Polls)
Kurnool Bus Fire Accident: కర్నూలు బస్ ప్రమాదంలో విస్తుపోయే వాస్తవాలు! అసలు కారణం చెప్పిన శివశంకర్ ఫ్రెండ్!
Kurnool Bus Fire Accident: కర్నూలులో జరిగిన ప్రమాదానికి అసలు కారణాన్ని పోలీసులు గుర్తించారు. బైకర్స్ తాగి వాహనం నడపటం వల్లే ఘోరం జరిగిందని ఇప్పటికి స్పష్టమైంది.

Kurnool Bus Fire Accident: కర్నూలులో జరిగిన బస్ ప్రమాదంలో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. అసలు ప్రమాదానికి తాగి బైక్ నడిపిన శివశంకర్ కారణమని తేలింది. రాత్రి వెలుగులోకి వచ్చిన సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా కేసును దర్యాప్తు చేసిన పోలీసులకు ఈ విషయం తెలిసింది. అందరూ అనుకున్నట్టు వీ కావేరి బస్ ఢీ కొట్టి బైకర్ చనిపోలేదని స్పష్టమైంది.
బస్ రాక ముందే బైక్ ప్రమాదం
హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న వి కావేరి బస్ కర్నూలులో ఘోర ప్రమాదానికి గురైంది. రోడ్డుపై వెళ్తున్న పల్సర్ బైక్‌ను ఢీ కొట్టడం వల్ల దారుణం జరిగిందని అంతా అనుకున్నారు. ప్రమాదం జరిగిన ప్రాంతానికి సమీపంలో ఉన్న పెట్రోల్ బంక్‌లో బైక్ నడిపిన శంకర్ ఆఖరి వీడియో వెలుగులోకి వచ్చింది. మద్యం మత్తులో ఉన్న శివశంకర్ వెంటే ఓ ఫ్రెండ్ ఉన్నట్టు ఆ వీడియోలో ఉంది. వివరాల కోసం ఆయన గురించి ఆరా తీసిన పోలీసులకు విస్తుపోయే వాస్తవం తెలిసింది. ప్రమాదం జరిగిన టైంలో ఆ కుర్రాడు ఎర్రిస్వామి కూడా అక్కడే ఉన్నట్టు తేలింది.
ఎర్రిస్వామిని ప్రశ్నిస్తున్న పోలీసులు
ప్రమాదం జరిగిన తర్వాత భయంతో ఎర్రిస్వామి అక్కడి నుంచి పరారైనట్టు పోలీసులు గుర్తించారు. మొత్తానికి ఆ కుర్రాడి సెల్‌ఫోన్ సిగ్నల్ ఆధారంగా ఎక్కడ ఉన్నాడో కూడా గుర్తించారు. దీంతో అతన్ని పట్టుకొని విచారిస్తే అసలు విషయం చెప్పాడు. ఇద్దరం మద్యం తాగి వాహనం నడిపినట్టు అంగీకరించాడు. వెళ్తూ వెళ్తూ వర్షం కారణంగా మార్గ మధ్యలో బైక్ స్కిడ్ అయ్యిందని పేర్కొన్నాడు. బైక్ నుంచి కిందపడిన శివశంకర్ తల డివైడర్‌కు ఢీ కొట్టి చనిపోయాడని మరోవైపు తాను పడిపోయినట్టు తెలిపారు.
బైక్‌ను చూడకుండా లాగించేసిన బస్ డ్రైవర్
ఇద్దరం చెరో వైపు పడిపోయామని, ఇంతలో వి. కావేరీ బస్ వచ్చిందని రోడ్డుకు అడ్డంగా ఉన్న బైక్‌ను ఈడ్చుకొని వెళ్లిపోయిందని చెప్పాడట. అంటే ట్రావెల్ బస్ ఢీ కొట్టడం వల్ల ప్రమాదం జరగలేదని తేలింది. వీళ్లు తాగి వాహనం నడపడం వల్ల ప్రమాదం జరిగిందని ఆ ప్రమాదం కారణంగానే బస్ మంటల్లో చిక్కుకుంది. ఇరవై మంది సజీవ దహనం అయ్యారు. తన వల్లే ప్రమాదం జరిగిందని భావించిన బస్ డ్రైవర్ లక్ష్మయ్య పారిపోయాడు. ఆయన కూడా ఇలా అగ్ని ప్రమాదం జరుగుతుందని ఊహించి ఉండడేమో అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
బైక్‌ను ఈడ్చుకొని వెళ్లడంతో అగ్ని ప్రమాదం
బైక్‌ను ఢీ కొట్టిన దాదాపు 300 మీటర్లు బైక్‌ను ఈడ్చుకెళ్లింది బస్. ఇదే బస్‌లో అగ్ని ప్రమాదానికి కారణమైంది. బైక్‌లో పెట్రోల్, ఇటు బస్‌్లో ఉన్న పెట్రోల్ మండి బస్ దగ్ధమైపోయింది. ఇంత దారుణం జరిగిన తర్వాత ప్రయాణికులను అప్రమత్తం చేయకుండా డ్రైవర్ వెళ్లిపోవడం అతి పెద్ద నేరం. దీనికి తోడు ట్రావెల్స్ యాజమాన్యం లోపాలు కూడా ప్రమాదాన్ని మరింత తీవ్రం చేశాయి. బస్ డ్రైవ్ చేసిన లక్ష్మయ్యను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతని నుంచి కూడా సమాచారాన్ని రాబడుతున్నారు. అటు శివశంకర్ ఫ్రెండ్ ఎర్రిస్వామి చెప్పింది. లక్ష్మయ్య చెప్పింది బేరీజు వేసుకొని కేసు దర్యాప్తు ముందుకు తీసుకెళ్లనున్నారు.





















