Amaravati: అమరావతిని రాజధానిగా నోటిఫై చేయడానికి కేంద్రం మెలిక పెట్టిందా? బిల్లును వెనక్కి పంపించిందా?
Amaravati: రాజధానిగా అమరావతిని నోటిఫై చేసే విషయంలో గందరగోళం ఏర్పడిందని ప్రచారం జరుగుతోంది. రాష్ట్రం పంపించిన బిల్లును కేంద్రం తిరిగి పంపించినట్టు చెబుతున్నారు.

Amaravati: ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతిని నోటిఫై చేయడానికి కేంద్రం అభ్యంతరం వ్యక్తం చేస్తుందనే ప్రచారం జోరుగా సాగుతోంది. దీనికి సంబంధించిన బిల్లును తిరిగి పంపించిందని కూడా వార్తలు వస్తున్నాయి. న్యాయపరమైన చిక్కులు, నిధులు సమస్యల కారణంగానే కేంద్రం ఈ నిర్ణయం తీసుకుందని అంటున్నారు. అయితే దీనిపై రాష్ట్ర ప్రభుత్వం నుంచి మాత్రం ఎలాంటి స్పందన లేదు. ఇంకా పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నాయని ఎప్పుడైనా బిల్లు ఆమోదం పొందవచ్చని అంటున్నారు. మొత్తానికి ఈ వార్త ఇప్పుడు రాజకీయంగా చర్చనీయాంశమైంది.
మూడో మాట లేకుండా చేద్దామనే ప్రయత్నాల్లో కూటమి
అమరావతిని ఆంధ్రప్రదేశ్‌గా నోటిఫై చేయించుకుంటే భవిష్యత్‌లో మార్పులు చేర్పులకు అవకాశం ఉండని కూటమి ప్రభుత్వం భావిస్తోంది. రాష్ట్ర విడిపోయిన తర్వాత కమిషన్ వేసి అమరావతిని రాజధానిగా ఎంపిక చేసింది నాటి టీడీపీ ప్రభుత్వం. అయితే జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతిని రాజధానిగా పెట్టేందుకు అంగీకరించలేదు. దీంతో మూడు రాజధానులు అంటూ సరికొత్త పల్లవి అందుకున్నారు. వివిధ కారణాలతో మూడు రాజధానుల వ్యవహారం కూడా ముందుకు సాగలేదు. తర్వాత జరిగిన ఎన్నికల్లో మూడు రాజధానుల వాదనను ప్రజలు తిరస్కరించారు.
అమరావతిని నోటిఫై చేయించుకోవాలని ప్రయత్నాలు
2024లో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం అమరావతి మాత్రమే ఆంధ్రప్రదేశ్ రాజధాని అని స్పష్టం చేసింది. అక్కడ అభివృద్ధి పనుల కోసం వివిధ ఆర్థిక సంస్థలతో ఒప్పందాలు చేసుకుంది. కేంద్రం కూడా దీనికి ఓకే చెప్పింది. అయితే కూటమి ప్రభుత్వం ఎన్ని ప్రయత్నాలు చేసినా తర్వాత వచ్చిన ప్రభుత్వాలు మళ్లీ మార్చకుండా ఉంటాయా అనే అనుమానం ఉంది. దీంతో భవిష్యత్‌లో ఇలాంటి గందరగోళానికి ఆస్కారం లేకుండా ఉండేందుకు కేంద్రమే ఏపీ రాజధానిగా అమరావతిని నోటిఫై చేసేలా ప్రయత్నాలు చేస్తోంది.
బిల్లును కేంద్రం వెనక్కి పంపినట్టు సమాచారం
అమరావతిని ఆంధ్రప్రదేశ్ ఏకైక రాజధానిగా నోటిఫై చేయాలని కేంద్రానికి కూటమి ప్రభుత్వం బిల్ పంపించింది. 2014 నుంచి గుర్తించాలని పేర్కొంది. ఇలా చేస్తే చట్టపరమైన సమస్యలు వస్తాయని కేంద్రం భావిస్తుందని అంటున్నారు. 2024 నుంచి గుర్తిస్తే అప్పటి వరకు చేసిన ఖర్చులపై కూడా న్యాయపరమైన చిక్కులు ఎదురయ్యే అవకాశం ఉందని అంటున్నారు. అందుకే ఇప్పటికే పంపిన బిల్లును తిరిగి వెనక్కి పంపించారని అంటున్నారు. ప్రత్యామ్నాయాలతో బిల్లు పంపించాలని సూచించినట్టు చెబుతున్నారు.
న్యాయనిపుణులతో చర్చిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం
తిరిగి వచ్చిన బిల్లుపై చంద్రబాబు సర్కారు న్యాయనిపుణులతో చర్చిస్తోందని అంటున్నారు. దీనికి పరిష్కార మార్గాలను కనుక్కునే పనిలో ఉన్నారని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. పార్లమెంట్ శీతాకాల సమావేశాలు పూర్తి అయ్యే లోపుపంపిస్తే కేంద్రం అంగీకరించి సభలో ప్రవేశ పెట్టే ఛాన్స్ ఉందని అంటున్నారు. లేకుంటే మళ్లీ బడ్జెట్ సమావేశాల వరకు ఎదురు చూడాల్సి వస్తుందని చెబుతున్నారు. ఈ వ్యవహారంపై అటు కేంద్రం నుంచి కానీ, రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ ఎలాంటి ప్రకటనలు చేయలేదు. టీడీపీ వర్గాలు కూడా సైలెంట్‌గా ఉన్నాయి. కేంద్రానికి బిల్లు పంపిన సంగతిని మాత్రం ఇప్పటికే ప్రకటించారు.





















