Kurnool Bus Fire Accident: అమ్మో! ఇలాంటి బస్‌లా రోడ్డుపై తిరుగుతున్నాయి? వి. కావేరీ ఉల్లంఘనలు మామూలుగా లేవు!
Kurnool Bus Fire Accident: ప్రమాదానికి గురైన కావేరీ ట్రావెల్స్ బస్ కేవలం సిటింగ్ ద్వారానే ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చేందుకు మాత్రమే అనుమతి తీసుకొని దాన్ని స్లీపర్స్‌గా మార్చారు.

Kurnool Bus Fire Accident: కర్నూలులో జరిగిన కావేరీ బస్సు దగ్దం కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. సిటింగ్ కోసం తీసుకున్న అనుమతితో బస్‌ను ఏకంగా స్లీపర్‌గా మార్చి తిప్పుతున్నారంటే వారికి వ్యవస్థలపై ఎంత నమ్మకం ఉందో అర్థమవుతోంది. ఇలాంటివి మనకు కొత్త కాదు. 12 ఏళ్ల క్రితం ఓ ఘటన జరిగింది. ఈ మధ్య జోధ్‌పూర్‌లో ఇలాంటి దుర్ఘటన జరిగింది. ఇన్ని జరుగుతున్నా అధికారులు, ప్రభుత్వాలు మాత్రం స్పందించడం లేదు. ఇలాంటి ప్రమాదాలు జరిగినప్పుడు తూతూమంత్రంగా రెండు మూడు రోజులు తనిఖీల పేరుతో హడావిడి చేస్తారు. తర్వాత యథావిధిగా వదిలేస్తారు. అధికారులు హడావుడి చేసిన రోజులు జాగ్రత్తగా ఉండి, సరైన బస్‌లు నడిపితే చాలు తర్వాత పట్టించుకున్న వారే ఉండరు అన్నట్టు పరిస్థితులు మారిపోయాయి.
ప్రమాదానికి గురైన కావేరీ ట్రావెల్స్ బస్ కేవలం సిటింగ్ ద్వారానే ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చేందుకు మాత్రమే అనుమతి తీసుకొని దాన్ని స్లీపర్స్‌గా మార్చారు. మొత్తం డిజైన్ మార్చేశారు. అందులో కూడా చాలా లోపాలు ఉన్నట్టు అధికారులు ప్రాథమికంగా గుర్తించారు. బస్ కెపాసిటికి మించి జనాలను ఎక్కించుకోవడం కూడా ఆందోళన కలిగిస్తోంది. ఇది ప్రమాదాలకు కారణం అవుతోంది. ఇప్పుడు వస్తున్న బస్‌లలో లగేజీ కోసం ఇష్టం వచ్చినట్టు ఎత్తు పెంచేస్తున్నారు. ప్రమాదం జరిగినప్పుడు పై నుంచి దూకడం కూడా ఇబ్బందిగా మారుతుంది. అందుకే అత్యవసర కిటీకీలు ఉన్నా సరే అవి పనికిరాకుండా పోతున్నాయి. అంత ఎత్తు నుంచి దూకే సాహసం చేయలేకపోతున్నారు. అందరూ మెయిన్ డోర్ ద్వారా బయటకు రావాలని చూస్తున్నారు. కొన్ని సార్లు అవి లాక్ అవుతున్నాయి. ఇప్పుడు కర్నూలు బస్ ప్రమాదంలో అదే జరిగింది. ధైర్యం చేసి అంత ఎత్తు నుంచి దూకిన వాళ్లు ప్రాణాలతో బయటపడ్డారు. మిగిలిన వాళ్లు మంటల్లో చిక్కుకుపోయారు. ముఖ్యంగా పిల్లలు, ముసలి వాళ్లు, మహిళలు ఇలా ఇరుక్కుంటున్నారు.
కొందరు బస్ కంపెనీ ఇచ్చిన డిజైన్ కాకుండా వచ్చిన తర్వాత మార్చేస్తున్నారు. ఇప్పుడు కావేరీ బస్‌లో అదే జరిగింది. స్లీపర్‌కు పర్మిషన్ లేకపోయినా వారికి నచ్చినట్టు డిజైన్ మార్చేశారు. దీని వల్ల లోపల కారిడార్ స్పేస్ తక్కువ ఉంటుంది. ఒక మనిషి లగేజీతో వెళ్లడమే కష్టమవుతుంది. ఇది కూడా ప్రమాదాల్లో ఎక్కువ మంది చనిపోవడానికి కారణం అవుతుంది. ఏదైనా జరిగితే ఆ అంతా ఒకేసారి దిగాలనే తొందర ఉంటుంది. కానీ అక్కడ వెళ్లే దారి సరిపోదు దీని కారణంగా తొక్కిసలాట జరిగి కిందపడిపోయే వాళ్లు ఉంటారు.
ట్రావెల్స్ బస్‌లలో ప్రమాదాలు జరిగితే ఎలా తప్పించుకోవాలనే విషయంపై అవగాహన తక్కువ. ఎమర్జెన్సీ డోర్ ఎలా బ్రేక్ చేయాలి. సురక్షితంగా ఎలా బయటపడాలి. ఒక వేళ డోర్ లాక్ అయితే ఏం చేయాలి అనే విషయాలపై బస్ నడిపే సిబ్బందికే అవగాహన ఉండటం లేదు. మరి ప్రయాణికులకు ఎలాంటి అవగాహన ఉంటుంది. అందుకే ప్రమాద సమయంలో ప్యానిక్ అవుతున్నారు. ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. బస్ నిర్మాణ ముడి సరకు కూడా త్వరగా అగ్నికీలలు వ్యాపించేదై ఉంటుంది. దీనిపై కూడా అధ్యయనం జరగాలని పోలీసులు సూచిస్తున్నారు.
అగ్నికి ఆహుతి అయిన వి. కావేరీ ట్రావెల్స్ బస్ ట్రాఫిక్ ఉల్లంఘనలకు కూడా పాల్పడింది. గత జనవరి నుంచి ఇప్పటి వరకు మొత్తం 16 చలాన్లు పెండింగ్ ఉన్నాయి. ఒక చలాన్ ఉన్న బైక్‌ను, కారును పట్టుకునే పోలీసులు ఈ వాహనాన్ని ఎందుకు ఇంతవరకు పట్టుకోలేదని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. అంటే ట్రావెల్స్ బస్‌ల పట్ల పోలీసులు ఎంత నిర్లక్ష్యంగా ఉన్నారో అర్థమవుతుందని సోషల్ మీడియాలో విమర్శలు చేస్తున్నారు. 23వేల రూపాయల చలాన్లు పెండింగ్‌లో ఉంటే ఏం చేస్తున్నారని నిలదీస్తున్నారు. హైదరాబాద్‌సిటీలోకి రాకూడని టైమింగ్స్‌లో వచ్చింది. అయినా అధికారులు దాని గురించి పట్టించుకోలేదు. ఇది ఒకట్రెండు సార్లు జరగలేదు. ఏకంగా 9సార్లు ఈ ఉల్లంఘనలకు పాల్పడింది. ఈ బస్‌కు 2028 వరకు జనరల్ పర్మిట్ ఉంది. టూరిస్ట్ పర్మిట్ 2023జులై, ఆలిండియా టూరిస్ట్ పర్మింట్ ఈ ఏడాది ఏప్రిల్‌తో ముగిసింది. ఫిట్నెస్ గడువు కూడా మార్చి 31తో పూర్తి అయింది. ఇన్సూరెన్స్ గడువు ఏప్రిల్ 20తో పన్ను గడువు మార్చి 31తో ముగిసింది. ఇలా అడుగడుగునా రవాణా శాఖ రూల్స్‌ను బ్రేక్ చేసినా పట్టించుకున్న వాళ్లే లేరు. ప్రమాదం జరిగినందున ఈ ఒక్క బస్ ఇలాంటి దుస్థితిలో ఉంది. మరి మిగతా బస్‌లో పరిస్థితి ఏంటో అని ప్రజలు ఆశ్చర్యపోతున్నారు.




















