Ayush Mhatre Batting | MI vs CSK IPL 2025 మ్యాచ్ ద్వారా పుట్టిన మరో కొత్త స్టార్ ఆయుష్ మాత్రే
2025 ఐపీఎల్ ఏం చేసింది అని ఎవరైనా అడిగితే టీమిండియా క్రికెట్ వచ్చే 15-20 ఏళ్ల భవిష్యత్తును ఇచ్చింది అని చెప్పొచ్చు. అంత మంది కుర్రాళ్లు ఈసారి ఐపీఎల్ ద్వారా వెలుగులోకి వచ్చారు. మొన్ననే 14ఏళ్ల వైభవ్ సూర్య వంశీ రాజస్థాన్ తరపున బరిలోకి దిగి ఆడిన మొదటి బంతినే సిక్సర్ బాదితే...నిన్న చెన్నై తరపున 17ఏళ్ల ఆయుష్ మాత్రే అరంగేట్రం చేసి ముంబై ఇండియన్స్ ను పరుగులు పెట్టించాడు. ఎదుర్కొన్న మొదటి బంతిని సింగిల్ తీసినా..తర్వాత మూడు బంతుల్లో శివతాండవమే. ముంబై బౌలర్ అశ్వని కుమార్ ని ఫోరు, సిక్సు, సిక్సు కొట్టి అస్సలు ఊపిరి తీసుకోనివ్వకుండా చేశాడు. ఎవరైనా ఇవాళే డెబ్యూ చేసిన కుర్రాడు ఆడుతున్న మొదటి ఓవరే..ఫేస్ చేసిన రెండో బంతి నుంచే ఇంతటి విధ్వంసమా. నిన్న మ్యాచ్ చూసినవాళ్లు ఆయుష్ మాత్రే స్ర్టోక్ ప్లే కి ముచ్చట పడక మానరు. రోహిత్ శర్మ శైలిని పోలి ఉన్న స్టైల్ తో పుల్ షాట్స్ ఆడుతూ సిక్సర్లు, ఫోర్లు కొడుతూ ఆయుష్ మాత్రే ఆడిన ఆట అందరినీ ఆకట్టుకుంది. మొదటి మ్యాచ్ లోనే బెదురు లేకుండా 15 బంతుల్లోనే 4 ఫోర్లు, 2 సిక్సర్లతో 32పరుగులు చేసి ఓ కొత్త సూపర్ స్టార్ ను పుట్టుకొచ్చానని చాటి చెప్పాడు. మ్యాచ్ లో ముంబై గెలిచినా..చెన్నై ఓడిపోయినా ఈ లోకల్ ముంబై ఆటగాడు..చెన్నై తరపున మరిన్ని అవకాశాలు అయితే తప్పకుండా అందుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.





















