Telangana Bhubharathi: అందుబాటులోకి వచ్చిన భూభారతి పోర్టల్- రెవెన్యూ అధికారులకు కీలక బాధ్యత అప్పగించిన సీఎం
Telangana Bhubharathi: ధరణి స్థానంలో ప్రభుత్వం కొత్తగా భూభారతి పోర్టల్ తీసుకొచ్చింది. దీన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు.

Telangana Bhubharathi: తెలంగాణలో కొత్తగా రూపొందించిన భూభారతికి సంబంధించిన పోర్టల్‌ను ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొచ్చింది. దీన్ని శిల్పకళావేదికలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. అనంతరం మాట్లాడిన రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు ధరణిని బంగాళాఖాతంలో కలిపేశామని అన్నారు. అందరికీ అనువైన భూభారతిని తీసుకొచ్చామని తెలిపారు.
ప్రతి మనిషికి ఆధార్ ఎలా ఉంటుందో భూమి కూడా భూధార్ ఉంటుందని అన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపేందుకే భూ భారతి ప్రారంభించుకున్నామన్నారు. తెలంగాణ ప్రాంతంలో పోరాటాలన్నీ భూమితోనే ముడిపడి ఉన్నాయని ముఖ్యమంత్రి గుర్తు చేశారు. కొమురం భీమ్ జల్ జమీన్ జంగిల్ పోరాటం, సాయుధ రైతాంగ పోరాటం, కమ్యూనిస్టు సోదరుల పోరాటాలన్నీ భూమి కోసమేనని తెలిపారు. ఆధార్ తరహాలో భవిష్యత్‌లో భూమికి సంబంధించి సర్వే చేసి కొలతలు, హద్దుల వంటి సమగ్రమైన వివరాలతో ‘భూధార్’ తీసుకొస్తామని ప్రకటించారు. ప్రజాపోరాటాల నుంచి పుట్టుకొచ్చిన రెవెన్యూ చట్టాలు, ప్రజల సమస్యలను శాశ్వతంగా పరిష్కరించే దిశగా ఉండాలన్నదే ప్రభుత్వ ధ్యేయంగా చెప్పారు.
గత పాలకులు రెవెన్యూ చట్టాలను మార్చి తెచ్చిన ధరణి ప్రజల పాలిట భూతంగా మారిందని రేవంత్ విమర్శించారు. తహసీల్దార్ పైనే పెట్రోల్ పోసి తగలబెట్టే పరిస్థితి తీసుకొచ్చారని అన్నారు. రెవెన్యూ అధికారులను దోపిడీదారులుగా చిత్రీకరించి లబ్ధి పొందాలని ఆనాటి పాలకులు ఆలోచన చేశారన్నారు. చట్టాలను చుట్టాలుగా మార్చుకుని వేలాది ఎకరాలు కొల్లగొట్టిన మాట వాస్తవం కాదా? అని ప్రశ్నించారు.
భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపేందుకు తీసుకొచ్చిన ‘భూ భారతి’ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని ముఖ్యమంత్రి @revanth_anumula గారు రెవెన్యూ యంత్రాంగాన్ని కోరారు. తెలంగాణలో వివాద రహిత భూ విధానాలు ఉండాలన్నదే ప్రభుత్వ ప్రయత్నమని స్పష్టం చేశారు. ఆధార్ తరహాలో భవిష్యత్‌లో భూమికి… pic.twitter.com/agljUntotT
— Telangana CMO (@TelanganaCMO) April 14, 2025
నాటి అక్రమాలు కళ్లారా చూసిన కాంగ్రెస్ పార్టీ పేదలకు మేలు చేసేందుకు నూతన ఆర్వోఆర్ చట్టాన్ని తీసుకొచ్చామన్నారు రేవంత్. భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపుతామన్నారు. పైలట్ ప్రాజెక్టుగా నాలుగు మండలాల్లో చేపడుతున్నామని... వివాదరహిత భూ విధానాలను తీసుకురావాలని ప్రయత్నిస్తున్నట్టు వివరించారు. ఈ చట్టాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లే బాధ్యత రెవెన్యూఅధికారులపైనే ఉందని సూచించారు.
రెవెన్యూ అధికారులను ప్రజలకు చేరువ చేయాలనేదే తమ ఉద్దేశమని... గత పాలకుల్లా ప్రజల ముందు దోషులుగా నిలబెట్టే ఆలోచన లేదని రేవంత్ చెప్పారు. ఆనాటి ముఖ్యమంత్రి రెవెన్యూ అధికారులపై అసెంబ్లీ సాక్షిగా ఏం మాట్లాడారో అందరికీ తెలుసని అన్నారు. మేం అవినీతికి పాల్పడే వ్యక్తులపైన కఠినంగా ఉంటామని కానీ వ్యవస్థపై కాదని పునరుద్ఘాటించారు." మేం చేసే తప్పులకు మిమ్మల్ని దోషులుగా నిలబెట్టే విధానానికి నేను వ్యతిరేకం. భవిష్యత్‌లో ఆధార్ లాగే భూమికి సంబంధించి భూధార్ తీసుకొస్తాం. రాబోయే రోజుల్లో వ్యవసాయ భూములను సర్వే చేసి కొలతలు వేసి హద్దులు గుర్తిస్తాం. రెవెన్యూ అధికారులపై దురుద్దేశంతో కొందరు కల్పించిన అపోహలను తొలగిద్దాం" అని పిలుపునిచ్చారు. కలెక్టర్లు ప్రతీ మండలంలో పర్యటించాలని ముఖ్యమంత్రి శిల్పకళావేదికపై నుంచే ఆదేశాలు ఇచ్చారు. అందరి సహకారంతో చట్టాన్ని పకడ్బందీగా అమలు చేద్దామన్నారు.
ఎంతో మంది అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుని, ప్రజల నుంచి వచ్చిన సమాచారాన్ని క్రోడీకరించి భూములకు సంబంధించి శాశ్వత పరిష్కారం చూపించాలన్న ఉద్దేశంతో భూ భారతి చట్టం తెచ్చామన్నారు. ప్రతి గ్రామంలో రెవెన్యూ సదస్సులు నిర్వహించి రైతుల నుంచి విజ్ఞప్తులను తీసుకుని వాటిని పరిష్కరించాలన్నారు. ప్రభుత్వ లక్ష్యం నెరవేరాలంటే రెవెన్యూ సిబ్బంది మాత్రమే ఆ పనిని చేయగలరని సూచించారు. గ్రామాలు, మండలాల్లో ప్రజా దర్బార్లు, రెవెన్యూ సదస్సులు నిర్వహించడం ద్వారా అవగాహన కల్పించాలని తెలిపారు.





















