(Source: Poll of Polls)
Ustaad Review - 'ఉస్తాద్' రివ్యూ : హీరోగా, నటుడిగా కీరవాణి కుమారుడు శ్రీ సింహా హిట్టు - మరి, సినిమా?
Ustaad Movie Review in Telugu : కీరవాణి రెండో కుమారుడు శ్రీ సింహా కోడూరి హీరోగా నటించిన సినిమా 'ఉస్తాద్'. ఇందులో కావ్యా కళ్యాణ్ రామ్ కథానాయిక. ఈ సినిమా ఎలా ఉందంటే?
ఫణిదీప్
శ్రీ సింహా, కావ్యా కళ్యాణ్ రామ్, అను హాసన్, రవీంద్ర విజయ్ తదితరులు
సినిమా రివ్యూ : ఉస్తాద్
రేటింగ్ : 2/5
నటీనటులు : శ్రీ సింహా కోడూరి, కావ్యా కళ్యాణ్ రామ్, అను హాసన్, రవీంద్ర విజయ్, గౌతమ్ వాసుదేవ్ మీనన్, వెంకటేష్ మహా, రవి శివ తేజ, సాయి కిరణ ఏడిద తదితరులు
ఛాయాగ్రహణం : పవన్ కుమార్ పప్పుల
సంగీతం : అకీవా బి
నిర్మాతలు : రజినీ కొర్రపాటి, రాకేష్ రెడ్డి గడ్డం, హిమాంక్ రెడ్డి దువ్వూరు
రచన, దర్శకత్వం : ఫణిదీప్
విడుదల తేదీ: ఆగస్టు 12, 2023
ప్రముఖ సంగీత దర్శకులు కీరవాణి రెండో కుమారుడు, యువ కథానాయకుడు శ్రీ సింహా కోడూరి (Sri Simha Koduri) నటించిన తాజా సినిమా 'ఉస్తాద్' (Ustaad Telugu Movie). ఇందులో కావ్యా కళ్యాణ్ రామ్ (Kavya Kalyanram) కథానాయిక. శ్రీ సింహా కోడూరి తాను ఎంపిక చేసుకున్న ప్రతి కథలో ఏదో ఒక వైవిధ్యం ఉండేలా చూసుకున్నారు. 'ఉస్తాద్' ప్రచార చిత్రాలు చూసినప్పుడు... కొత్త అనుభూతి ఇచ్చింది. మరి, సినిమా ఎలా ఉంది?
కథ (Ustaad Telugu Movie Story): సూర్య శివ కుమార్ (శ్రీ సింహా కోడూరి) పైలట్. ఆ రోజు సీనియర్ పైలట్ జోసెఫ్ డిసౌజా (గౌతమ్ వాసుదేవ్ మీనన్) రిటైర్మెంట్. హైదరాబాద్ నుంచి బెంగళూరు ఫ్లైట్! జోసెఫ్ డిసౌజాతో సూర్య డ్యూటీ చేయాలి. ఆల్రెడీ ట్రైనింగ్ సమయంలో జోసెఫ్ చేతిలో తిట్లు తిన్న అనుభవం ఉంది. రెండు గంటల ప్రయాణంలో తిట్లు తినకుండా ఉండాలంటే... ఏదో ఒకటి మాట్లాడుతూ ఉండమని ఎయిర్ హోస్టెస్ సలహా ఇస్తుంది. అప్పుడు సూర్య తన కథ చెప్పడం మొదలు పెడతాడు.
సూర్యకు ఊహ తెలిసిన తర్వాత తండ్రి (వెంకటేష్ మహా) మరణిస్తాడు. తల్లి (అను హాసన్) అతడిని పెంచి పెద్ద చేస్తుంది. సూర్యకు కోపం వస్తే తట్టుకోలేడు. ఏదో ఒక వస్తువు మీద చూపించాలి. అతనికి ఉన్న మరో సమస్య... హైట్స్! జెయింట్ వీల్ ఎక్కితే కళ్ళు తిరుగుతాయి. అటువంటి సూర్య పైలట్ ఎలా అయ్యాడు? మీనాక్షి (కావ్యా కళ్యాణ్ రామ్)తో ప్రేమకథ ఏమిటి? మీనాక్షి తండ్రితో సూర్య గొడవ ఏమిటి? అతని జీవితంలోని ప్రతి మలుపులో ఉస్తాద్ (బండి) పాత్ర ఏమిటి? బైక్ మెకానిక్ బ్రహ్మం (రవీంద్ర విజయ్) నుంచి సూర్య ఏం నేర్చుకున్నాడు? చివరికి, ఆ బండిని ఏం చేశాడు? ట్రైనింగ్‌లో సూర్య తిట్టిన జోసెఫ్ డిసౌజా బెంగళూరులో ల్యాండ్ అయ్యాక ఏం చెప్పాడు? అనేది తెరపై చూడాలి.
విశ్లేషణ (Bhola Shankar Review) : ప్రతి ఒక్కరి జీవితంలో స్నేహితులు ఉంటారు. తిట్టినా, కొట్టినా, ఏం చేసినా సరే... మనల్ని వీడని స్నేహితులు కొందరు ఉంటారు. కొంత మంది జీవితంలో అటువంటి స్నేహితుడు మనిషి ఎందుకు కావాలి? బండి / వస్తువు కూడా కావచ్చు. ఓ బండికి వ్యక్తి జీవితాన్ని ముడిపెడుతూ తీసిన సినిమా 'ఉస్తాద్'.
'ఉస్తాద్'తో దర్శకుడిగా పరిచయమైన ఫణిదీప్... మంచి కథాంశాన్ని ఎంపిక చేసుకున్నారు. క్యారెక్టరైజేషన్స్ చూపించిన తీరు కూడా బావుంది. ఆర్టిస్టుల నుంచి మంచి నటన రాబట్టుకున్నారు. అయితే... కథనం విషయంలో తడబాటుకు గురి అయ్యారు. తప్పటడుగులు వేశారు. ఏమాత్రం ఆసక్తి కలిగించకుండా కథను ముందుకు నడిపారు. సన్నివేశాలు, మాటల్లో మాత్రం మెరుపులు మెరిపించారు.
'ఉస్తాద్'లో ముందుగా ఆకట్టుకునే అంశం... ఎటువంటి హంగులు, ఆర్భాటాలకు పోకుండా సహజత్వానికి దగ్గరగా తీయడం! సూర్య కుటుంబాన్ని పరిచయం చేసిన తీరు బావుంది. ప్రేమ కథను సైతం చక్కగా రాశారు. అందులో నిజాయతీ ఉంది. ఆ సన్నివేశాలు చూస్తుంటే... తెరపై పాత్రలతో కనెక్ట్ కావడమో? లేదంటే మనకు తెలిసిన వ్యక్తులు గుర్తుకు రావడమో? జరుగుతుంది. ఒంటరిగా కొడుకును పెంచిన తల్లి పాత్రను తీర్చిన తీరు అమోఘం! సినిమాలో మంచి మంచి మూమెంట్స్ ఉన్నాయి. అలాగే, వాటి మధ్యలో నిడివి పెంచే సీన్లు సైతం చాలా ఉన్నాయి. ఏమాత్రం ఆసక్తి కలిగించని కథనం ప్రేక్షకుల సహనానికి కాస్త పరీక్ష పెడుతుంది. పాటలు బావున్నాయి. నేపథ్య సంగీతం, కెమెరా వర్క్ కూడా!
ఇంటర్వెల్ వరకు సినిమాను చక్కగా నడిపించిన దర్శకుడు... ఆ తర్వాత సరైన ముగింపు ఇవ్వలేక తడబడ్డారు. క్యారెక్టరైజేషన్ బిల్డ్ చేయడానికి ప్రథమార్థంలో సమయం తీసుకున్నా పర్వాలేదు కానీ, ఒక్కసారి విశ్రాంతి ఇచ్చిన తర్వాత... ఆ కథకు, పాత్రలకు సరైన ముగింపు ఇవ్వడంలో అలసత్వం చూపకూడదు. 'ఉస్తాద్' ద్వితీయార్థంలో జరిగిన తప్పు అదే. భావోద్వేగభరిత సన్నివేశాలను సాగదీశారు. బైక్ నేపథ్యంలో వచ్చే సీన్లు బోరింగ్ అనిపించాయి. ఇంకా బాగా రాసుకుని ఉంటే బావుండేది. మనిషి జీవితంలో బైక్ భాగమే. ఆ బండిని ఓ పాత్రను చేసి... దానికి, హీరోకి మధ్య ద్వితీయార్థంలో రాసిన కీలకమైన ఎమోషనల్ సీన్స్ సరిగా పండలేదు. బైక్ మెకానిక్ పాత్రకు ఇచ్చిన ముగింపు సంతృప్తికరంగా లేదు. సినిమా ముగింపు కూడా!
నటీనటులు ఎలా చేశారు : నటుడిగా శ్రీ సింహా కెరీర్ బెస్ట్ 'ఉస్తాద్' అని చెప్పాలి. ఓ సినిమాలో మూడు వేరియేషన్స్ చూపించారు. లుక్స్ పరంగా కొత్తదనం చూపడమే కాదు... నటుడిగానూ మెరిశారు. నటనలో మెచ్యూరిటీ చూపించారు. కావ్యా కళ్యాణ్ రామ్ చూపులు చాలు... తెరపై నుంచి ప్రేక్షకుడి చూపు తిప్పుకోనివ్వకుండా ఉండటానికి! సింపుల్ ఎక్స్‌ప్రెషన్స్‌తో మరోసారి కావ్య ఆకట్టుకున్నారు. శ్రీ సింహ, కావ్య మధ్య క్యూట్ & లిటిల్ రొమాంటిక్ సన్నివేశాలు బావున్నాయి.
హీరో తల్లిగా అను హాసన్ నటన బావుంది. సహజంగా చేశారు. గౌతమ్ వాసుదేవ్ మీనన్ డబ్బింగ్, ఆయన నటన వల్ల సీనియర్ పైలట్ పాత్రకు హుందాతనం వచ్చింది. రవీంద్ర విజయ్ కూడా చక్కగా నటించారు. హీరో స్నేహితుడిగా రవి సాయి తేజ నటన ఓకే. కానీ, అతనితో తెలంగాణ యాసలో ఎందుకు మాట్లాడించారో?
నటీనటుల చేత తెలంగాణలో మాట్లాడించినా? లేదంటే మామూలుగా తెలుగులో డైలాగులు చెప్పించినా సరే? ఈ కథకు వచ్చే నష్టం ఏమీ ఉండదు. తెలంగాణ నేపథ్యం తీసుకుంటే అది కథకు ఉపయోగపడేలా ఉండాలి కానీ, ప్రేక్షకులు గుర్తించి 'ఇలా ఉందేంటి?' అనుకునేలా ఉండకూడదు.
Also Read : మెగాస్టార్ రీ ఎంట్రీ తర్వాత లోయస్ట్ ప్రీ రిలీజ్ రికార్డ్ 'భోళా శంకర్'దే - బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంతంటే?
చివరగా చెప్పేది ఏంటంటే : 'ఉస్తాద్' టేకాఫ్ బావుంది. ల్యాండింగ్ విషయంలో తడబడింది. పైలట్ శ్రీ సింహా కోడూరి తన యాక్టింగ్ స్కిల్స్ చూపించారు. బాగా మెప్పించారు. ఆయనతో పాటు మిగతా నటీనటులు కూడా! అయితే... దర్శకుడు ఫణిదీప్ తయారు చేసిన 'బండి'(కథ)లో కొన్ని లోపాలు ఉన్నాయి. అందువల్ల, కాస్త సహనం కావాలి... థియేటర్లలో సినిమాను చూడాలంటే!
Also Read : 'జైలర్' థియేట్రికల్ బిజినెస్ ఎంత? రజనీకాంత్ సినిమా బ్రేక్ ఈవెన్ అవుతుందా?
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial