Ramgopal Varma: ఏపీ పోలీసుల విచారణకు హాజరైన ఆర్జీవీ - చంద్రబాబు, లోకేశ్, పవన్ ఫోటోల మార్ఫింగ్ కేసులో..
Ap News: వివాదాస్పద దర్శకుడు ఆర్జీవీ ఏపీ పోలీసుల ఎదుట విచారణకు హాజరయ్యారు. సోషల్ మీడియాలో అనుచిత పోస్టుల కేసులో ఒంగోలు పోలీసులు ఆయన్ను విచారిస్తున్నారు.

Director Ram Gopal Varma Attends AP Police Investigation: వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ (Ram Gopal Varma) శుక్రవారం ఏపీ పోలీసుల ఎదుట విచారణకు హాజరయ్యారు. సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు, అనుచిత వ్యాఖ్యల కేసులో విచారణ కోసం ఒంగోలు రూరల్ పోలీస్ స్టేషన్‌కు ఆయన వచ్చారు. సీఐ శ్రీకాంత్ బాబు ఆయన్ను విచారిస్తున్నారు. కాగా, గత ఎన్నికల సమయంలో ఆర్జీవీ వైసీపీకి అనుకూలంగా వ్యవహరిస్తూ 'వ్యూహం' చిత్రాన్ని రూపొందించారు. ప్రచారం సమయంలో అప్పటి ప్రతిపక్ష నేత, ప్రస్తుత సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్, జనసేన అధ్యక్షుడు, ప్రస్తుత డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ వ్యక్తిత్వాలను కించపరిచేలా 'ఎక్స్'లో పోస్టులు పెట్టారు. దీనిపై మద్దిపాడు మండలం టీడీపీ ప్రధాన కార్యదర్శి ఎం.రామలింగం ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసి.. ఆర్జీవీకి నోటీసులు జారీ చేశారు.
గతంలోనూ నోటీసులు
కాగా, ఈ కేసు విచారణలో భాగంగా గతంలోనే ఆర్జీవీకి పోలీసులు నోటీసులు జారీ చేశారు. అయితే, తాను సినిమా షూటింగ్‌లో ఉన్నానని.. వేరొక రోజు వస్తానని పోలీసులకు ఆయన వాట్సాప్ ద్వారా సమాచారం పంపారు. పోలీసుల అనుమతి లేకుండానే విచారణకు హాజరయ్యారు. ఈ క్రమంలో ఆయన్ను అదుపులోకి తీసుకునేందుకు పోలీసులు సిద్ధమయ్యారు. అయితే, అదే సమయంలో ఆర్జీవీ అజ్ఞాతంలోకి వెళ్లారనే వార్తలు హల్చల్ చేశాయి. అయితే, తాను ఎక్కడికీ పారిపోలేదని.. ఆర్జీవీ క్లారిటీ ఇచ్చారు. తనపై పోలీసులు అన్యాయంగా.. కేసు నమోదు చేశారని.. సదరు ఎఫ్ఐఆర్‌లు కొట్టేయాలంటూ హైకోర్టులో క్వాష్ పిటిషన్లు దాఖలు చేశారు.
దీంతో వర్మకు బెయిల్ మంజూరు చేసిన ఉన్నత న్యాయస్థానం.. పోలీస్ విచారణకు హాజరై వారికి సహకరించాలని ఆదేశించింది. ఈ నేపథ్యంలో ఒంగోలు రూరల్ పోలీసులు ఇటీవలే మరోసారి నోటీసులు పంపించగా.. శుక్రవారం వారి ఎదుట విచారణకు హాజరయ్యారు.
వైసీపీ నేతను కలిసిన ఆర్జీవీ
అయితే, పోలీస్ విచారణకు ముందు ఆర్జీవీ వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని కలిశారు. ప్రకాశం జిల్లా మద్దిపాడు మండలం వెల్లంపల్లిలోని ఓ హోటల్‌లో వీరిద్దరూ మంతనాలు జరిపారు. పోలీస్ కేసులు, ఇతర అంశాలపై ఇరువురూ చర్చించినట్లు తెలుస్తోంది.
Also Read: 'సెలబ్రిటీలను టార్గెట్ చేయడం బాధాకరం' - అరెస్ట్ వారెంట్ వార్తలపై సోనూసూద్ తీవ్ర అసహనం





















