Mother's Day Special : 'అమ్మ' ప్రేమను వెండితెరపై ఆవిష్కరించిన టాలీవుడ్ సినిమాలు ఇవే!
Telugu Mother Sentiment Movies : 'అమ్మ' ప్రేమను వెండితెరపై ఆవిష్కరించిన సినిమాలకు ఎల్లప్పుడూ విశేషమైన ప్రేక్షకాదరణ ఉంటుంది. తెలుగులో మదర్ సెంటిమెంట్ తో వచ్చి సక్సెస్ సాధించిన ఆ చిత్రాలు...
Mother Sentiment Movies in Telugu : నిస్వార్థ ప్రేమకు చిరునామా 'అమ్మ'. ప్రతీ మనిషికి ప్రత్యక్ష దైవం అమ్మ. ప్రతీ ఒక్కరికీ ఆది గురువు అమ్మ. ప్రేమానురాగాలకు, అంతులేని త్యాగాలకు, ఆప్యాయతలకు పెట్టింది పేరు అమ్మ. సమాజానికి తల్లులు చేసిన అమూల్యమైన సేవలకు, వెలకట్టలేని తల్లి ప్రేమకు గుర్తుగా ప్రతీ ఏడాది మే నెల రెండో ఆదివారం ప్రపంచవ్యాప్తంగా మాతృదినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. నేడు 'మదర్స్ డే' సందర్భంగా మదర్ సెంటిమెంట్ తో తెరకెక్కిన సినిమాల గురించి తెలుసుకుందాం.
'గుంటూరు కారం' (2024)
సూపర్ స్టార్ మహేష్ బాబు, డైరెక్టర్ త్రివిక్రమ్ కాంబోలో వచ్చిన యాక్షన్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ 'గుంటూరు కారం'. ఇది మదర్ సెంటిమెంటుతో కూడిన కమర్షియల్ మూవీ. దీంట్లో రమ్యకృష్ణ, మహేశ్ తల్లీ కొడుకులుగా నటించారు. శ్రీలీల, మీనాక్షి చౌదరీ హీరోయిన్లుగా చేశారు. ఈ ఏడాది సంక్రాంతి సందర్భంగా రిలీజైన ఈ చిత్రం, టాక్ తో సంబంధం లేకుండా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది.
'ఒకే ఒక జీవితం' (2022)
శర్వానంద్ హీరోగా శ్రీ కార్తీక్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'ఒకే ఒక జీవితం'. టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్ కు మదర్ సెంటిమెంట్ జోడించి రూపొందించిన ఫీల్ గుడ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ఇది. చిన్నతనంలోనే తల్లిని కోల్పోయిన ఓ యువకుడు, టైం మెషిన్ సహాయంతో గతంలోకి వెళ్లి తన తల్లిని కలుసుకొని, అప్పుడు జరిగిన తప్పులను సరిచేయాలని ప్రయత్నించడమే ఈ సినిమా కథాంశం. ఇందులో అక్కినేని అమల, శర్వా తల్లీ కొడుకులుగా నటించారు. రీతూ వర్మ, వెన్నెల కిషోర్, ప్రియదర్శి, నాజర్ ఇతర ప్రధాన పాత్రలు పోషించారు.
'లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్' (2012):
సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల తెరకెక్కించిన యూత్ ఫుల్ ఎంటర్టైనర్ 'లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్'. బి ఫేజ్, గోల్డ్ ఫేజ్ అంటూ రెండు గ్రూపుల కుర్రాళ్ళ చుట్టూ అల్లుకున్న ఈ కథలో అమ్మ సెంటిమెంట్ ను కూడా టచ్ చేశారు. క్యాన్సర్ తో పోరాడుతున్న తల్లి పాత్రలో అమల అక్కినేని, కొడుకుగా అభిజిత్ నటించారు. విజయ్ దేవరకొండ, నవీన్ పోలిశెట్టి, శ్రీ విష్ణు, శ్రీముఖి వంటి పలువురు ఈ చిత్రంలో చిన్న క్యారెక్టర్స్ లో కనిపించారు.
Also Read: విజయ్ దేవరకొండ కెరీర్‌లో ఆగిపోయిన సినిమాలు ఎన్నో తెలుసా?
'యోగి' (2007) & 'ఛత్రపతి' (2005):
వి వినాయక్ దర్శకత్వంలో రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన చిత్రం 'యోగి'. చెప్పకుండా ఇంట్లో నుంచి సిటీకి పారిపోయిన కొడుకును వెతుక్కుంటూ వచ్చిన తల్లి.. చివరకు అతన్ని కలవకుండానే చనిపోవడం అనే విషాదాంత పాయింట్ తో ఈ సినిమా తెరకెక్కింది. దీంట్లో శారద తల్లి పాత్ర పోషించింది. ఇది 'జోగి' అనే కన్నడ చిత్రానికి రీమేక్. ఇక ఎస్.ఎస్ రాజమౌళితో ప్రభాస్ చేసిన 'ఛత్రపతి' మూవీ కూడా అమ్మ సెంటిమెంట్ చుట్టూ తిరుగుతుంది. దీంట్లో అమ్మ పాత్రను భానుప్రియ పోషించింది. ఇదే చిత్రాన్ని 18 ఏళ్ల తర్వాత గతేడాది హిందీలో రీమేక్ చేశారు. వివి వినాయక్, బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కాంబోలో వచ్చిన ఈ చిత్రం బాలీవుడ్ లో డిజాస్టర్ గా మారింది.
'అమ్మ చెప్పింది' (2006):
శర్వానంద్ నటించిన మరో మదర్ సెంటిమెంట్ సినిమా 'అమ్మ చెప్పింది'. గుణ్ణం గంగరాజు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో శర్వా తల్లి పాత్రలో సుహాసిని నటించింది. మానసికంగా ఎదుగుదల లేని ఓ అబ్బాయి ప్రాణాలను పణంగా పెట్టిన ఒక తల్లి, తన దేశాన్ని ఉగ్ర దాడి నుంచి ఎలా రక్షించింది అనే లైన్ తో ఈ మూవీ తీశారు. ఇది విమర్శకుల ప్రశంసలు అందుకుంది.
'అమ్మ నాన్న ఓ తమిళ అమ్మాయి' (2003):
మాస్ మహారాజా రవితేజ, అసిన్ హీరో హీరోయిన్లుగా పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందిన సినిమా 'అమ్మ నాన్న ఓ తమిళ అమ్మాయి'. బ్యాక్సింగ్ బ్యాక్ డ్రాప్ లో మదర్ సెంటిమెంట్ ని టచ్ చేస్తూ ఈ మూవీ తెరకెక్కించారు. ఇందులో జయసుధ, రవితేజ తల్లీ కొడుకులుగా కనిపిస్తారు. ఇది బాక్సాఫీసు వద్ద మంచి విజయం సాధించింది. తర్వాత పలు భాషల్లోకి రీమేక్ చేయబడింది.
'సింహరాశి' (2001) & 'పెదబాబు' (2004):
వి. సముద్ర దర్శకత్వంలో డా. రాజశేఖర్ హీరోగా నటించిన సినిమా 'సింహరాశి'. ఇది 'మాయి' అనే తమిళ చిత్రానికి రీమేక్. మదర్ సెంటిమెంట్ తో తీసిన ఈ చిత్రం ప్రేక్షకాదరణ పొందింది. ఒక తల్లి సెంటిమెంటును టచ్ చేస్తూ జగబాబు తీసిన సినిమా 'పెదబాబు'. తల్లి మీద ప్రేమ ఉన్నప్పటికీ, తన వల్ల ఆమెకు ప్రమాదం ఉందని దూరంగా జీవించే కొడుకు కథ ఇది. దీంట్లో తల్లి పాత్రను సుహాసిని పోషించింది.
'మాతృదేవోభవ' (1993):
మదర్ సెంటిమెంట్ అనగానే తెలుగు ఆడియెన్స్ కు టక్కున గుర్తొచ్చే సినిమా 'మాతృదేవోభవ'. భర్తను కోల్పోయిన ఓ మహిళ, తనకు క్యాన్సర్ ఉందని తెలిసి తన బిడ్డల భవిష్యత్తు కోసం పడే ఆరాటమే ఈ చిత్ర కథాంశం. తల్లి క్యారక్టర్ లో సీనియర్ నటి మాధవి నటించింది. అజయ్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ మూవీ ఎవర్ గ్రీన్ కల్ట్ క్లాసిక్ గా నిలిచింది. ఇదే చిత్రాన్ని ఆ తర్వాత అనేక భాషల్లోకి రీమేక్ చేశారు.
'అమ్మ రాజీనామా' (1991):
ఫ్యామిలీ కోసం తన జీవితాన్నే త్యాగం చేసే విలువను, గొప్పదనాన్ని చాటిచెప్పే సినిమా 'అమ్మ రాజీనామా'. దర్శకరత్న దాసరి నారాయణరావు ఈ కుటుంబ కథా చిత్రాన్ని తెరకెక్కించారు. ఇందులో అమ్మ పాత్రలో సీనియర్ నటి శారద కనిపించింది. దీన్ని లక్ష్మీ ప్రధాన పాత్రలో కన్నడలో రీమేక్ చేశారు.
ఇవే కాకుండా మదర్ సెంటిమెంట్ తో వచ్చి ప్రేక్షకుల ఆదరణ పొందిన సినిమాలు చాలా ఉన్నాయి. సురేష్ కృష్ణ దర్శకత్వంలో సుహాసిని, శరత్ బాబు ప్రధాన పాత్రల్లో 'అమ్మ' (1991) అనే చిత్రం వచ్చింది. ఎస్.వి. కృష్ణారెడ్డి, కమెడియన్ అలీ కలిసి చేసిన సోషియో ఫాంటసీ కామెడీ చిత్రం 'యమలీల' (1994) అమ్మ సెంటిమెంటును ఆవిష్కరించింది. మహేశ్ బాబు 'నాని', రామ్ చరణ్ 'చిరుత', వరుణ్ తేజ్ 'లోఫర్', పవన్ కళ్యాణ్ 'కొమరం పులి', కింగ్ అక్కినేని నాగార్జున 'మనం'.. వంటి పలు సినిమాలు అంతర్లీనంగా అమ్మ కథను చెప్తాయి. 'ముగ్గురు మొనగాళ్లు' 'రాక్షసుడు' 'అడవి దొంగ' 'భైరవద్వీపం' 'వంశానికొక్కడు' 'అబ్బాయి గారు' 'ధృవ నక్షత్రం' లాంటి పాత సినిమాలు మరికొన్ని చిత్రాలు కూడా ఇదే కోవకు చెందుతాయి. అలానే మదర్ సెంటిమెంట్ తో వచ్చిన బిచ్చగాడు, రఘువరన్ బీటెక్, KGF లాంటి డబ్బింగ్ సినిమాలు కూడా తెలుగులో బాగా ఆడాయి.
Also Read: ఫాంటసీ ప్రపంచంలో విహరిస్తున్న టాలీవుడ్ హీరోలు - సరికొత్త అనుభూతిని పంచబోతున్న సినిమాలు!