Fed Rate Hike: వడ్డీ రేట్లను 25 bps పెంచిన ఫెడ్ - ప్రపంచం ఏమైనా పర్లేదు, తన దారి తనదే!
ఒడుదొడుకులను దృష్టిలో పెట్టుకుని పెంపును ఇకపై నిలిపేసే అవకాశం ఉందని సూచించింది.
US Fed Interest Rates Hike: అమెరికాలో సిలికాన్ వ్యాలీ బ్యాంక్, సిగ్నేచర్ బ్యాంక్‌ల పతనం, ఐరోపాలో క్రెడిట్ సూయిజ్ సంక్షోభం కారణంగా గడ్డు పరిస్థితులు ఏర్పడి, ఆ ప్రభావం మిగిలిన రంగాలపై పడినా అమెరికన్ సెంట్రల్ బ్యాంక్ వెనక్కు తగ్గలేదు, వడ్డీ రేటు పెంపును ఆపలేదు.
ఫెడరల్ రిజర్వ్ (యూఎస్ ఫెడ్), తన వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు (0.25% లేదా పావు శాతం) పెంచింది. అయితే U.S. బ్యాంకుల పతనం కారణంగా ఆర్థిక మార్కెట్లలో ఏర్పడిన ఒడుదొడుకులను దృష్టిలో పెట్టుకుని పెంపును ఇకపై నిలిపేసే అవకాశం ఉందని సూచించింది.
వడ్డీ మరింత ఖరీదు
తాజాగా 25 బేసిస్ పాయింట్ల పెంపుతో, U.S. సెంట్రల్ బ్యాంక్ బెంచ్‌మార్క్ ఓవర్ నైట్ వడ్డీ రేటు 4.75%-5.00% శ్రేణికి చేరింది. వడ్డీ రేట్లు ఈ సంవత్సరం చివరి నాటికి మరో పావు శాతం పెరుగుతాయని 18 మంది ఫెడ్ పాలసీ రూపకర్తలలో 10 మంది భావిస్తున్నారు. 2% ద్రవ్యోల్బణ లక్ష్యాన్ని సాధించడం కోసం రుణ రేటును పెంచుతున్నట్లు FOMC (Federal Open Market Committee) బుధవారం రాత్రి ప్రకటించింది.
వడ్డీ రేటు పెంపు తర్వాత, ఇప్పుడు అమెరికాలో పాలసీ వడ్డీ రేటు 5 శాతానికి పెరిగింది. 2006 జూన్ తర్వాత USలో ఇదే అత్యధిక స్థాయి. అంతకు ముందు, కోవిడ్ మహమ్మారి సమయంలో అన్ని ఇతర సెంట్రల్ బ్యాంకుల మాదిరిగానే, ఆర్థిక వ్యవస్థకు మద్దతుగా ఫెడరల్ రిజర్వ్ కూడా వడ్డీ రేట్లను నిరంతరం తగ్గించింది. గత ఏడాది కాలంగా వడ్డీ రేట్లు మళ్లీ వేగంగా పెరిగాయి.
అమెరికాలో బ్యాంకింగ్ సంక్షోభం కారణంగా ఈసారి వడ్డీ రేట్లను పెంచకపోవచ్చు, ఒకవేళ పెంచిన 25 బేసిస్ పాయింట్లు మేర మాత్రమే పెంచవచ్చని ప్రపంచ మార్కెట్లు అంచనా వేశాయి. ఈ అంచనాలకు తగ్గట్లుగానే వడ్డీ రేట్ల పెంపు వచ్చింది. అయితే, వడ్డీ రేట్లు "పెంచకపోవచ్చు" అన్న అంచనా విఫలం కావడం కాస్త నిరాశను మిగిల్చింది. ఆ ప్రతికూల ప్రభావం రాత్రి అమెరికన్ మార్కెట్ల మీద, ఆ తర్వాత ఆసియా మార్కెట్ల మీద పడింది.
స్టేట్‌మెంట్లలో సమన్వయం పాటించిన ఫెడ్
వడ్డీ రేట్ల పెంపు తర్వాత, గతంలోలా ఫెడ్ ఎలాంటి కఠిన వ్యాఖ్యలు చేయలేదు. బ్యాంకింగ్, ఆర్థిక మార్కెట్లలో సంక్షోభాన్ని దృష్టిలో పెట్టుకుని తన స్టేట్‌మెంట్లలో సమన్వయం పాటించింది. గతంలో లాగ, రేట్ల పెంపును సమర్థించుకుంటూ స్టేట్‌మెంట్లు ఇవ్వలేదు.
దీనికి బదులుగా, "కొన్ని అదనపు పాలసీ విధానాలు సముచితం" అని మాత్రమే చెప్పింది. దీనిని బట్టి ఫెడ్ తదుపరి సమావేశంలోనూ పావు శాతం మేర మాత్రమే రేట్లు పెరిగే అవకాశం ఉంది.
U.S. బ్యాంకింగ్ వ్యవస్థ "బలంగా, స్థితిస్థాపకంగా ఉంది" అని ఫెట్ పేర్కొన్నప్పటికీ, బ్యాంకింగ్ రంగంలో ఇటీవలి ఒత్తిడి వల్ల "గృహ, వ్యాపారాలకు రుణాలు కఠినంగా మారే అవకాశం ఉంది. ఆర్థిక కార్యకలాపాలు, ఉద్యోగాలు, ద్రవ్యోల్బణంపై ఒత్తిడి పెరగడానికి అవకాశం ఉంది" అని వెల్లడించింది.
ద్రవ్యోల్బణంపై చేస్తున్న యుద్ధంలో తాము గెలిచినట్లు కూడా ఫెడ్ ఎటువంటి అంచనాలు వినిపించలేదు. "ద్రవ్యోల్బణం తగ్గింది" అన్న గత కామెంట్లను తీసేసి, "ద్రవ్యోల్బణం అధిక స్థాయిలో ఉంది" అన్న మాటల్ని చేర్చింది. తర్వాతి సమావేశంలోనూ వడ్డీ రేట్ల పెంపు ఉంటుంది అన్నదానికి ఇది సూచన.
దశాబ్దాల గరిష్ట స్థాయికి చేరిన ద్రవ్యోల్బణంతో గత ఏడాది కాలంగా అమెరికా పోరాడుతోంది. ఇప్పటికీ అది అదుపులోకి రాలేదు. తన అతి పెద్ద ఆందోళన ద్రవ్యోల్బణం అని అనేక సందర్భాల్లో ఫెడరల్ రిజర్వ్ స్పష్టం చేసింది. ఆర్థిక మాంద్యం నియంత్రణపై కాకుండా ద్రవ్యోల్బణం నియంత్రణపైనే ఎక్కువగా ఫోకస్ పెట్టింది. ఫెడరల్ రిజర్వ్ తన వడ్డీ రేట్లను నిరంతరం పెంచుతోంది.