Train AC Coach Blankets: వామ్మో... ట్రైన్‌లో ఇచ్చే దుప్పట్లు నెలకోసారి ఉతుకుతారట- కూల్‌గా సమాధానం ఇచ్చిన రైల్వే శాఖ
AC Coach Blankets: ఏసీ బోగీలో ఇచ్చే దుప్పట్ల విషయంలో ఇండియన్ రైల్వేస్ ఇచ్చిన రిప్లైతో ప్రయాణీకుల మైండ్ బ్లాంక్ అయింది. ఆ దుప్పట్లను ముట్టుకోవాలన్నా భయపడే నిజం చెప్పింది.
Train AC Coach Blankets Washing Period: భారతీయ రైల్వే తన ప్రయాణీకులకు అలాంటి ఇలాంటి షాక్ ఇవ్వలేదు. రైల్వేస్ చెప్పిన విషయం విన్నాక, చాలా మంది రైలు ప్రయాణమంటే భయపడొచ్చు. ముఖ్యంగా, AC కోచ్‌లో బెర్త్ బుక్ చేసుకునేవాళ్లు ఒకటికి రెండుసార్లు ఆలోచించుకుంటారు.
ది న్యూ ఇండియన్ ఎక్స్‌ప్రెస్, సమాచార హక్కు చట్టం (RTI) ద్వారా పొందిన సమాచారం ప్రయాణీకుల్లో గుబులు రేపుతోంది. ఏసీ బోగీల్లో ప్రయాణీకులకు ఇచ్చే బెడ్ షీట్‌లు, దిండు కవర్లను ప్రయాణం పూర్తయిన తర్వాత ఉతుకుతున్నప్పటికీ, బ్లాంకెట్స్‌ను మాత్రం నెలకు ఒక్కసారి మాత్రమే ఉతుకుతున్నారట. వాటి పరిస్థితిని బట్టి, కొన్ని దుప్పట్లను నెలలో రెండుసార్లు కూడా ఉతకొచ్చు. RTI ద్వారా అడిగిన ప్రశ్నకు ఇండియన్ రైల్వేస్ ఇచ్చిన సమాధానం ఇది. నెలకు ఒకసారి మాత్రమే బ్లాంకెట్స్ ఉతకడం వల్ల.. వాటి పరిశుభ్రత, రైల్వే ప్రమాణాలపై సందేహాలు మొదలయ్యాయి. ప్రయాణీకుల ఆరోగ్యాన్ని గాల్లో దీపంలా నిలబెట్టిన రైల్వేపై ప్రజలు ఒంటికాలిపై లేస్తున్నారు.
టిక్కెట్ ధరలోనే బెడ్డింగ్ ఛార్జ్
AC కోచ్‌లలో ప్రయాణించేవాళ్లకు బెడ్ షీట్‌లు, దిండ్లు, బ్లాంకెట్‌తో కూడిన బెడ్డింగ్ అందుకుంటారు. కప్పుకునే దుప్పట్లు ఉన్నితో చేసినవి ఉంటాయి. ఈ బెడ్డింగ్‌ను రైల్వే సిబ్బంది చక్కగా ప్యాక్ చేసి ప్రయాణీకులకు ఇస్తారు. బెడ్డింగ్ ఛార్జీలను టిక్కెట్ ధరలోనే కలిపి వసూలు చేస్తారు. డబ్బులు తీసుకుంటున్నప్పటికీ, "నెలకొక్కసారే ఉతుకుడు" అంటూ చావు కబురు చల్లగా చెప్పింది రైల్వే విభాగం.
హౌస్ కీపింగ్ సిబ్బంది మాట మరోలా ఉంది
“దుప్పట్లు నెలకు ఒకటి లేదా రెండుసార్లు ఉతకాలన్న రూల్ ఏమీ లేదు. ఉన్ని దుప్పట్లను తరచూ ఉతకడం కష్టమైన విషయం. దుర్వాసన, తడి, వాంతులు, ఆహార పదార్థాలు వంటివి గమనించినప్పుడు మాత్రమే మేము ఆ దుప్పట్లను ఉతకడానికి వేస్తాం. కొన్ని సందర్భాల్లో, ప్రయాణీకులు ఫిర్యాదు చేస్తేనే దుప్పటి మారుస్తాం" - పేరు చెప్పడానికి ఇష్టపడని హౌస్ కీపింగ్ సిబ్బంది
కొన్ని నెలలపాటు ఉతకరట?
ప్రతి ట్రిప్ తర్వాత బెడ్ షీట్లను, దిండు కవర్లను ప్యాక్ చేసి లాండ్రీకి పంపుతారు. తదుపరి ప్రయాణానికి ముందే వాటిని శుభ్రం చేస్తారు. అయితే, దుప్పట్లను మాత్రం చక్కగా మడతబెట్టి కోచ్‌లోనే ఉంచుతారట. మరకలు లేదా అసహ్యకరమైన వాసన వంటి సమస్యలు గుర్తించేవరకు, కొన్ని నెలలపాటు ఆ దుప్పట్లను ఉతకరట. పేరు చెప్పడానికి ఇష్టపడని హౌస్ కీపింగ్ సిబ్బంది ఈ విషయాన్ని కూడా చెప్పారు.
పరిశుభ్రత విషయంలో 'కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్' (CAG) కూడా ఇండియన్ రైల్వేస్‌ను నిలదీసింది. 2017లో కాగ్ ఇచ్చిన రిపోర్ట్‌లో, బ్లాంకెట్ క్లీనింగ్ విషయాలను హైలైట్ చేసింది. కొన్ని దుప్పట్లను ఆరు నెలల వరకు ఉతకలేదని వేలెత్తి చూపింది. రైల్వే విభాగం.. నలుపు లేదా గోధుమ రంగు వంటి ముదురు రంగుల్లో ఉన్న బ్లాంకెట్స్‌ను ఇవ్వడం వెనుక ఒక కారణముంది. మరకలు, దుమ్ము వంటివి వాటిపై పడ్డా సులభంగా గుర్తించలేరు.
భారీ స్థాయిలో లాండ్రీ సదుపాయాలు
ఇండియన్ రైల్వేస్‌కు దేశవ్యాప్తంగా 46 డిపార్ట్‌మెంటల్ లాండ్రీలు, 25 BOOT (బిల్డ్-ఓన్-ఆపరేట్-ట్రాన్స్‌ఫర్) లాండ్రీలు ఉన్నాయి. వీటిలో పని చేయడానికి వేలమంది కాంట్రాక్ట్ సిబ్బంది ఉన్నారు. ఈ ఫెసిలిటీల నిర్వహణ మొత్తం ప్రైవేట్ కాంట్రాక్టర్ల చేతుల్లోనే ఉంది. ఇన్ని వనరులు ఉన్నప్పటికీ, దుప్పట్ల పరిశుభ్రతపై ఇండియన్ రైల్వేస్‌కు పట్టింపు లేకపోయింది.
మరో ఆసక్తికర కథనం: తుపాను ఫస్ట్ దెబ్బ కూరగాయల మీద పడింది- మార్కెట్లు కిటకిట, కిలో టమోటా రూ.100