విశాఖలో వైఎస్‌ఆర్‌సీపీకి భారీ షాక్- పార్టీకి పంచకర్ల రమేష్‌బాబు రాజీనామా
విశాఖలో వైఎస్‌ఆర్‌సీపీకి భారీ షాక్ తగిలింది. పార్టీలో స్వేచ్ఛ లేదంటూ పంచకర్ల రమేష్ బాబు రాజీనామా చేశారు.
ఎన్నికల ముందు విశాఖలో వైసీపీకి భారీ షాక్ తగిలింది. ఆ పార్టీకి జిల్లా అధ్యక్షుడిగా ఉన్న పంచకర్ల రమేష్‌బాబు రాజీనామా చేశారు. పార్టీకి కూడా రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు.
పార్టీకి రాజీనామా చేసిన పంచకర్ల రమేష్ బాబు తీవ్ర ఆరోపణలు చేశారు. విశాఖలో పార్టీ విజయం సాధించాలంటే భారీ మార్పులు కఠిన నిర్ణయాలు తీసుకోవాలని సూచించారు. అలాంటి పరిస్థితి వైసీపీలో లేదని వాపోయారు. పెయిల్యూర్ లీడర్‌గా ఉండేందుకు తాను సిద్ధంగా లేనని అందుకే పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు.
పార్టీలో ఎలాంటి పనులు చేయాలన్నా తనకు స్వేచ్ఛ లేదన్నారు పంచకర్ల రమేష్‌బాబు. సామాజీక వర్గాల మీటింగ్స్ వద్దని చెబుతున్నారని ఆరోపించారు. విశాఖ పార్టీలో ఉన్న సమస్యలు చెబుదామని ఎంతగా ప్రయత్నించినా పార్టీ అధ్యక్షుడు జగన్ దృష్టికి తీసుకెళ్లలేకపోయానన్నారు. ఏ నియోజకవర్గంలో సమస్యలు గురించి ప్రస్తావించినా ఇంఛార్జ్ వైవీ సుబ్బారెడ్డి ఆ స్థానిక ఎమ్మెల్యేలకు అనుకూలంగా మాట్లాడతారని విమర్శించారు.
వచ్చే ఎన్నికల్లో విశాఖలో మెజార్టీ సీట్లు గెలుచుకోవాలంటే వైఎస్‌ఆర్‌సీపీలో ప్రక్షాళన అవసరమని అభిప్రాయపడ్డారు పంచకర్ల రమేష్‌బాబు. కఠిన నిర్ణయాలు అవసరమని అన్నారు. ఇలా అందర్నీ సమర్థించుకుంటూ పోతే ప్రక్షాళన ఎలా సాధ్యమని ప్రశ్నించారు. అందుకే పార్టీని వీడుతున్నట్టు లెటర్‌లో పేర్కొన్నారు.
భవిష్యత్ కార్యచరణపై త్వరలోనే నిర్ణయం
ప్రస్తుతానికి వైఎస్‌ఆర్‌సీపీకి రాజీనామా చేశానని.. భవిష్యత్ కార్యచరణపై ఇంకా ఆలోచించలేదన్నారు పంచకర్ల రమేష్‌బాబు. త్వరలోనే అనుచరులతో సమావేశమై నిర్ణయం తీసుకుంటాని తెలిపారు. అప్పుడే భవిష్యత్ కార్యచరణపై స్పందిస్తానన్నారు.
జనసేన వైపు పంచకర్ల చూపు
వైఎస్‌ఆర్‌సీపీకి రాజీనామా చేసిన పంచకర్ల రమేష్‌బాబు జనసేనవైపు చూస్తున్నట్టు తెలుస్తోంది. ఆయన తన అనుచరులతో వద్ద ఈ విషయాన్ని ప్రస్తావించినట్టు సమాచారం. పంచకర్ల రమేష్‌బాబు రెండు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2009లో ప్రజారాజ్యం తరఫున పెందుర్తి నుంచి పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో విజయం సాధించి తొలిసారి అసెంబ్లీలో అడుగు పెట్టారు. తర్వాత పరిస్థితుల్లో వచ్చిన మార్పు కారణంగా టీడీపీలో చేరారు. ఆ పార్టీ టికెట్‌పై 2014లో పోటీ చేసి రెండోసారి ఎమ్మెల్యే అయ్యారు. రెండోసారి యలమంచిలి నుంచి పోటీ చేశారు. 2019 కూడా టీడీపీ తరఫున అదే స్థానం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. తర్వాత మూడేళ్ల క్రితం వైఎస్‌ఆర్‌సీపీ కండువా కప్పుకున్నారు. జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు. ఇప్పుడు ఆ పార్టీకి కూడా రాజీనామా చేశారు.