Ramarajyam Raghav Reddy: చిలుకూరి పూజారినే కాదు చిన్న జీయర్ నూ టార్గెట్ చేసిన "రామరాజ్యం " రాఘవ రెడ్డి, అతడి లక్ష్యం ఇదే!
చిలుకూరి పూజారి నే కాదు చిన్న జీయర్ నూ వదిలి పెట్టని "రామరాజ్యం " రాఘవ రెడ్డి "గోత్రాలు మార్చడానికి మీరెవరు " అంటూ వీడియో

చిలుకూరు బాలాజీ టెంపుల్ ప్రధాన అర్చకులు రంగరాజన్ పై దాడి చేసారంటూ ఆరోపణలు,కేసులు ఎదుర్కొంటున్న "రామరాజ్యం" వీర రాఘవరెడ్డి గతంలో చేసిన వీడియోలన్నీ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. తమ ఆలయానికి కొచ్చే వాళ్ళ నుంచి "రామరాజ్యం " సంస్థకు సైనికులు వచ్చేలా ప్రభావం చూపాలని అలాగే ఆలయ భూములను ఆలయాన్ని తమకు అప్పజెప్పాలంటూ రంగరాజన్ పై దాడి చేశారనేది "రామరాజ్యం " వ్యవస్థాపకుడు వీర రాఘవ రెడ్డిపై ఉన్న ప్రధాన ఆరోపణ. ఈ విషయంలో ఇప్పటికే పోలీసులు అతడ్ని అదుపులోకి తీసుకున్నారు.
ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా "అనపర్తి " ప్రాంతానికి చెందిన వీర రాఘవరెడ్డి పై గతంలో కూడా పోలీస్ కేసులు నమోదు అయినట్లు చెబుతున్నారు. ఇప్పుడు రంగరాజన్ పై దాడితో ఒక్కసారిగా జనానికి తెలిసిన వీర రాఘవరెడ్డి గతంలో చేసిన వీడియోలన్నీ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. వాటిలో చిన్న జీయర్ స్వామిని కూడా టార్గెట్ చేస్తూ వీరరాఘవ రెడ్డి మాట్లాడిన వీడియో ఇప్పుడు తెరపైకి వచ్చింది.
" గోత్రాలను సంకరం చేస్తారా చిన్న జీయర్ "అంటూ వీడియో చేసిన వీర రాఘవ రెడ్డి
అతిపెద్ద రామానుజ స్వామి విగ్రహాన్ని తెలంగాణలో ఏర్పాటు చేసిన చిన్న జీయర్ గోత్రాలను కలిపేస్తున్నారనేది "రామరాజ్యం" వీర రాఘవరెడ్డి ఆరోపణ. తన దగ్గరకు వచ్చే వారిని "రామానుజ " గోత్రీకులుగా చిన్న జీయర్ పిలుస్తారని దానివల్ల గోత్రాలన్నీ మారిపోతున్నాయని రాఘవ రెడ్డి వీడియో చేశారు. "మహిపాల" గోత్రానికి చెందిన తాము వివాహాలు చేసుకోవడానికి కొన్ని గ్రోత్రాలు ఉన్నాయని అలాంటిది చిన్న జీయర్ గోత్రాలన్నీ కలిపేస్తే ఎలా "
అనేది రాఘవరెడ్డి వాదన. మూడు నెలల క్రితం చేసిన ఈ వీడియో ఇప్పుడు తాజా వివాదం నేపథ్యంలో చూసేవాళ్ళు సంఖ్యను పెంచుకుంటోంది. దానితో " రామరాజ్యం " రాఘవరెడ్డి టార్గెట్ లో చిన్న జీయర్ స్వామి కూడా ఉన్నారా అని నెటిజెన్స్ చర్చించుకుంటున్నారు.
" రామరాజ్యం "అంటే ఇది కాదు : చిన్న జీయర్
ఈ వివాదంపై చిన్న జీయర్ స్వామి కూడా స్పందించారు. " రామ రాజ్యం " సాధించడం పెద్ద కష్టమేమి కాదని అందరూ తలుచుకుంటే సులభమే అని ఆయన అన్నారు. అయితే ఇలా హింసాత్మక ధోరణులతో సాధించేది రామరాజ్యం కాదని ఆయన హితువు పలికారు.
అసలు ఎత్తుగడ ఆలయ భూముల కోసమేనా?
ఏపీ తెలంగాణలో కలిపి 27,800 గ్రామాలు ఉన్నాయని ఒక్కొక్క ఊరు నుంచి కనీసం ఒక్కొక్క సైనికుడు తనతో కలిసి వచ్చినా రామరాజ్య స్థాపన సాధ్యమంటూ వీర రాఘవరెడ్డి గత కొంతకాలంగా ప్రచారం చేస్తున్నాడు. ఆ కోణంలోనే ఆయన పలు వీడియోలు కూడా తన యూట్యూబ్ ఛానల్ లో పోస్ట్ చేసారు. అయితే ఆయన ప్రసంగాలను పరిశీలించిన వారు ఇదంతా ఆలయాల పేరుతో ఉన్న భూముల పై అజమాయిషీ కోసం దేవాలయాలపై ఆధిపత్యం కోసం వీర రాఘవ రెడ్డి చేస్తున్న ప్రయత్నాలని ఇందులో భాగంగానే చిలుకూరు బాలాజీ టెంపుల్ రంగరాజన్ పై ఈ నెల 7న బెదిరింపులకు పాల్పడ్డారని సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. ఇప్పుడు పోలీస్ పరిధిలో ఈ కేసు ఉండడంతో రానున్న రోజుల్లో మరెన్ని సంచలనాత్మక విషయాలు బయట పడతాయో అని సామాన్యులు ఎదురు చూస్తుంటే.. మరోవైపున హిందూ భక్తుల నుండి ప్రముఖుల నుండి రంగరాజన్ కు పెద్ద ఎత్తున మద్దతు లభిస్తోంది. ఇలా దాడులకు దిగడం హిందూ ధర్మ లక్షణం కాదంటూ " రామరాజ్యం" వీర రాఘవరెడ్డి చర్యను నిరసిస్తున్నారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

