Sankranti Traffic Jam: సంక్రాంతికి ఊరెళ్తున్నారా? ట్రాఫిక్ బాధలు లేకుండా ఈ రూట్ మ్యాప్ ఫాలో అవ్వండి
Panthangi Toll Plaza: పండుగకు సొంతూరికి వెళ్తున్న వారు ట్రాఫిక్ జామ్‌లో చిక్కుకుని ఇబ్బంది పడుతున్నారు. హైదరాబాద్ నుంచి సొంతూరికి వెళ్తున్న వారి కోసం పోలీసులు ప్రత్యామ్నాయ మార్గాలు సూచించారు.

Traffic at Hyderabad- Vijayawada Panthangi toll plaza | హైదరాబాద్: సంక్రాంతి పండుగ సమయంలో హైదరాబాద్ నుంచి సొంతూళ్లకు వెళ్లే వారు ట్రాఫిక్ లో గంటల తరబడి చిక్కుకుపోతుంటారు. కొందరైతే వీలును బట్టి మూడు, నాలుగు రోజుల ముందే సొంతూరికి వెళ్లిపోతుంటారు. అయితే అందరికీ అలా కాదు. సాఫ్ట్ వేర్ రిలెటెడ్ ఉద్యోగులు శుక్రవారం డ్యూటీ ముగిసినప్పటి నుంచి తమ జర్నీ మొదలుపెడతారు. శనివారం లీవ్ దొరికే వారు సైతం నిన్న రాత్రి నుంచే హైదరాబాద్ నుంచి సొంతూరికి పయణమవుతున్నారు. ఈ క్రమంలో హైదరాబాద్- విజయవాడ నేషనల్ హైవేపై పంతంగి టోల్‌ప్లాజా వద్ద భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయి ఇబ్బంది పడుతున్నారు. పండుగ సమయాన్ని చూసుకుని ప్రైవేట్ ట్రావెల్స్ నిర్వాహకులు మూడింతలు సైతం ఛార్జీలు వసూలు చేసి సామాన్యుడి జేబును గుల్ల చేస్తున్నారు.
పంతంగి టోల్ ప్లాజా వద్ద 16 టోల్ బూత్‌లు ఉండగా, రద్దీని దృష్టిలో ఉంచుకుని ఏపీ వైపు 10 ఓపెన్ చేయగా, హైదరాబాద్ వైపు వచ్చే వారి కోసం 6 టోల్ బూత్‌లు తెరిచి వాహనాలను పంపిస్తున్నారు. ఆదివారం రద్దీ మరింత పెరగనుంది. గత ఏడాది సైతం పండుగకు రెండు రోజుల ముందు నుంచే విపరీతమైన రద్దీ కనిపించింది. సంక్రాంతికి హైదరాబాద్ నుంచి సొంతూరికి వెళ్లే వారికి పోలీసులు ప్రత్యామ్నాయ మార్గాలు సూచించారు.
ఖమ్మం, విజయవాడ వైపు వెళ్లేవారికి రూట్ మ్యాప్..
హైదరాబాద్ నుంచి ఖమ్మం, విజయవాడ వైపు వెళ్లే వాహనదారులు భువనగిరి, రామన్నపేటల మీదుగా చిట్యాల చేరుకోవాలని పోలీసులు సూచించారు. ఆపై నార్కట్‌పల్లి దాటారంటే వీరికి ట్రాఫిక్ సమస్యలు తప్పుతాయి. కొన్ని వాహనాలు నార్కట్‌పల్లి నుంచి మిర్యాలగూడ మీదుగా అద్దంకి, చెన్నై వైపు వెళ్తుంటాయి. అటు కేతేపల్లి మండలంలోని కొర్లపహాడ్ టోల్ గేట్ (Toll Plaza) దాటాక కొన్ని వాహనాలు ఉమ్మడి ఖమ్మం జిల్లా వైపు వెళ్తుండగా, కొన్ని వాహనాలు విజయవాడ వైపు వెళ్తాయి. తరువాత వచ్చే 2 టోల్‌ప్లాజాల వద్ద అంతగా వాహనాల రద్దీ ఉండదు. కనుక ట్రాఫిక్‌జామ్ చాలా తక్కువగా ఉంటుంది.
గుంటూరు, నెల్లూరు వైపు వెళ్లే వారికి రూట్ మ్యాప్...
హైదరాబాద్ నుంచి గుంటూరు, నెల్లూరు జిల్లాల వైపు వెళ్లే వారికి పోలీసులు ఈ మార్గం సూచించారు. గుంటూరు, అద్దంకి, మాచర్ల, ఒంగోలు, నెల్లూరు వైపు వెళ్లే వాహనదారులు నార్కట్‌పల్లి-అద్దంకి జాతీయ రహదారిపై ప్రయాణిస్తుంటారు. వీరు విజయవాడ రహదారిపై వస్తే హయత్‌నగర్, అబ్దుల్లాపూర్‌మెట్, చౌటుప్పల్, పంతంగి టోల్‌ప్లాజా (Panthangi Toll Plaza) వద్ద ట్రాఫిక్‌లో చిక్కుకునే ఛాన్స్ ఉంది.
అందుకే మీకు కొంతదూరం పెరిగినా సరే హైదరాబాద్- నాగార్జునసాగర్ హైవే మీదుగా వెళ్లాలని పోలీసులు సూచించారు. గంటల తరబడి ట్రాఫిక్‌లో చిక్కుకోవడం కన్నా కొంతదూరం ఎక్కువ ప్రయాణం బెటర్ ఆప్షన్ అంటున్నారు. హైదరాబాద్ నుంచి వెళ్లే ప్రయాణికులు ఔటర్ రింగ్ రోడ్డు (Hyderabad Outer Ring Road) పైకి వెళ్లి బొంగులూరు గేట్ వద్ద ఎగ్జిట్ అయి నాగార్జునసాగర్ హైవేలోకి ప్రవేశిస్తారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

