Amaravati Outer Ring Road: అమరావతి ఓఆర్ఆర్ ప్రాజెక్టులో కీలక పరిణామం- అలైన్‌మెంట్‌కు అప్రూవల్ కమిటీ ఆమోదం
Amaravati ORR News | ఏపీ రాజధాని అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణం ప్రాజెక్టు సంబంధిత అలైన్ మెంట్‌కు కేంద్రం ప్రాథమికంగా ఆమోదం తెలిపింది. నాలుగు చోట్ల మార్పులు సూచించింది.

Amaravati Outer Ring Road Project | అమరావతి: అమరావతి ఔటర్ రింగ్ రోడ్ (Amaravati ORR) కు సంబంధించి కీలక పరిణామం చోటుచేసుకుంది.. కూటమి పంపిన 189.4 కిలోమీటర్ల 6 వరుసల యాక్సెస్ కంట్రోల్ ఓఆర్‌ఆర్ ఎలైన్‌మెంట్ ప్రతిపాదనకు కేంద్ర రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వశాఖ ఆమోదించింది. కేంద్ర రహదారుల శాఖ ఎలైన్‌మెంట్ అప్రూవల్ కమిటీ అమరావతి ఓఆర్ఆర్‌కు ప్రాథమికంగా ఆమోదం తెలిపింది.
నాలుగు చోట్ల మార్పులకు సూచన
విజయవాడ తూర్పు బైపాస్ (Vijayawada Bypass) నిర్మాణం అక్కర్లేదని తేల్చేసింది. అమరావతి ఓఆర్‌ఆర్‌కు దగ్గరగానే వెళ్తుండడంతో తూర్పు బైపాస్ అవసరం లేదని స్పష్టం చేసింది. ఓఆర్ఆర్, విజయవాడ తూర్పు బైపాస్ మధ్య ఎక్కువ దూరం లేదని దాంతో 4 వరుసల ప్రతిపాదిత బైపాస్ అక్కర్లేదని కమిటీ పేర్కొంది. చెన్నై- కోల్‌కతా హైవేలో కాజ వద్ద పూర్తయ్యే విజయవాడ పశ్చిమ బైపాస్ ను అమరావతి ఓఆర్‌ఆర్‌తో అనుసంధానం చేయాలని సూచించారు. కాజ నుంచి ఓఆర్‌ఆర్‌కు 18 కి.మీ. లింక్ రోడ్ నిర్మిస్తారు. కాజ జంక్షన్ వద్ద ఫ్లవర్‌లీఫ్ ఇంటర్‌ఛేంజ్‌ను నిర్మించే అవకాశం ఉంది. అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు ప్రాజెక్టులో 4 చోట్ల స్వల్ప మార్పులు చేయాలని సూచించింది. గత ఏడాది డిసెంబర్ 20న మోర్త్ ఎలైన్‌మెంట్ అప్రూవల్ కమిటీ భేటీ కాగా, అందులో తీసుకున్న నిర్ణయాలు ఇప్పుడు బయటకు వచ్చాయి.
ఓఆర్ఆర్‌కు అప్రూవల్ కమిటీ ప్రాథమిక ఆమోదం
ఏపీ ప్రభుత్వం 189.4 కిలోమీటర్లతో అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు ప్రాజెక్టు కోసం ఎలైన్‌మెంట్‌ను ప్రతిపాదించగా మోర్త్ అప్రూవల్ కమిటీ కమిటీ ఆమోదం తెలిపింది. ఈ ఓఆర్ఆర్ లో సివిల్‌వర్క్స్, భూసేకరణ పనులతో కలిపి అంచనా వ్యయం రూ. 16,310 కోట్లు. జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (NHAI) అధికారులు ఇటీవల అమరావతి ఓఆర్ఆర్ ఎలైన్‌మెంట్‌ను డ్రోన్ సర్వే ద్వారా పరిశీలించడం తెలిసిందే. ఓ చోట గోదాములు, 2 చోట్ల చేపల చెరువులు, ఇంకో ప్రాంతంలో ఇటుకలతో నిర్మాణాల్ని గుర్తించారు. ఈ 4 చోట్ల ఓఆర్ఆర్ ఎలైన్‌మెంట్‌లో స్వల్ప మార్పులు చేయాలని అప్రూవల్ కమిటీ సూచించింది. రాష్ట్ర జీఎస్టీ మినహాయింపుతో పాటు సిమెంట్, స్టీల్, బిటుమిన్, కంకర, గ్రావెల్ తదితరాలకు సీనరేజ్ ఫీజు మినహాయింపుపై సీఎం చంద్రబాబు ప్రకటనతో వ్యయం రూ. 1,156 కోట్లు తగ్గడంతో ప్రాజెక్టు వ్యయం రూ. 15,154 కోట్లు అయింది.
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణ పనులను సంక్రాంతి పండుగ తరువాత పునఃప్రారంభిస్తామని ఏపీ ప్రభుత్వం ఇటీవల తెలిపింది. ఆ దిశగానే అడుగులు వేస్తూ కొత్త ఏడాది తొలి రోజునే పలు ప్రాజెక్టు పనులకు టెండర్లు సైతం ఆహ్వానించింది. ప్రపంచ బ్యాంకు, ఏషియన్ డెవలప్‌మెంట్ బ్యాంకు అమరావతికి నిధులు మంజూరు చేయడంతో పనులు వేగం పుంజుకోనున్నాయి. అమరావతిలో చేపట్టనున్న రూ. 2,323.25 కోట్ల విలువైన ఐదు కీలకమైన పనులకు అమరావతి డెవలప్‌మెంట్ కార్పొరేషన్, సీఆర్డీఏ టెండర్లు పిలిచాయి.
70 మీటర్లు భూసేకరణ చాలు
అమరావతి ఓఆర్‌ఆర్ నిర్మాణంలో భాగంగా 150 మీటర్ల వెడల్పు (రైట్ ఆఫ్ వే)తో భూసేకరణకు చంద్రబాబు ప్రభుత్వం ప్రతిపాదించింది. భవిష్యత్‌లో ORR వెంబడి రైల్వేలైన్ నిర్మాణం, తదితర ప్రాజెక్టులకు భూమి అవసరమని కూటమి ప్రభుత్వం పేర్కొంది. కానీ అమరావతి ఓఆర్ఆర్ 6 లేన్ల రహదారికి 70 మీటర్ల వెడల్పుతో భూసేకరణ చాలని, 8 లేన్ల విస్తరణకూ సరిపోతుందని అప్రూవల్ కమిటీ తెలిపింది. జాతీయ రహదారుల చట్టం ప్రకారం సేకరించిన భూమిని ఇతర అవసరాలకు వినియోగించకూడదని స్పష్టం చేశారు.
Also Read: Andhra Pradesh News: రెండు గ్రూపులుగా సచివాలయాల ఉద్యోగులు- ప్రభుత్వం సంచలన నిర్ణయం
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

