హోటల్ ఓనర్‌తో సారీ చెప్పించుకున్న నిర్మలా సీతారామన్, తమిళనాడులో క్రీమ్ బన్ను వివాదం
ఒకే ఒక్క వీడియో ప్రస్తుతం తమిళనాడు రాజకీయాల్లో మంట పుట్టించింది. ఓ రెస్టారెంట్ ఓనర్ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కి సారీ చెప్పిన వీడియో అది. సీతారామన్ ఎదురుగా సోఫాలో కూర్చున్న ఆయన లేచి నిలబడి చేతులు జోడించి మరీ క్షమాపణలు చెప్పారు. దీనిపైనే ప్రతిపక్షాలు ఫైర్ అవుతున్నాయి. ఇంతకీ ఈ వీడియో కథేంటంటే..ఈ మధ్యే జరిగిన GST మీటింగ్‌లో శ్రీ అన్నపూర్ణ రెస్టారెంట్ ఓనర్ శ్రీనివాసన్...కాస్తంత అసహనంతో మాట్లాడారు. నిర్మలా సీతారామన్ సమక్షంలోనే కొన్ని విమర్శలు చేశారు. బన్నుపైన ఎలాంటి జీఎస్‌టీ లేదు. క్రీమ్‌పైన 5% పన్ను వసూలు చేస్తున్నారు. అదే...క్రీమ్ బన్‌పై మాత్రం 18% GST వేస్తున్నారు. ఇదేంటని నిర్మలా సీతారామన్‌ని ప్రశ్నించారు అన్నపూర్ణ రెస్టారెంట్ ఓనర్ శ్రీనివాసన్. హోటల్‌కి వస్తున్న వాళ్లు "మీ క్రీమ్ మీ దగ్గరే ఉంచుకోండి. మాకు బన్ను చాలు" అని నవ్వుకుంటూ వెళ్లిపోతున్నారని చెప్పారు. కోయంబత్తూర్‌లో జరిగిన మీటింగ్‌లో ఈ కామెంట్స్ చేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.